Share News

ప్రపంచీకరణకు మార్క్స్‌ వ్యతిరేకమా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:59 AM

ప్రపంచీకరణకు పునాది వేసిన స్వేచ్ఛ వాణిజ్య సిద్ధాంతం 18వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. దీన్ని ఫ్రాన్సుకు చెందిన ‘ప్రకృతి ధర్మవాదులు’, తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తలైన...

ప్రపంచీకరణకు  మార్క్స్‌ వ్యతిరేకమా?

ప్రపంచీకరణకు పునాది వేసిన స్వేచ్ఛ వాణిజ్య సిద్ధాంతం 18వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. దీన్ని ఫ్రాన్సుకు చెందిన ‘ప్రకృతి ధర్మవాదులు’, తర్వాత సాంప్రదాయ ఆర్థికవేత్తలైన ఆడమ్ స్మిత్, జె.బి.సే అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ‘ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు వదిలివేయాలని చెబుతుంది. కానీ అందుకు భిన్నంగా నాటి స్వేచ్ఛ వాణిజ్య పోటీ మార్కెట్ నుంచి గుత్త పెట్టుబడిగా తరువాత నేటి కార్పొరేటికరణ వరకు ప్రభుత్వ మద్దతుతోనే పెట్టుబడిదారీ వ్యవస్థగా అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ ఉన్నది. కాబట్టే మార్క్స్ ‘ప్రభుత్వం అంటే పాలకవర్గాల వ్యవహారాలను సక్కబెట్టే యంత్రం’ అని అంటాడు.

ఇక మన దేశానికి సంబంధించినంత వరకు మౌలిక పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడి పెట్టే సామర్థ్యం ప్రైవేట్ రంగానికి లేకపోవడం వల్ల ప్రభుత్వ సహకారంతోనే వాటిని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆ శక్తి రాగానే నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించే విధానానికి ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల ప్రజా సంక్షేమంపై కోతలు విధించబడతాయని మొత్తంగా మన దేశ సార్వభౌమత్వమే ప్రమాదములో పడుతుందనీ వామపక్షాలు విస్తృతంగా సాహిత్యాన్ని తెచ్చారు. తెలుగు సాహిత్యకారులు కూడా ‘పడమటి గాలి’, ‘గ్లోబలి’ తదితర పుస్తకాలను తెచ్చారు. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అనే గోరటి వెంకన్న పాట తెలిసిందే.

వామపక్షాలు చెప్పినట్లే అన్ని రంగాలలో ప్రైవేటీకరణను చూస్తున్నాం. అదే సమయంలో రాజకీయ పార్టీలు పోటీలు పడి సంక్షేమ పథకాలను ప్రకటించడం కూడా చూస్తున్నాం. మరీ కమ్యూనిస్టులు చెబుతున్న స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రపంచీకరణను వ్యతిరేకించాలా? ఈ విషయంలో శాస్త్రీయ కమ్యూనిజం సిద్ధాంత మూలకర్తలైన మార్క్స్, ఏంగేల్స్ అంచనా ఏమిటనే విషయాన్ని ఈ వ్యాసం పరిశీలించే ప్రయత్నం చేస్తున్నది.

1848 సెప్టెంబర్ 15, 16, 17 తేదీల్లో స్వేచ్ఛా వాణిజ్యంపై జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సదస్సు సందర్భంగా మార్క్స్ ఏంగెల్స్, ‘వాస్తవములో కార్మికులకు ఈ స్వేచ్ఛ వాణిజ్యం వరగబెట్టేది ఏం ఉండదు. అలాగని మేము స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకమా? కాదు. అనుకూలం. ఎందుకంటే ఈ విధానాల వల్ల ఉనికిలోకి వచ్చే వైరుధ్యాలు విశాల భూభాగంలోకి విస్తరిస్తాయి. ఇందువలన బహుముఖ వైరుధ్యాల నుంచి ఒకే ఒక్క గొప్ప వైరుధ్యం తలెత్తుతుంది. ఈ వైరుధ్యంతో ఆ సమూహాలు ముఖాముఖి తలపడతాయి. ఆ రకంగా కార్మిక వర్గానికి విముక్తిని కలిగిస్తుంది.’ ఇదీ వారి అంచనా. అంటే పెట్టుబడిదారీ పూర్వ అస్తిత్వాలైన జాతి, మతం, ప్రాంతం, దేశం తదితర బహుముఖ వైరుధ్యాలు రద్దు కాబడి, కార్మికులు – పెట్టుబడిదారులనే గొప్ప వైరుధ్యంగా ఏర్పడి కార్మిక వర్గ విముక్తి జరుగుతుందని వారు చెప్పారు.

ఇంకా, ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’లో, ‘పెట్టుబడిదారీ వర్గం ప్రపంచమంతటినీ తన మార్కెట్టుగా చేసుకోవడం ద్వారా ప్రతి దేశంలోనూ సరుకుల ఉత్పత్తికి, సరుకుల వినియోగానికి జాతి, మతాతీత స్వభావాన్ని కల్పించింది. పరిశ్రమల జాతీయ పునాదిని కూడా తొలగించి వేసింది. ఇందువలన స్థానిక పరిశ్రమలన్నీ నాశనమైనాయి. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అవి రోజురోజుకు నాశనం అవుతూ ఉన్నాయి. ఈ పరిణామం సకల నాగరిక జాతులకు జీవన్మరణ సమస్యగా ఉంది. స్థానిక, జాతీయ ఒంటరితనాలు, ఇంకా స్వయంసమృద్ధి స్థితి పోయి నలువైపులా ఇచ్చిపుచ్చుకోవడమూ వివిధ జాతులు ఒకదానిపై ఒకటి ఆధారపడటమూ జరుగుతున్నది. అన్ని దేశాల మేధోపరమైన ఆవిష్కరణలు యావత్తు ప్రపంచ సమిష్టి ఆస్తి అవుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ సంకుచితత్వం రాను రాను తగ్గిపోతాయి. ప్రాంతీయ సాహిత్యాల నుంచి విశ్వసాహిత్యం ఉద్భవిస్తున్నది’. ఈ రకంగా పెట్టుబడిదారీ విస్తరణ వల్ల జరిగే మార్పుల పట్ల ఆశావాద దృక్పథం వారిలో కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ కార్మికులు ఏకం కావటానికి కావలసిన భౌతిక పరిస్థితులను ఇది సృష్టిస్తున్నది.

అయితే సోషలిస్టు విప్లవాలకు అనువైన వాతావరణం నెలకొన్నదని అనుకోవచ్చా? వారు అవుననే అంటారు. అదే కమ్యూనిస్టు మానిఫెస్టోలో, ‘ఐరోపాను కమ్యూనిజమనే భూతం ఆవరించి’నట్లు చెప్పుకొచ్చారు. అంటే అక్కడ సోషలిస్టు విప్లవానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్న అంచనాకు వచ్చారు. వారు బ్రతికుండగానే ప్యారిస్ కమ్యూన్ వైఫల్యాన్ని కూడా చూశారు. కానీ సోవియట్ యూనియన్‌లో లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అయితే అన్ని దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థలు ఏర్పడుతున్నప్పుడు ఒక దేశంలో సోషలిస్టు విప్లవం తేవటం, దాన్ని నిలబెట్టుకోవటం అసాధ్యమనే చర్చ కూడా నడిచింది. ఆ తరువాత 1929లో కోమింటర్న్ ఐరోపా దేశాలలో పెట్టుబడిదారీ విధానం పతనం కాబోతున్నదని అంచనా వేసింది. అది జరగలేదు. కానీ 1950లో చైనాలో రైతాంగ విప్లవం విజయవంతమైంది. ఆ స్ఫూర్తితో నక్సలైట్లు భారతదేశంలో 1970 నాటికే విప్లవానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అంచనా వేశారు. వారి అంచనాలు అటుంచితే, యూరప్‌లో సోషలిస్టు విప్లవాలు రాకపోగా సోవియట్ యూనియన్ కూలిపోయింది, చైనా మార్కెట్ సోషలిజంలో పయనిస్తున్నది.

మొత్తంగా మన అనుభవాలు ఏం చెబుతున్నాయి? అంటే, ప్రపంచమంతటా పెట్టుబడిదారీ ఉత్పత్తి శక్తులు గుణాత్మక స్థాయికి చేరకుండా సోషలిస్టు విప్లవాలు సంభవిస్తాయా? అనే సందేహాలు, వాదనలు ఉన్నాయి. కాబట్టి కమ్యూనిస్టు మానిఫెస్టోలో వివరించిన విధంగా భౌతిక పరిస్థితులు పరిపక్వం చెందకుండా కూడా సోషలిస్టు విప్లవాలు సంభవించవేమో? దీనికి కూడా మార్క్స్ నుండే సమాధానం పొందవచ్చు. ‘మనుషులు చరిత్ర సృష్టిస్తారు. అయితే దాన్ని తాము కోరుకున్న ఇష్టానుసారం సృష్టించలేరు. అలాకాకుండా గతం నుంచి సంక్రమించిన వాటి ద్వారా తారసపడే పరిస్థితులను మాత్రమే మార్చగలరు’. దీనికి భిన్నంగా ఉన్న అంచనాలు, పోరాట నిర్మాణాలు జరిగితే అవి వైఫల్యాలను మిగులుస్తాయనీ ప్రపంచ అనుభవాలు మన ముందు ఉంచాయి. ఇటువంటప్పుడు కార్మిక వర్గ కర్తవ్యాలు, పోరాటాలు ఎలా ఉండాలి? అన్న ప్రశ్న ఉదయిస్తున్నది.

డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు

Updated Date - Mar 27 , 2024 | 12:59 AM