Share News

నారిమన్ స్మృతి న్యాయనిష్ఠకు స్ఫూర్తి

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:29 AM

పాతికేళ్ల నాటి మాట. 1999లో ఒక రోజు అప్పటి కేంద్ర హోంమంత్రి లాల్‌కృష్ణ ఆడ్వాణీ నుంచి సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్‌కు ఫోన్ వచ్చింది. ‘రాజ్యసభకు మిమ్మల్ని నామినేట్...

నారిమన్ స్మృతి న్యాయనిష్ఠకు స్ఫూర్తి

పాతికేళ్ల నాటి మాట. 1999లో ఒక రోజు అప్పటి కేంద్ర హోంమంత్రి లాల్‌కృష్ణ ఆడ్వాణీ నుంచి సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్‌కు ఫోన్ వచ్చింది. ‘రాజ్యసభకు మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాము’ అని ఆడ్వాణీ ఆయనకు చెప్పారు. ‘నాకు ఇష్టం లేదు..’ నారిమన్ అని జవాబిచ్చారు. ‘నేను, వాజపేయి కలిసి నిర్ణయించాం. మీరు అంగీకరించాల్సిందే.. నేను ఇప్పుడే రాష్ట్రపతి వద్దకు వెళుతున్నాను’ అని ఆడ్వాణీ చెప్పారు. అనేక ఒత్తిళ్ల మధ్య నారిమన్ అందుకు అంగీకరించారు. అంతకు ముందు ఆయనను అటార్నీ జనరల్‌గా నియమించాలని దేవెగౌడ, వాజపేయి అనుకున్నప్పటికీ నారిమన్ అందుకు నిరాకరించారు. తనకు ఒక పార్టీ మనిషిగా గుర్తింపు రాకూడదని ఆయన భావించడమే ఇందుకు కారణం.

నారిమన్‌ను రాజ్యసభ సభ్యుడుగా బీజేపీ ప్రభుత్వం నామినేట్ చేసినప్పటికీ ఆయన వాజపేయి ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా ఉండలేదు. గుజరాత్ అల్లర్ల హింసాకాండను, ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయాలను ఆయన తీవ్రంగా నిరసించారు. ప్రతిపక్ష నేత సోనియా గాంధీతో పాటు గుజరాత్‌కు వెళ్లి ప్రజల మధ్య శాంతి నెలకొనేలా చేయాలని మరో నామినేటెడ్ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్ చేసిన సూచనను అమలు చేయాలని కోరారు. 1947లో కోల్‌కతా, నౌఖాలిలో అల్లర్లు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మహాత్మాగాంధీ ముస్లింలీగ్‌ నాయకుడు సుహ్రావర్దీతో కలిసి అక్కడికి వెళ్ళిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ నియమిస్తే దర్యాప్తు సరిగా జరుగుతుందని, ఈ కమిషన్‌కు విస్తృతాధికారాలు ఉంటాయని అడ్వాణీకి సభాముఖంగా నారిమన్ చెప్పారు. మోదీని కాపాడాలనే ఉద్దేశంతో ఉన్న ఆడ్వాణీ, నారిమన్ సూచనను పాటించలేదన్నది వేరే విషయం. ‘అధికార దురహంకారంతో ఉన్న వారు తాము చేసేవన్నీ సరైనవని భావిస్తారు. కాని అది వాస్తవం కాదు’ అని నారిమన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమను బీజేపీ ప్రభుత్వమే నామినేట్ చేసిందని తెలిసినప్పటికీ నానాజీ దేశ్‌ముఖ్, నారిమన్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులు ఎక్కడ ఉన్నా వాస్తవాలు చెప్పేందుకు వెనుకాడలేదు. అయినా వాజపేయి, ఆడ్వాణీ లాంటి నేతలు వారి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అది నాటి కాలం.

ఈ నెల 21న తన 93వ ఏట మరణించిన ఫాలీ నారిమన్ (1929–2024) సుదీర్ఘకాలం న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ ప్రజల హక్కుల గురించి పెద్దగా పోరాడిన వ్యక్తి కాకపోవచ్చు. భోపాల్ విషవాయు ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ తరఫున వాదించి ఉండవచ్చు. రాజకీయ పార్టీలు, పారిశ్రామికవేత్తలు అప్పగించిన పలు కేసులకు ప్రాతినిధ్యం వహించి ఉండవచ్చు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ న్యాయకళాశాలలో చదువుకుని న్యాయవాద వృత్తి చేపట్టిన తొలితరం న్యాయవాదుల్లో నారిమన్ ఒకరు. వలసవాదం నుంచి భారతదేశాన్ని విముక్తం చేసి మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగాన్ని చట్టాలకు, ప్రభుత్వ విధానాలకు అన్వయించేందుకు కృషి చేసిన న్యాయవాదుల్లో నారిమన్ ప్రముఖుడని ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల తరఫునా, ఆయన పరిశ్రమ తరఫునా వాదించినప్పటికీ తన క్లయింట్లు ఏది కోరుకుంటున్నారో అందుకు అనుగుణంగా నిర్దిష్టంగా, న్యాయసూత్రాలకు అనుగుణంగా వాదించి ఫలితాలను సాధించగల వృత్తి నైపుణ్యం ఆయనకు ఉండేదని ఆమె ప్రశంసించారు. న్యాయమూర్తిగా పనిచేసే అవకాశాలు కూడా కాదనుకుని జీవితాంతం న్యాయవాదిగానే ప్రాక్టీసు చేయడం ద్వారా ఆ వృత్తికి విలువ తీసుకువచ్చి తన తర్వాతి తరాల న్యాయవాదులను ప్రభావితం చేసిన వారిలో నారిమన్ ప్రథమ శ్రేణిలో ఉంటారనడంలో సందేహం లేదు.

ఫ్రీ మార్కెట్‌ను నారిమన్ విశ్వసించినప్పటికీ కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారని ఆయన జీవితంలో అనేక ఉదంతాలు నిరూపిస్తాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆయన తనకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చిన అదనపు సాలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం కేటాయించిన బంగళాను ఖాళీ చేయాల్సి రావడంతో ఆయనకు అద్దె ఇల్లు ఇచ్చేందుకు ఢిల్లీలో పలువురు నిరాకరించారు. ‘ఈ దేశంలో రాజ్యాంగ నిర్వాహకులపైనే ఆధారపడలేం’ అని ఆయన ఎమర్జెన్సీ గురించి రాశారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, చివరకు భారత రాష్ట్రపతి మొదలైన రాజ్యాంగ నిర్వాహకులు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘బిఫోర్ ద మెమోరీ ఫేడ్స్’ (జ్ఞాపకాలు చెరిగిపోకముందు) అన్న శీర్షికతో రాసిన తన ఆత్మకథలో నారిమన్ ఎమర్జెన్సీ సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా రాజీనామా చేసిన తర్వాత విశాఖపట్టణంలో న్యాయవాదుల సదస్సుకు హాజరైనప్పుడు ఒక నిర్వాహకుడు ఆయన వద్దకు వచ్చి లా కాలేజీలో చదువుతున్న తన కుమారుడిని మీసా కింద అరెస్టు చేశారని ఆందోళనతో చెప్పారు. ఇందిరాగాంధీ 20 సూత్రాలకు మద్దతుగా మరుసటి రోజు ఊరేగింపు జరపాలని క్లాసులో లెక్చరర్ చెప్పడంతో ఆ విద్యార్థి లేచి నిలబడి క్లాసులు జరుగుతున్న సమయంలో ఊరేగింపులేమిటి? అని అడిగాడట. ఇది అతడికి, కొందరు తోటి విద్యార్థులకూ మధ్య వాదనకు దారితీసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో దేశ భద్రతకు ఆ విద్యార్థి ముప్పుగా పరిణమించాడని జిల్లా మెజిస్ట్రేట్ నిర్ధారించడంతో పోలీసులు అర్థరాత్రి వెళ్లి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. న్యాయవాదుల సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ కూడా హాజరు కావడం, కొంతమంది పెద్దలు కలుగ చేసుకోవడంతో అతడి నిర్బంధపు టుత్తర్వులు రద్దు అయ్యాయి. కాని అప్పటికే ఆ విద్యార్థిని పోలీసులు రాష్ట్రంలో ఏదో మారుమూల జైలుకు తరలించారు. ఎందరో ప్రయత్నించిన మీదట అరెస్టయిన మూడు వారాల తర్వాత ఆ విద్యార్థి విడుదలయ్యాడు!

ఈ విషయాన్ని ఉటంకిస్తూ మీసా వంటి దుర్మార్గపు చట్టాలు అమలు చేసేటప్పుడు అధికారులు బాధ్యతారహితంగా, నిర్విచక్షణగా వ్యవహరిస్తారని, కోర్టులు కూడా అనేక సందర్భాల్లో జోక్యం చేసుకోబోవని నారిమన్ లాంటి ప్రముఖ న్యాయవాదే వ్యాఖ్యానించారు. ఇవాళ దేశంలో ఇదే పరిస్థితి కనపడుతోంది. ఎమర్జెన్సీలోనే కాదు, గుజరాత్‌లో క్రైస్తవ మతస్థులపై దాడులు జరిగినప్పుడు నారిమన్ గుజరాత్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించకుండా ఒక కేసు నుంచి తప్పుకున్నారు.

పలు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు నారిమన్ సలహాపై ఆధారపడేవారు. ఆలమట్టి కేసులో కర్ణాటక తరఫున నారిమన్, ఏపీ తరఫున గంగూలీ వాదించడం చూసినప్పుడు కళ్ల ముందు నదులు ప్రవహిస్తున్నట్లుండేది. నారిమన్ మూలంగా నీటిపారుదల రంగంలో కర్ణాటక అనేక ప్రయోజనాలు పొందింది.

భోపాల్ గ్యాస్ లీక్ కేసులో యూనియన్ కార్బైడ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు ఆయన పలు సందర్భాల్లో విచారం వ్యక్తం చేశారు. ‘ఫాలీ టూ వాజ్ ఫాలిబుల్’ (ఫాలీ నారిమన్ కూడా తప్పులు చేస్తాడు). ‘ఇది నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు’ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఎంత మంది న్యాయవాదులు తాము వృత్తి జీవితంలో చేసిన తప్పులు అంగీకరిస్తారు?’ అని ఇందిరా జై సింగ్ ప్రశ్నించారు.

నారిమన్ మరణించిన వేళ ఆయన సుదీర్ఘకాలం వాదించిన సుప్రీంకోర్టు నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందా అన్న ప్రశ్నను వేసుకోవడం అవసరం. తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు మనీలాండరింగ్ చట్టం క్రింద సమన్లు జారీ చేసే అధికారం ఈడీకి ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పుచెప్పింది. దీనితో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మెడలు కేంద్రం చేతుల్లోకి చిక్కుకోకతప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలు అందినప్పటికీ అలాంటివేవీ జరగలేదని జిల్లాకలెక్టర్లందరూ ఒకే వివరణ ఇచ్చారని సుప్రీంకోర్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదించింది. గుజరాత్‌లో కూడా పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏపీ, గుజరాత్‌తో సహా అన్ని రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఈడీ విచారించి అక్కడి కలెక్టర్లందరినీ కోర్టుకీడ్చాలని సుప్రీంకోర్టు చెప్పగలదా?

‘భగవంతుడే సుప్రీంకోర్టును కాపాడాలి’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై నారిమన్ ఒక పుస్తకం రాశారు. తాను వృద్దుడవుతున్న కొద్దీ, భారత రాజ్యాంగాన్ని, దాని పీఠికలో చేర్చిన లౌకిక వాదాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను ఆయన అధికంగా గుర్తించారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక వ్యక్తినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించిందని, సమూహాన్ని దృష్టిలో పెట్టుకుని కాదనే విలువను ఆయన విశ్వసించారు. భారత దేశంలో లౌకికవాదం అంటే ఏమిటో స్పష్టత లేదని, న్యాయవ్యవస్థ కూడా ఈ స్పష్టత నీయలేదని నారిమన్ మరో ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధావన్‌తో కలిసి రాసిన ఒక వ్యాసంలో అన్నారు. మతాన్ని రాజకీయాల నుంచి దూరం చేయాల్సిన అవసరం గురించి ఆయన ప్రస్తావించారు. మైనారిటీలను పరిరక్షించడానికే కాదు, మెజారిటేరియనిజం దాడినుంచి సమాజాన్ని కాపాడేందుకూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక మత శిబిరంలో రాకాసి బల్లుల జనాభా పెరిగితే, అది మరో మత శిబిరంలో వాటి పెంపకానికి దారితీస్తుందని ఆయన తన ఆత్మకథలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఒక మైనారిటీని అయినప్పటికీ లౌకిక భారతదేశంలోనే నాకు అన్ని అవకాశాలు లభించాయి. నేను లౌకిక భారతదేశంలోనే మరణించాలనుకున్నాను.’ అని తన జీవిత చరిత్ర చివరి వాక్యంలో ఆయన అన్నారు. తాను ఎలాంటి భారత దేశంలో మరణించారో ఆయనకు అర్థమై ఉండొచ్చు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Feb 28 , 2024 | 04:29 AM