Share News

సుప్రీం తీర్పుతో వ్యవస్థలు మారేనా?

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:37 AM

ఈ దేశంలో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించడం గురించి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం చెప్పుకోదగ్గ విషయమే. చట్టసభల్లో ఓటు వేసేందుకు, ప్రసంగించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుంటే...

సుప్రీం తీర్పుతో వ్యవస్థలు మారేనా?

ఈ దేశంలో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించడం గురించి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం చెప్పుకోదగ్గ విషయమే. చట్టసభల్లో ఓటు వేసేందుకు, ప్రసంగించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుంటే వారిపై అవినీతి నిరోధక చట్టం క్రింద చర్యలు తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు వెలువడిన క్షణాల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం ప్రకటించారు. ఈ తీర్పు రాజకీయాలను అవినీతి నుంచి ప్రక్షాళనం చేసేందుకు, వ్యవస్థలపై ప్రజలకు ప్రగాఢమైన నమ్మకాన్ని కలుగచేసేందుకు దారితీస్తుందని మోదీ అన్నారు.

చట్టసభల్లో ఓటింగ్ చేసేందుకు సభ్యులు ముడుపులు తీసుకునే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక మూడు దశాబ్దాల చరిత్ర ఉన్నది. 1993 జూలైలో పీవీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వామపక్షాలకు బీజేపీ కూడా మద్దతు నిచ్చింది. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు వారి లక్ష్యానికి అడ్డు రాలేదు. ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఉన్న కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్‌తో పాటు పలువురు పీవీ ప్రభుత్వం పడిపోయేందుకు తెరవెనుక తమ వంతు ప్రయత్నాలు చేశారు. అంతర్గత, బహిర్గత ప్రత్యర్థుల మధ్య చివరకు అవిశ్వాస తీర్మానం వీగిపోయి పీవీ ప్రభుత్వం 14 ఓట్లతో గట్టెక్కింది. జనతాదళ్ నుంచి రాంలఖన్ యాదవ్ నేతృత్వంలో విడిపోయిన ఏడుగురు సభ్యులతో పాటు నలుగురు జేఎంఎం సభ్యులు మద్దతు నిచ్చారు. ములాయం వర్గానికి చెందిన ముగ్గురు ఎంపీలు, బిఎస్‌పికి చెందిన ముగ్గురు ఎంపీలు గైరుహాజరయ్యారు. జనతాదళ్ (ఏ) నేత అజిత్‌సింగ్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. అజిత్‌సింగ్‌కు ఆ తర్వాత మంత్రిపదవి దక్కింది. నిజానికి జేఎంఎం సభ్యులు ఓటు వేయకపోయినా పీవీ ప్రభుత్వం గట్టెక్కేది. ఎందుకంటే, ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్‌లతో పాటు కాన్షీరామ్ కూడా పీవీకి మద్దతు నిచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు పీవీ జవాబిస్తూ జార్ఖండ్ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తామని హామీ ఇవ్వడంతో జేఎంఎం సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు. పీవీ హామీతోనే వారు సరిపెట్టుకుంటే బాగుండేది కాని ప్రభుత్వాన్ని కాపాడాలనుకున్న పి.వి. శ్రేయోభిలాషుల నుంచి ముడుపులను కూడా రాబట్టినట్లు ప్రచారం జరిగింది. ‘వారికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి అని ప్రధానమంత్రి చెప్పినప్పటికీ మా భయం మాది’ అని పీవీ శ్రేయోభిలాషి ఒకరు వెల్లడించారు. పీవీ మూడు అవిశ్వాస తీర్మానాల నుంచి గట్టెక్కారు కాని ఏ సందర్భంలోనూ ఎంపీలను ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు రాలేదు.

జేఎంఎం ఎంపీలు పీవీ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా, రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే సంస్థకు చెందిన రవీంద్రకుమార్ పిటిషన్ దాఖలు చేయడం, పీవీ 1996 మే 24న గద్దె దిగగానే జేఎంఎం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించిన అయిదు నెలల్లోనే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసి పీవీని ఏ–వన్ నిందితుడుగా చేర్చడం, బీజేపీలో చేరిన జేఎంఎం సభ్యుడు శైలేంద్ర మహతో తనకు పీవీ ముడుపులు చెల్లించారని ఆరోపించి అప్రూవర్‌గా మారడం వంటి పరిణామాలు వెనువెంటనే జరిగాయి. దర్యాప్తు పూర్తిగా శైలేంద్ర మహతో ప్రకటనపై ఆధారపడి జరిగినట్లు, ఆయన రకరకాల ప్రకటనలు చేసినట్లు ఆనాటి ఉదంతాలు అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. ఇదే అభిప్రాయంతో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ సోంధీ, పీవీని నిర్దోషిగా ప్రకటించారు. పీవీ నేరుగా ఎంపీలకు ముడుపులు ఇచ్చినట్లు ఎక్కడా రుజువులు లేవని ఆయన తన తీర్పులో ప్రకటించారు. హర్షద్ మెహతా అనే స్టాక్ బ్రోకర్ పీవీకి రూ. 1 కోటి చెల్లించినందువల్ల సీబీఐతో విచారణ జరిపించాలని జనహిత్ అనే సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ఆ పిటిషన్‌ను కొట్టి వేశారు. సుప్రీంకోర్టును రాజకీయాలకు వేదిక చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.

పీవీపై వచ్చిన అనేక ఆరోపణలు, కేసుల నుంచి ఆయన నిర్దోషిగా బయటపడ్డప్పటికీ, వాటి వెనుక రాజకీయ కుతంత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ, జేఎంఎం కేసులో 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ అవినీతికి సంబంధించి న్యాయవ్యవస్థ తీరుతెన్నులనే ప్రశ్నార్థకం చేసిందని చెప్పక తప్పదు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎంపీలపై వచ్చిన అవినీతి నేరారోపణలపై రాజ్యాంగంలోని అధికరణ 105(2) ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలు లేదని సుప్రీంకోర్టు భావించింది. సభ్యులు పార్లమెంట్‌లో చేసిన పనులన్నీ ఈ అధికరణ క్రింద వస్తాయని ప్రముఖ న్యాయవాది పావని పరమేశ్వరరావు చేసిన వాదనను సుప్రీం మెజారిటీ బెంచ్ ఆమోదించింది. ఎంపీలు స్వేచ్ఛగా వ్యవహరించేందుకు వీలుగా రూపొందించిన ఈ అధికరణను పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలకూ, ఓటింగ్‌కూ వర్తింపచేయవచ్చు కాని ముడుపులు స్వీకరించినా, ఘోరమైన నేరాలకు పాల్పడినా వర్తింపచేయడం సరైనదేనా అన్న ప్రశ్నలకు జవాబు లేకపోవడంతో నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి సవాలుగా నిలిచింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మళ్లీ తన తీర్పును తానే తిరగరాయడం చరిత్రాత్మకం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇదే ఉద్దేశంతో సుప్రీం తాజా తీర్పును స్వాగతించి ఉంటారు. కాని సరిగ్గా 20 రోజుల క్రితం ఇదే సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు రహస్య విరాళాలు సేకరించడం రాజ్యాంగ వ్యతిరేకమని, అవి కూడా కార్పొరేట్ సంస్థల నుంచి ముడుపులు స్వీకరించడంతో సమానమని తీర్పు నిచ్చినప్పుడు మాత్రం ప్రధానమంత్రి ఏ మాత్రం స్పందించలేదు. బహుశా ఎన్నికల బాండ్ల విషయంలో ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఆయన ఏకీభవించడం లేదని అనుకోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్నికల బాండ్ల వివరాలు చెప్పేందుకు కూడా స్టేట్‌ బ్యాంక్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ సమయం అడగడం ప్రభుత్వ పారదర్శకతపై అనేక సందేహాలకు తావునిస్తోంది.

చట్టసభల్లో ముడుపులు తీసుకోవడం తప్పు అని సుప్రీంకోర్టు ప్రకటించింది కాని చట్టసభల బయట ఏ విధంగా ముడుపులు తీసుకున్నా తప్పేమి కాదని ఈ దేశంలో నేతలు భావిస్తున్నట్లు కనపడుతోంది. సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా ఈ దేశంలో ప్రజాప్రతినిధులు తమను తాము అమ్ముకోవడం, వారిని కొనుగోలు చేయడం మాత్రం ఆగిపోవడంలేదు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి వేరే పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారు. ‘ఎన్ని ఫిరాయింపు వ్యతిరేక చట్టాలు చేసినా ఎమ్మెల్యేలు ఇలా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం ప్రజాస్వామ్య రాజకీయాల్లో చీకటి కోణాన్ని చూపిస్తోంది. రాజకీయాల్లో నైతికత అనేది ఉంటే క్రాస్ ఓటింగ్ అనేదే జరగదు’ అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఏదో విధంగా మెజారిటీ సంపాదించేందుకు, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఈ క్రాస్ ఓటింగ్‌కు పకడ్బందీగా వ్యూహరచన చేసి ఉండవచ్చు. కాని ఏ ప్రలోభాలు లేకుండా, ఏ ముడుపులు చెల్లించకుండా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసుల్లో తలెత్తుతుంది. పీవీ నరసింహారావు సమయంలో నలుగురు జేఎంఎం ఎంపీలు ఓటు వేసినందుకు సీబీఐ విచారణకు ఆదేశించినట్లే, ఈ క్రాస్ ఓటింగ్‌పై కోర్టులు కానీ, ప్రభుత్వం కానీ సీబీఐ విచారణకు ఆదేశించగలవా? ఎమ్మెల్యేలు ముడుపులు స్వీకరించలేదని కోర్టు ద్వారా నిర్ధారించగలదా?

రాజ్యసభ ఎన్నికల విషయంలోనే కాదు, గత పది సంవత్సరాలుగా ‘ఆపరేషన్ లోటస్’ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేలు ఏదో విధంగా పార్టీ మారుతూనే ఉన్నారు. 2018లో కర్ణాటకలో కాంగ్రెస్–జనతాదళ్ (ఎస్) ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2019–2022 మధ్య గోవాలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమల తీర్థం పుచ్చుకున్నారు. 2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో అత్యంత విధేయుడని అనుకున్న జ్యోతిరాదిత్య సింధియా ఉన్నట్లుండి ఢిల్లీ వెళ్లి తన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీలో చేరారు. దీనివల్ల కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ పార్టీలను చీల్చడం, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండాలని ఢిల్లీ పెద్దలు భావించడం రాజకీయాల్లో నైతికతను ప్రశ్నార్థకం చేసింది. పార్టీలు ఫిరాయించిన వారికి రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ మంత్రిపదవులు, ముఖ్యమంత్రి పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు లభించాయి. ఇక ఎంతమేరకు నిధులు అక్రమంగా ప్రవహించాయో చెప్పలేము. పై పెచ్చు ఈ అనైతిక కార్యక్రమానికి తోడుగా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు నిర్వహిస్తున్న పాత్ర కూడా విస్మరించలేనిది. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు మనుగడ సాధించడం కష్టమనే ప్రచారం కూడా జరిగేందుకు గత పదేళ్లలో జరిగిన పరిణామాలే కారణమవుతున్నాయి. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఏర్పడి రాజకీయాలు ప్రక్షాళన కావాలంటే సుప్రీంకోర్టు తీర్పులు మాత్రమే సరిపోవు. నాయకులకు నిజాయితీ ఉండాలి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Mar 06 , 2024 | 01:37 AM