Share News

‘జాతీయ’ బంధాలలో ప్రాంతీయ పార్టీలు

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:41 AM

దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత రెండు సార్వత్రక ఎన్నికల్లోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించి పెట్టిన నరేంద్రమోదీ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. రామమందిర నిర్మాణాన్ని...

‘జాతీయ’ బంధాలలో ప్రాంతీయ పార్టీలు

దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత రెండు సార్వత్రక ఎన్నికల్లోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించి పెట్టిన నరేంద్రమోదీ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. రామమందిర నిర్మాణాన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చేందుకు ఎంత ప్రయత్నించినా అది ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీకి సానుకూలంగా మారుతుందో ఆ పార్టీ నేతలు కూడా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో మతం రాజకీయంగా భావోద్వేగపరమైన అంశంగా మారుతుందా అన్నది చర్చనీయాంశం. ‘రామమందిరం నిర్మాణం జరిగినందుకు దూకుడుగా వ్యవహరించకండి’ అని మోదీ తన మంత్రులకు చెప్పడం అతిగా ప్రచారం బెడిసికొడుతుందేమో అన్న భయానికి సంకేతం. ఇటీవల జరిగిన మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ ఓటు శాతం ఏ మాత్రం తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికలను కూడా మోదీ జాతీయ స్థాయి ఎన్నికలుగా మార్చడంతో ప్రాంతీయ పార్టీలను అక్కడి ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఎస్‌పి, బీఎస్‌పీలు మాత్రమే కాదు, ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందువల్ల ఈ మూడు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌ను కొట్టిపారేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కర్ణాటక, తెలంగాణ విజయాలతో పుంజుకున్న కాంగ్రెస్ ఈ సారి వివిధ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో పొత్తుల విషయంలో ఎన్ని త్యాగాలకైనా సిద్ధమన్న వైఖరిని ప్రదర్శించడంతో ఇండియా కూటమి ఈ సారి మోదీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్న సంకేతాలు కనపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు స్పష్టంగా రెండు కూటములు, రెండు భావజాలాల మధ్య పోటీగా మారబోతున్నాయనడంలో సందేహం లేదు. బీజేపీ, దాని మిత్రపక్షాలు– కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మధ్య జరిగే ఈ ప్రధాన పోటీలో ఇతర ప్రాంతీయ పార్టీల పాత్ర బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల హవా 2014 నుంచీ తగ్గిపోతూ వస్తోంది. 1989–2014 మధ్య జాతీయ పార్టీలకు మెజారిటీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం బాగా పెరిగింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏ జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. 2014 తర్వాత లోక్‌సభలో బీజేపీ మెజారిటీ సాధించడం, యూపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీదే పైచేయి కావడంతో ప్రాంతీయ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. 2019 తర్వాత ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం వాటికి ఏర్పడింది.

కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా ప్రాంతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారు. కర్ణాటకలో జెడి(ఎస్) బాగా దెబ్బతినగా, తెలంగాణలో బీఆర్ఎస్ తానెక్కిన కొమ్మను తానే నరుక్కుంది. కుమారుడి భవిష్యత్ కోసం జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ తన చరమ దశలో మోదీ చెంతకు చేరేందుకు సిద్ధపడ్డారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్‌ను బీజేపీ అధికారికంగా చేరదీస్తుందా, లేక బీఆర్ఎస్ మటుమాయమైపోతే ఆ స్థానంలో తాను బలపడాలని భావిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం త్వరలో లభించవచ్చు. ఏమైనా బీఆర్ఎస్ మళ్లీ ఒకప్పటి పోరాట స్ఫూర్తితో పనిచేస్తేనే కాని కోలుకునే అవకాశాలు లేవు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న విషయం స్పష్టమైంది. అధికార వర్గాలు, గ్రామీణ ప్రజలు, రాజకీయ పరిశీలకులు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారానికి వచ్చే అవకాశాలు లేవని గట్టిగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వేడెక్కిన రాజకీయ వాతావరణం జగన్‌కు ప్రతికూలంగా, తెలుగుదేశం–జనసేనకు అనుకూలంగా కనపడుతోంది. నిజానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు తాను గత ఎన్నికల్లో జగన్‌కు సహాయపడే బదులు చంద్రబాబు తరఫున పనిచేసి ఉంటే బాగుండేదని అన్నారు. ‘జగన్ ఒక వన్ టైమ్ వండర్’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఓటు బ్యాంకు ద్వారా జగన్ బలపడ్డారో ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు జగన్ చెల్లెలు షర్మిలను కాంగ్రెస్ ప్రయోగించడం ఇటీవల జరిగిన ఒక కీలక పరిణామం. 2010లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినకుండా పదవీకాంక్షతో ప్రాంతీయ పార్టీని స్థాపించారు. ఆయన జైలులో ఉన్నప్పుడు అన్న ప్రయోజనాలు కాపాడేందుకు షర్మిల ఎంతో కష్టపడ్డారన్నది జగద్విదితం. ఒక దశలో షర్మిల, తల్లి విజయమ్మ కలిసి ఎవరికి తెలియకుండా ఉండేందుకు బెంగళూరు ద్వారా ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ పెద్దలతో జగన్ తరఫున రాజీకి ప్రయత్నించారు. ఇటీవల సోనియా, రాహుల్ గాంధీలను ఆమె కలుసుకున్నప్పుడు సొంత కుటుంబసభ్యురాలిని కలుసుకున్నట్లుగా వారు సంతోషించారు. ‘అన్న లాగా షర్మిల వేరు కుంపటి పెడితే ఏం చేస్తారు’ అని ఒక ఏపీ కాంగ్రెస్ నేత ప్రశ్నించినప్పుడు ‘ఆమె ఇక కాంగ్రెస్ మనిషి. అది మా గ్యారంటీ’ అని ఖర్గే, రాహుల్ అన్నట్లు సమాచారం. ప్రజలు అందలమెక్కించినప్పటికీ తనకు తానే నష్టం చేసుకున్న జగన్ కేసీఆర్ కోవలోకి చేరిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలక్రమేణా ఏపీలో కూడా ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీలే రంగంలో మిగిలిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

ఇక ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నది? ఒడిషాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూజనతాదళ్ గత ఎన్నికల్లో అయిదోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నవీన్ పట్నాయక్ అనంతరం బీజేడీ భవిష్యత్ అగమ్యగోచర పరిస్థితిలో పడడం తమకు ప్రయోజనకరమని బీజేపీకి తెలుసు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ది పై చేయిగా ఉన్నప్పటికీ బీజేపీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్, తదితర పార్టీలతో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. బిహార్‌లో ఆర్‌జేడీకి గత లోక్‌సభలో ఒక సీటు కూడా రాలేదు. బీజేపీతో పొత్తు మూలంగా జనతాదళ్ (యు) లోక్‌సభలో 16 సీట్లు గెలిచింది కాని అది స్వంత బలం కాదు. అందువల్ల ఇప్పుడు మోదీ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్‌తో కలిసి పోరాడక తప్పదు. యూపీలో సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపించలేకపోతే ఆయన భవిష్యత్ కూడా సమస్యలో పడుతుంది. కనుక ఆయన కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సిన అగత్యం ఏర్పడింది. ఒకప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాయావతికి ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క సీటే ఉన్నది. అదృశ్యమయ్యే ప్రాంతీయ పార్టీల జాబితాలో బిఎస్‌పి చేరకుండా ఆమె ఏమి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరం. ‘80 ఏళ్లు దాటినా కొందరు రాజకీయాలను పట్టుకుని వేళ్లాడుతుంటారు’ అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన బాబాయి, ఎన్‌సీపీ నేత శరద్ పవార్ గురించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రెండు ముక్కలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని బతికించి తన కుమార్తె సుప్రియా సూలే భవిష్యత్‌ను కాపాడేందుకు 84 ఏళ్ల శరద్ పవార్ తీవ్ర పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన కూడా రెండు ముక్కలై పార్టీ ఎన్నికల గుర్తు కూడా కోల్పోయింది. మోదీ ధాటికి తట్టుకోలేక కకావికలైన ఎన్‌సీపీ(శరద్ పవార్), శివసేన(ఉద్దవ్ థాకరే)లకు కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఎదుర్కోవడం మినహా వేరే మార్గం లేదు.

ఢిల్లీ, పంజాబ్‌లలో ఒకప్పుడు కాంగ్రెస్‌పై పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నరేంద్రమోదీ తమపై కేంద్ర ఏజెన్సీలను ప్రయోగించడం మూలంగా దిక్కుతోచని పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో రాజీపడాల్సివస్తోంది. జార్ఖండ్‌లో జేఎంఎం, తమిళనాడులో డీఎంకే మొదటి నుంచీ కాంగ్రెస్‌తో ఉన్నవే. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న అన్నాడీఎంకే ఎటువైపు వెళుతుందో ఎన్నికల తర్వాత తేలుతుంది.

ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇండియా కూటమికి చెందిన పార్టీల ఎంపీలు అందరినీ మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే బహిష్కరించింది. ఈ బహిష్కరణ మూలంగానే కాక, ఏజెన్సీలను ప్రయోగించడం వల్ల కూడా ఆ పార్టీలన్నీ గత్యంతరం లేక మరింత సంఘటితం అవుతాయని, తమను ఎదుర్కొనేందుకు సిద్ధపడతాయని మోదీకి బాగా తెలుసు. ఆయన కూడా తన వైపుకు వచ్చే పార్టీలను కూడా కలుపుకుని ‘ఇండియా’ కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు. ఒకరకంగా ఇది మోదీ చేస్తున్న మరో బలమైన ప్రయోగం. ఎందరు ఎదురొచ్చినా తాడో పేడో తేల్చుకునేందుకు ఆయన తన సర్వశక్తులు ఒడ్డి పోరాడాలనుకుంటున్నారు. దేశంలో రాజకీయ పోరాటాన్ని ఆయనే రెండు కూటముల మధ్య ఘర్షణగా మార్చారు. ఈ ఘర్షణలో బీజేపీ ప్రభంజనం వీస్తే దేశంలో ఎన్ని పార్టీలు అస్తిత్వ పరీక్షలో పడతాయో చెప్పలేము. కాని మోదీ పుణ్యమా అని ఏకమైన ఇండియా కూటమి కూడా బలంగా రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తోంది. అతి వేగంగా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లు కుదుర్చుకుంటోంది. బీజేపీ, ఇతర రాజకీయ ప్రత్యర్థులతో ముఖాముఖి తలపడే సీట్లపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. రామమందిరం లాంటి భావోద్వేగ అంశాల జోలికి పోకుండా కేవలం రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయానికి సంబంధించిన అంశాలపైనే వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళుతోంది. దెబ్బతిన్న పులిలా రాహుల్ గాంధీ మరోసారి దేశంలో జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికలు రాహుల్, కాంగ్రెస్, ఇండియా కూటమి భవిష్యత్‌నే కాదు, దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలని చెప్పక తప్పదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 10 , 2024 | 02:41 AM