Share News

మోదీకి రాముడు, ఆమ్ ఆద్మీకి ఎవరు?

ABN , Publish Date - Jan 24 , 2024 | 01:30 AM

అయోధ్యలో సోమవారం రామమందిరంలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ భారతదేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఒక కీలక ఘట్టంగానే భావించాలి. 1992 డిసెంబర్ 6న పి.వి.నరసింహారావు హయాంలో జరిగిన...

మోదీకి రాముడు, ఆమ్ ఆద్మీకి ఎవరు?

అయోధ్యలో సోమవారం రామమందిరంలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ భారతదేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఒక కీలక ఘట్టంగానే భావించాలి. 1992 డిసెంబర్ 6న పి.వి.నరసింహారావు హయాంలో జరిగిన బాబ్రీ మసీదు కట్టడ విధ్వంసపు తార్కిక ముగింపు 2024 జనవరి 22న జరిగింది. ఈ మధ్యకాలం అంతా భారతీయ జనతా పార్టీ చారిత్రక ప్రయాణం ఒక శిఖరాధిరోహణగా చెప్పవచ్చు. 1991లో 89 సీట్లున్న బీజేపీ ఆ తర్వాత దినదిన ప్రవర్థమానమవుతూనే వచ్చింది. పదేళ్ల పాలన ముగింపు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాణ ప్రతిష్ట జరగడం యాచ్ఛికం కాదు. ప్రజల దృష్టి మరోవైపు మళ్లకుండా ఉండేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగానే ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయింది. బీజేపీ నేతలు ఊహించిన విధంగానే దేశంలో ప్రజలు ఈ ఘట్టానికి పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు. వాడవాడలా ప్రజలు శ్రీరాముడి పట్ల తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. ఈ ఘట్టాన్ని విస్మరించాలనుకున్న వారు కూడా విస్మరించలేకపోయారు. ఒక భావోద్వేగం దేశమంతటా వెల్లివిరిసినట్లు కనిపించింది. దేశమంతటా కాషాయ పవన ప్రభంజనం వీచిందేమో అనిపించింది. ఈ క్రమంలో రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర గురించి వార్తలు గాలిలో కొట్టుకుపోయాయి. తమ వార్తలు ఎక్కడున్నాయో ప్రతిపక్షాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ప్రజలు భక్తి శ్రద్ధలు ప్రకటించినంత మాత్రాన దేశంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదని భావించడం సరైనదా? బీజేపీ ఈ ఘట్టాన్ని రాజకీయాలకు, ఎన్నికల్లో విజయానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుందన్న విషయం ఆ పార్టీ వారు కూడా కాదనలేరు. కొంతకాలంగా బీజేపీ నేతలందరూ మందిరాల చుట్టూ తిరుగుతూ వాటిని ప్రక్షాళనం చేస్తున్నారు. శ్రీరామజన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహం ప్రతి ఫ్రేమ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనపడేలా ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయి. ఆ కార్యక్రమం తర్వాత మోదీ దృష్టిని ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు, ముఖేశ్ అంబానీ వంటి వ్యాపారవేత్తలు, అమితాబ్ బచ్చన్ వంటి సినీనటులు, సాధ్వీ రితంబర, వీరభద్రాచార్య వంటి యోగి పుంగవులు, ఇంకా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉత్సుకత ప్రదర్శించారు. మోదీని రాజర్షి అని, ఒక భగవదంశ అని సాధువులు కొనియాడారు. ఇక రానున్నది రామరాజ్యమే అని ఒక సాధువు ప్రకటించారు. దేశంలో ఒక బలమైన అధికార వ్యవస్థ చుట్టూ మతం, రాజకీయం, వ్యాపారం సంఘటితం కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. గతంలో రాచరిక వ్యవస్థలోనూ ఇవే లక్షణాలు కొనసాగాయి. ఈ వ్యవస్థను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు.

మోదీ పూజ చేయడంతో పాటు పలువురి దృష్టిని ఆకర్షించిన మరో దృశ్యం ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఆయన పక్కనే నిలుచుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు ఉన్న అనేక అనుబంధ సంస్థల్లో భారతీయ జనతా పార్టీ ఒకటి. అందువల్ల మోదీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారంటే ఆ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే ఆయన ద్వారా చేయిస్తూ ఉండాలి. అక్కడకు వచ్చిన సాధువుల్లో అత్యధికులు ఆర్ఎస్ఎస్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారే. అందువల్ల ఇది ఒక గురువు మరో శిష్యుడితో చేయిస్తున్న కార్యక్రమంగానే భావించాలి. భాగవత్‌ను పక్కన ఉంచుకోవడం ద్వారా ఒక బలమైన సంస్థ తన వెనుక ఉన్నదన్న సంకేతాన్ని మోదీ ప్రపంచ వ్యాప్తంగా పంపారు. నిజానికి బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేయడం కూడా ఆర్ఎస్ఎస్ ఒక పద్దతి ప్రకారం నిర్వహించింది. ఆ రోజు సర్ సంఘ్ చాలక్ సుదర్శన్ జీ శిలాన్యాస్ దగ్గరుండి నిర్వహించారు. ఈ రోజు మరో సంఘ్ చాలక్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రదిష్ఠను దగ్గరుండి మరీ చేయించారు.

ఈ కార్యక్రమం తర్వాత రామజన్మభూమికి సంబంధించిన సానుకూల వాతావరణం వేడి తగ్గకుండా ఉండేందుకు సంఘ్ పరివార్ సంస్థలన్నీ మరో రెండు, మూడునెలల్లో జరుగనున్న సార్వత్రక ఎన్నికల్లో మోదీ గెలుపునకు ఉధృతంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. సంఘ్ పరివార్‌లో పలువురు పెద్దలు అంతర్గతంగానైనా మోదీ వ్యవహార శైలిని విమర్శించేవారు. కాని ఇప్పుడు ఆ విమర్శలను వారు పక్కన పెట్టక తప్పదు. నిజానికి 1950వ దశకంలో గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్‌గా ఉన్న కాలంలో తొలి రోజుల్లో రాజకీయ పార్టీల పట్ల ఏహ్యభావంతో ఉండేవారు. మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పునరుద్ధరించడానికి రాజకీయాలు అవసరం లేదని, రాజకీయాల్లో ఉన్న పోటీ తత్వంలో విచ్ఛిన్నకర స్వభావం వల్ల తమ లక్ష్యానికి విఘాతం కలుగుతుందని ఆయన భావించారు. అధికార రాజకీయాల వల్ల ఆ రాజకీయాల్లో ఉన్న వారిపై అనైతిక ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. అలాంటి గోల్వాల్కర్ భావసారూప్యం గల రాజకీయ వేదిక ఏర్పాటు చేయడం అవసరమని భావించినందువల్లే తొలుత జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటుకు వీలు కలిగింది. ఇప్పుడు అధికార రాజకీయాలు ఎంత కలుషితమైనా, ఎంత అనైతికమైనా పట్టించుకోగలిగిన స్థితిలో సంఘ్ పెద్దలూ లేరు. అధికార రాజకీయాల్లో వారూ భాగమయ్యారు. రామమందిర దర్శనంతో పాటు మోదీ విశ్వరూప సందర్శనం కూడా కలిసి మెలిసి సాగుతాయి. వ్యక్తి ఆరాధన పెంచారని ఇందిరాగాంధీని విమర్శించిన వారే మోదీ ఆరాధనను తార స్థాయికి తీసుకువెళుతున్నారు.

రానున్న మూడు నెలల్లో కోటి మంది రామమందిరాన్ని దర్శిస్తారని బీజేపీ నేతలు భావిస్తుండగా, రెండో రోజునే 3 లక్షల మందికి పైగా దర్శించుకోవడం గమనార్హం. జో రామ్ కో లాయే హై హమ్ ఉన్ కో లాయేంగే’ (రాముడిని తీసుకువచ్చిన వారినే మేము అధికారంలోకి తీసుకువస్తాం) అని కన్హయ్యా మిట్టల్ పాడిన పాట ఇప్పటికే ఉత్తరాదిన విస్తృతంగా ప్రచారమవుతోంది. కాంగ్రెస్ బీజేపీతో అయితే రాజకీయంగా పోరాడగలదు కాని శ్రీరాముడితో ఎలా పోరాడగలదు?’ అని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఎప్పుడో ప్రశ్నించారు. 2014లో నరేంద్రమోదీ తొలిసారి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకతపైనే దృష్టి సారించారు. 2019లో ఆయన తన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తట్టుకునేందుకు పుల్వామా, బాలాకోట్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి జాతీయ వాదాన్ని ఎన్నికల్లో ప్రధానాంశంగా మార్చారు. ఈ అయిదేళ్లూ ఆయన ఎంత అభివృద్ధి గురించి మాట్లాడినా జాతీయవాద తీవ్రతను క్రమక్రమంగా పెంచుతూ వచ్చారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇప్పుడు 2024లో ఆయనకు నేరుగా శ్రీరాముడే తోడయ్యారు. ఈ పదేళ్లలో ఆయన హిందూత్వను తన రాజకీయాల్లో ఒక అంతర్లీన అంశంగా జోడిస్తూనే వచ్చారు. వీలున్నప్పుడల్లా ఆలయాలను సందర్శిస్తూ వార్తల్లో ఉంటూనే వచ్చారు. కాశీ, ఉజ్జయిని కారిడార్లను ప్రారంభించారు. నదుల్లో స్నానాలు చేసి తర్పణలు గావించారు. అయోధ్య ప్రాజెక్టును ఒక పద్ధతి ప్రకారం ఆయన రూపొందించుకుని 2024 ఎన్నికలకోసం సిద్దంగా ఉంచుకున్నారు. ‘ప్రజలు మతానికి ఎంత గాఢంగా హత్తుకుపోతే వారిని పాలించడం అంత సులభం. రాజు తన రాజకీయాలకోసం మతాన్ని ఉపయోగించుకోవాలి’ అని ఇటాలియన్ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెల్లి లాంటి వాళ్లు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మతానికీ, రాజకీయాలకూ తేడాలేనంత స్పష్టంగా వ్యవహరించడం మోదీ చేస్తున్న వినూత్న ప్రయోగం.

ఇవాళ మారుతున్న వాతావరణం చూస్తుంటే నుదుటిపై బొట్టు పెట్టుకుంటే మనను బీజేపీ అభిమానులుగా భావిస్తారేమో అన్న ఆలోచన కలుగుతోంది. మనం వెలిగించే దీపంలో రాజకీయం కదులుతున్నట్లనిపిస్తోంది. భక్తికీ, రాజకీయానికీ పెద్ద తేడా కనపడని పరిస్థితితో పాటు భక్తి ఒక పార్టీ స్వంతమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. లేకపోతే అస్సాంలో రాహుల్ గాంధీని గుడికి వెళ్లకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల ముందు ఏది ఎజెండా కావాలన్న విషయంలో ప్రజలే ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించగలరు. రాజకీయ నేతలకంటే ప్రజలే వివేకంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పదేళ్ల కాలంలో మోదీ ఒకవేళ నిర్మాణాత్మకమైన పనులు ఏమైనా చేసి ఉంటే రామమందిర ప్రచార హోరులో ఆ పనులు కొట్టుకుపోతాయని భయంగా ఉన్నదని ఒక బీజేపీ నాయకుడు చెప్పారు. కాని ఈ హోరులో తన అప్రజాస్వామిక, ఏకపక్ష, నియంతృత్వ చర్యలకు ఆమోదయోగ్యత లభిస్తుందని, తన వైఫల్యాలను ఎవరూ పట్టించుకోరని కూడా మోదీ భావిస్తుండవచ్చు. ఈ ఆమోద యోగ్యత దేశ వ్యాప్తంగా లభిస్తుందా? ఉత్తరాది రాష్ట్రాలకూ, దక్షిణాది రాష్ట్రాలకు ఈ విషయంలో వ్యత్యాసం ఉంటుందా అన్న చర్చను పక్కన పెడితే మోదీ ఎజెండా స్వభావాన్ని ప్రజల్లో అర్థం చేసుకునేలా చేయగల శక్తి ప్రతిపక్షాలకు ఉన్నప్పుడే అవి విజయం సాధించగలవు. ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల సమస్యలు, వారి నిత్యావసరాలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, ప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరు, అణగారిన వర్గాలకు జరిగిన సామాజిక న్యాయం ఇవన్నీ చర్చనీయాంశం కావాలి. ఇవేవీ చర్చనీయాంశం కాకుండా కేవలం రామమందిరమే ఎన్నికల ఎజెండాను నిర్ణయిస్తే ఈ దేశాన్ని శ్రీరాముడే కాపాడాలి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 24 , 2024 | 01:30 AM