Share News

రామమందిరం సరే, రామరాజ్యం ఎక్కడ?

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:56 AM

బాబ్రీ మసీదు కట్టడం నేలమట్టం కావడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సంఘటన సంభవించిన డిసెంబర్ 6, 1992 ముందు రోజు రామజన్మభూమి మీడియా సెంటర్ డైరెక్టర్ రమాశంకర్ అగ్నిహోత్రిని...

రామమందిరం సరే, రామరాజ్యం ఎక్కడ?

బాబ్రీ మసీదు కట్టడం నేలమట్టం కావడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సంఘటన సంభవించిన డిసెంబర్ 6, 1992 ముందు రోజు రామజన్మభూమి మీడియా సెంటర్ డైరెక్టర్ రమాశంకర్ అగ్నిహోత్రిని కలిసినప్పుడు ఆ కట్టడాన్ని కూల్చివేయనున్నారని ఆయన సూచన ప్రాయంగానైనా వెల్లడించలేదు (అగ్నిహోత్రి సాధారణ వ్యక్తి కాదు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ ఆర్ఎస్ సుదర్శన్‌ను స్వయం సేవక్‌గా మార్చిన వ్యక్తి) ఆ మరునాడు ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్, సాధ్వీ రితంబర తదితరులు ఉద్వేగపూరితంగా, ఉద్రిక్తభరితంగా ప్రసంగాలు చేస్తుండగా కరసేవకులు బాబ్రీ కట్టడాన్ని కూల్చివేశారు. గుమ్మటాలపై ఎక్కినవారు వాటిని కూలుస్తూనే తాము కూడా శిథిలాలతో పాటూ నేల కూలిపోతున్నా ఆ భావోద్వేగంలో వారు లెక్కచేయలేదు. ఆ కట్టడం కూల్చివేసిన స్థలంలోనే మూడు దశాబ్దాల తర్వాత శ్రీరాముడి మందిరాన్ని ప్రారంభిస్తారని నాడు ఎవరనుకున్నారు? ఆ బీభత్స దృశ్యాలూ ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. దేశ ప్రజలకు ఇవాళ అయోధ్యలో శ్రీరాముడి మందిరం మాత్రమే కనపడవచ్చు. కాని దాని వెనుక ఉన్న చరిత్ర, ఆ చరిత్రలో జరిగిన విధ్వంసం, వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం గురించి ఇప్పుడెక్కడా చర్చ జరగడం లేదు.

రామమందిరంకోసం నాడు బీజేపీ నేత ఆడ్వాణీ రథ యాత్ర జరిపారు. ఈ రథయాత్ర మూలంగా బీజేపీ రాజకీయంగా బలపడింది. 1989 ఎన్నికలతో పోలిస్తే 1991లో బీజేపీ దేశ వ్యాప్తంగా తన ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకున్నది. పార్లమెంట్‌లో రెండవ అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఇవాళ అదే రామమందిరం నిర్మాణం ఘనతను తనకు ఆపాదించుకున్న నరేంద్రమోదీ ఈ మందిరం ఆధారంగా 2024లో మూడోసారి గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రీరాముడు, రామమందిరం బీజేపీ రాజకీయ ఎజెండా మాత్రమేనని ఇవాళ అందరికీ తెలుసు. రామమందిరాన్ని నిర్మించింది ట్రస్ట్ అయితే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ ఎందుకు భావిస్తోంది? రథయాత్ర ప్రారంభించి, బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రత్యక్షంగా తిలకించిన ఆడ్వాణీకి ఇవాళ ఈ మందిర ప్రారంభోత్సవ ఘట్టంలో ఎక్కడా ప్రాధాన్యత లభించడం లేదు. ప్రధాని మోదీయే ఆ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. మందిర నిర్మాణాన్ని దేశ చరిత్రలో ఒక బృహత్తర ఘట్టంగా జరుగుతోన్న ప్రచారానికి ఆయనే సారథ్యం వహిస్తున్నారు. గత వారం బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆలయ ప్రారంభోత్సవమే ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఈ ఆలయ నిర్మాణంలో బీజేపీ ఎలాంటి కీలక పాత్ర పోషించిందీ ఇంటింటికి వెళ్లి వివరించమని మోదీ ఆదేశించారు. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజు ప్రతి భారతీయుడి ఇంటిలో మరో దీపావళి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మళ్లీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించి జనవరి 22 తర్వాత అయోధ్యలో రామమందిర ప్రారంభం తర్వాత పెద్ద ఎత్తున మందిర్ దర్శన్ అభియాన్‌ను ఎలా కొనసాగించాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నిర్ణయించారు. మందిర ప్రారంభాన్ని దేశమంతటా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది ప్రజలు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర కోట్లమందిని అయోధ్యకు రప్పించి దర్శనం చేయించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

ఒకప్పుడు మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడంపై దేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. రాను రానూ మతాన్ని ఉపయోగించుకోవడం సర్వసాధారణమైపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి స్వయంగా ‘జై బజరంగ్ బలీ’ అని నినాదాలు చేశారు. అధికారంలో ఉన్న పార్టీ బాహాటంగా మతాన్ని ఉపయోగించుకునేందుకు రామమందిర ప్రారంభం ఇప్పుడు స్పష్టంగా ఉపయోగపడుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో పుల్వామా, బాలాకోట్ మోదీకి ఆయుధాలుగా మారితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం ప్రధానాస్త్రంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రజల్లో నెలకొన్న భక్తి విశ్వాసాలను ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యంలో సరైనదేనా? దీనిపై న్యాయస్థానాలు కానీ, ఎన్నికల కమిషన్ కానీ కలుగచేసుకునే అవకాశాలు లేవా? అయినా ఇవాళ వ్యవస్థలు స్వతంత్రంగా, విచక్షణాయుతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎక్కడిది?

బాల్యంలో ఆంజనేయుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారం. హనుమంతుడి కథలు విని నడుముకు తోకలాగా ఏదో గుడ్డ తగిలించుకుని ఆడుకునేవారం. రాముడిలా చీపురుపుల్లలతో బాణాలు వేసేవారం. ఎన్టీఆర్ శ్రీరాముడి వేషంతో రాక్షసులను వధిస్తుంటే ఉత్కంఠతో చూసేవారం. సీతారామకల్యాణం సినిమా టిక్కెట్లకోసం కిక్కిరిసిన లైన్లలో నిలుచున్న దృశ్యం ఇంకా గుర్తుంది. లైబ్రరీలో బాలల బొమ్మల రామాయణం ఆసక్తిగా చదువుకునేవారం. పెద్దలు రామకోటి రాస్తుంటే చూసేవారం. శ్రీరామ నీవే కలవు అన్న అక్షరాలతో అమ్మ నాడు రాసిన ఉత్తరాలు ఇంకా ఉన్నాయి. కాని నాడెవరూ శ్రీరాముడిని రాజకీయాలకు ఉపయోగించుకోలేదు. సీత అగ్నిప్రవేశం, శంబూక వధ లాంటిపై ప్రశ్నలు రేగినప్పటికీ ఒక కథగా రామాయణం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. విన్నంతవరకూ, చదివినంతవరకూ శ్రీరాముడు స్థితప్రజ్ఞుడు. సత్యవాక్పరిపాలకుడు. మర్యాద పురుషోత్తముడు. ‘విభీషణుడు శరణు కోరితే మీరు అతడికి లంకనే ఇచ్చేశారు. రావణుడు కూడా లొంగిపోయి ఉంటే ఏం చేసేవారు?’ అని రాముడిని సుగ్రీవుడు అడుగుతాడు. ‘రావణుడే కనుక లొంగిపోతే అతడికి అయోధ్యను కానుకగా ఇచ్చి నా సోదరులతో కలిసి అడవుల్లో నివసించేవాడిని’ అని రాముడు జవాబిస్తాడు. నాటి రాముడు అధికారానికి, పదవులకు అతీతుడు. తృణప్రాయంగా పదవిని వదులుకున్నవాడు. కాని రాముడిని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న నేటి బీజేపీ నేతలు ఎటువంటివారు?


రామరాజ్యం సుపరిపాలనకు సంకేతం అంటారు. రాముడు వేలాది సంవత్సరాల పాటు చేసిన పాలనలో వృద్ధులు యువకులకు అంత్యక్రియలు జరపాల్సిన అవసరం లేదు అని వాల్మీకి యుద్ధకాండలో రామరాజ్యాన్ని వర్ణించాడు. అంటే అకాల మరణాలు ఉండేవి కావని అర్థం. రామరాజ్యం ఎలా ఉండేది? సామాజిక సామరస్యం, న్యాయం వెల్లివిరిసేవి. ఎలాంటి రోగాలు, బాధలు లేకుండా ప్రజలు జీవించేవారు. అసలు ప్రజలు దాన ధర్మాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది కాదు. అందరూ సమాన హక్కులతో జీవించేవారు. అందరూ విద్యావంతులై ఉండేవారు. శాంతిభద్రతల పరిస్థితి కానీ, అంతర్గత కల్లోలాలు కానీ, ఇతర రాజ్యాల నుంచి సమస్యలు కానీ ఉండేవి కాదు. ప్రజల సంక్షేమం తప్ప రాముడికి వేరేది పట్టేది కాదు. రాజుగా తాను విఫలమైతే అంతకంటే శాపం మరొకటి లేదనుకునేవాడు. ఆదాయం ఎప్పుడూ వ్యయం కంటే ఎక్కువగా ఉండేది. పన్నులు ప్రజలకు ఏ మాత్రం భారం అయ్యేవి కాదు. అంతా సుభిక్షంగా జీవించేవారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా విధానాల రూపకల్పన జరిగేది. రాజ్యం భూలోక వైకుంఠంలా ఉండేదని వాల్మీకి ఒక్క మాటలో వర్ణించారు.

మహాత్మాగాంధీ కూడా శ్రీరాముడు చారిత్రక పురుషుడా కాదా అన్నది పట్టించుకోలేదు. ఆయన రామరాజ్య భావన పైనే దృష్టి కేంద్రీకరించారు. రాజుకూ, పేదకూ సమాన హక్కులున్నాయని రామాయణం చెప్పిందని గాంధీ అన్నారు. ‘1921లో సరయూ నది ఒడ్డున సాధువులతో గాంధీ రామరాజ్యం గురించి మాట్లాడారు. రాముడు సీతను ప్రేమించినట్లుగా, మనం బలహీనుల్ని కాపాడాలి. కేవలం మన రక్షణ కోసమే రాముడిని ఆరాధించడం పాపం అని స్పష్టీకరించారు’ అని ఆర్ఎస్ఎస్ నేత రామ్‌మాధవ్ కూడా ఒక రచనలో పేర్కొన్నారు. మరి ఇప్పుడెలాంటి రాజ్యం ఉన్నది? ఇవాళ ఒక రాజకీయ పార్టీ మతాన్నే తన అస్తిత్వంగా మార్చుకుంది.. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, పేదరికం, రైతుల ఆత్మహత్యలు, అధిక ధరలు, బలహీనుల అణచివేతలు, స్త్రీలపై అత్యాచారాలు, కొద్ది మంది సంపన్నులకు దేశ సంపదను ధారాదత్తం చేయడం, కోట్లాది ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని రక్షించడం. ప్రజలపై భారీ అప్పులు మోపడం, నేతలు అధికారం సంపాదించిన కొద్ది సంవత్సరాల్లోనే వేల కోట్ల ఆస్తులు పోగేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభాగ్యులు సరైన చికిత్స అందకుండా మరణించడం ఎల్లెడలా కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో గంగానదిలో శవాలు తేలిన, అభాగ్యులు మైళ్ల కొద్దీ నడుస్తూ, రైలు పట్టాలపై మరణించిన దేశమిది. ఈ దేశంలో 80 కోట్లమందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నానని ఈ దేశాధినేత చెప్పుకుంటారు. ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ అంటే మోదీ ‘గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అంటారు. ఏం తేడా?

ఇక ప్రజల హక్కుల గురించి ఏమి మాట్లాడగలం? పార్లమెంట్‌లోనే ప్రజా ప్రతినిధుల్ని బయటకు గెంటేసి ఇష్టం వచ్చినట్లు బిల్లులను ఆమోదిస్తున్నారు. వాల్మీకి ఒక కవిగా రామరాజ్యం గురించి కవితా గానం చేసి ఉండవచ్చు. కాని నేడు నేతలు అబద్ధాలతో, బూటకపు ప్రచారంలో నిత్యం నిమగ్నమయి ఉన్నారు. ప్రచారం లేకుండా వారికి పూటగడవని పరిస్థితి ఏర్పడింది. భారత రాజకీయాలు ఇప్పుడు సంధిదశలో ఉన్నాయి. అయోధ్యలో శ్రీరాముడి మందిరం ప్రారంభాన్ని వ్యతిరేకించే భారతీయులు తక్కువే కావచ్చు కానీ రామరాజ్యం ఏదీ, ఎక్కడ అని ప్రశ్నించాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 03 , 2024 | 12:56 AM