Share News

Weekend Comment by RK : అభిమానమా... ఉన్మాదమా?

ABN , Publish Date - Feb 04 , 2024 | 12:25 AM

రాజకీయ పార్టీలకు కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి వేరు! ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏ ముహూర్తంలో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారోగానీ, అప్పటి నుంచి ఆయనకు మద్దతుగా...

Weekend Comment by RK : అభిమానమా... ఉన్మాదమా?

రాజకీయ పార్టీలకు కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి వేరు! ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏ ముహూర్తంలో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారోగానీ, అప్పటి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్మాద మూక పోగైంది. తమ నాయకుడిపై ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో తప్పు లేదుగానీ అభిమానం కాస్తా ఉన్మాదంగా మారి ఇళ్లలోని ఆడవాళ్లను కూడా బజారుకు ఈడ్చే దుష్ట సంస్కృతి జగన్‌ పాలనలో జరగడం దారుణం! ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననంతో మొదలైన ఈ దాడి... ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంలోని ఆడవాళ్లకు కూడా చుట్టుకుంది. తల్లితోపాటు చెల్లెళ్ల వ్యక్తిత్వాలను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిండు శాసనసభలో తన సతీమణిని కించపరచడంతో ఆ బాధను భరించలేక అప్పట్లో చంద్రబాబు నాయుడు విలపించడాన్ని చూశాం! అప్పుడు కూడా జగన్మోహన్‌ రెడ్డి నోరు మెదపలేదు. తనకోసం పనిచేస్తున్న సోషల్‌ మీడియా కిరాయి సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా ఆయన సొంత చెల్లి షర్మిల నోరు విప్పడంతో ఆమెను కూడా టార్గెట్‌ చేసుకున్నారు. జగన్‌కూ, ఆయన భార్య భారతి రెడ్డికీ వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే ఆగమేఘాలమీద స్పందించే సీఐడీ అధికారులు ఇప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబంలోని మహిళలను కించపరుస్తున్నప్పటికీ నిద్ర నటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పోకడలను గమనిస్తే ముఖ్యమంత్రి దంపతులకు మినహా ఆ రాష్ట్రంలో మరెవరికీ పరువు లేదనుకోవాల్సి వస్తుంది. తమ కుటుంబంలోని ఆడపడుచులను ఆదరించి గౌరవించడం రాయలసీమ సంస్కృతి. సీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గీయులు తమ ఇంటి ఆడపడుచులనే కాదు, ప్రత్యర్థుల ఇళ్లలోని మహిళలను కూడా గౌరవిస్తారు. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు సైతం మహిళలు, పిల్లలకు అపకారం తలపెట్టరు. కానీ, అదే రాయలసీమ నుంచి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి మాత్రం రక్తం పంచుకుపుట్టిన చెల్లిని కించపరుస్తున్నా, తమ తల్లి శీలాన్నే శంకించే విధంగా పోస్టులు పెడుతున్నా కిమ్మనకపోవడం వింతగా ఉంది.

హద్దుల్లేని అరాచకం...

జగన్‌రెడ్డి రాజకీయాలలోకి వచ్చిన నాటి నుంచే ఆయనకు చెందిన సోషల్‌ మీడియా సైన్యం హద్దూ అదుపు లేకుండా వ్యవహరిస్తోంది. అతగాడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఉన్మాద మూక వాచాలత్వానికి అంతులేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో ప్రజల్లో నెలకొన్న సానుభూతిని సొమ్ము చేసుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి... ఇప్పుడు తన తల్లి శీలాన్ని సైతం శంకించే విధంగా పోస్టులు పెడుతున్నా చర్యలు తీసుకోక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించాక జగన్‌కు చెందిన కిరాయి మూక ఆమెను టార్గెట్‌ చేసుకుంది. ఈ దాడి ఎంత దూరం వెళ్లిందంటే, షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టిందా? అని శంకించే వరకూ వెళ్లారు. షర్మిల పుట్టుకను శంకించడం అంటే రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ శీలాన్ని శంకించడమే కదా? తన తల్లిని అంతగా అవమానిస్తున్నప్పటికీ జగన్‌రెడ్డి స్పందించకపోవడాన్ని బట్టి అతనిలో మానవత్వం ఉందా? అన్న అనుమానం కలగడం సహజం. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న హీనమైన దాడిని చూసి షర్మిల కుమిలి పోతున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరూ పల్లెత్తు మాట అనలేదు. షర్మిల ఎప్పుడైతే తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ తరఫున జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారో... అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. జగన్‌ మద్దతుదారులుగా ఉంటున్న ఉన్మాద మూక ఆమెను హీనాతిహీనంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ దాడి జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి చీమ కుట్టినట్టయినా లేదు. రాష్ట్ర ప్రజలు అందరూ తనను ‘జగనన్నా’ అని పిలవాలని కోరుకుంటున్న జగన్‌రెడ్డి, తనను యాభై ఏళ్లుగా ‘అన్నా’ అని పిలుస్తూ కలసిమెలసి ఆడుతూ పాడుతూ గడిపిన సొంత చెల్లెళ్లు తమను అవమానిస్తున్నారని రోదిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా షిక్కటి షిరునవ్వులు చిందించడం ఎలా సాధ్యం? ‘ఆదుకో అన్నా!’ అని ఆర్తనాదం వినిపించినప్పుడు ఎంతటి పాషాణ హృదయమైనా కరుగుతుంది, స్పందిస్తుంది.

ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్న షర్మిల ‘రెడ్డి’ కాబోదనే మరో దిక్కుమాలిన వాదాన్ని కూడా తెరపైకి తెచ్చారు. బ్రాహ్మణులైతే రాజకీయాలకు పనికిరారా? ప్రకాశం పంతులు రాజకీయాల్లో ఎంతటి ఉన్నత విలువలు నెలకొల్పారో ఈ వీధి కుక్కలకు తెలియకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది లేదు. పెళ్లి తర్వాత ఆడపిల్ల ఇంటి పేరు మారుతుంది. అయితే, అదేమీ రూల్‌ కాదు. పుట్టింటి వారి ఇంటిపేరునే కొనసాగించుకొనే హక్కు ఆడపిల్లలకు ఉంటుంది. షర్మిలను ఇప్పుడు ‘షర్మిల శాస్ర్తి’ అని కించపరుస్తున్న వారు ఒక విషయం మర్చిపోతున్నారు. జగన్మోహన్‌ రెడ్డి తరఫున బైబిల్‌ పట్టుకొని మరీ ప్రచారం చేస్తున్న ఆయన మేనత్త విమల తనను తాను వైఎస్‌ విమలా రెడ్డిగానే చెప్పుకుంటున్నారు కదా? జగన్‌ తరఫున ప్రచారం చేసే వారు మాత్రమే రెడ్డి అనే తోక తగిలించుకోవడానికి అర్హులా? నిజానికి విమల ఒక దళితుడిని వివాహం చేసుకున్నారు. అయినా, ఆమె తన ఇంటి పేరును వైఎస్‌ గానే చెప్పుకొంటున్నారు. ‘వైఎస్‌ విమలారెడ్డి’గానే చెలామణి అవుతున్నారు. విమలకు ఒక రూల్‌, షర్మిలకు మరో రూల్‌ ఎందుకు? విమలకు వివాహం చేసినప్పుడు ఆ కుటుంబానికి ఇంత సంపద లేదు. అయినప్పటికీ తమ ఏకైక సోదరి విమలకు హైదరాబాద్‌లో ఒక పెద్ద ఇల్లును, విజయవాడలోని రాజ్‌–యువరాజ్‌ థియేటర్లలో వాటాను రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆనందంగా పంచి ఇచ్చారు. రాయలసీమ సంస్కృతి అంటే ఇదీ! అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఆస్తుల్లో తన వాటా పంచి ఇవ్వాలని షర్మిల మొత్తుకుంటున్నప్పటికీ జగన్‌రెడ్డి తిరస్కరించడం నిజం కాదా? ఆస్తుల పంపకంలో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ వైరంగా మారింది. అంతే, జగన్‌కు వత్తాసు పలుకుతున్న ఉన్మాద మూక ఊర కుక్కల్లా మొరగడం మొదలుపెట్టింది. సీమ పౌరుషం, ప్రతాపం అంటే ఇదేనా జగన్‌రెడ్డీ?

అన్నా... అని పిలిచినా!

నిండు సభలో ద్రౌపది వస్ర్తాపహరణాన్ని నిలువరించలేక పోయినందుకు భీష్ముడు జీవితాంతం కుమిలిపోయాడు. చివరకు మరణాన్ని స్వయంగా ఆహ్వానించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఇప్పుడు తన తల్లిని, చెల్లిని దారుణంగా అవమానిస్తున్నప్పటికీ నిలువరించే ప్రయత్నం చేయని జగన్‌ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? రాయలసీమ సంస్కృతిని పక్కనపెడితే, ఒక మనిషిగా అయినా జగన్‌రెడ్డి స్పందించాలి కదా! రాజకీయంగా విభేదించినంత మాత్రాన షర్మిల సహోదరి కాకుండా పోతుందా? ‘‘తల్లినీ, చెల్లెళ్లనూ తిడుతున్నా చేతులు దులుపుకొంటారా? జగనన్నా, నీకు బాధ్యత లేదా?’’ అని వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి వేస్తున్న ప్రశ్నల్లో ఆవేదన కనిపిస్తోంది. తన తండ్రిని దారుణంగా చంపించిన వాళ్లను జగన్‌రెడ్డి రక్షిస్తున్నారని తెలిసినా డాక్టర్‌ సునీత ఆయనను ‘అన్నా’ అనే పిలుచుకుంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆమె మొరపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా దాడి జరుగుతున్నా అక్కడి పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకంలేక డాక్టర్‌ సునీత సైబరాబాద్‌ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఇది అవమానం కాదా? ‘శత్రు శేషం ఉండకూడదు! షర్మిల, సునీతలను కూడా లేపెయ్‌ అన్నా’ అని ఉన్మాద మూక జగన్‌రెడ్డిని కోరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే, జగన్‌ కనుసన్నల్లో లేదా ఆయనకు తెలిసే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ఉన్మాద మూక కూడా నమ్ముతున్నట్టే కదా? వివేకాను చంపినట్టు షర్మిల, సునీతను కూడా చంపేస్తే శత్రు శేషం ఉండదనుకోవడం వారి కిరాతక మనస్తత్వానికి నిదర్శనం కాదా? ఇంత జరుగుతున్నా పౌర సమాజం తమకు ఏమీ పట్టనట్టుగా ఉండిపోవడం బాధాకరంగా ఉంది. చంద్రబాబు సతీమణిని అవమానించినప్పుడు అది ఆయన సమస్య అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబంలోని ఆడవాళ్లను అవమానిస్తున్నా దాన్ని వారి సమస్యగానే చూస్తున్నారు. మహిళల పట్ల జగన్‌ ప్రభుత్వానికి ఉన్న నీచాభిప్రాయంగా ఈ సంఘటనలు నిలువడం లేదా? రాజశేఖర రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్న వాళ్లు కూడా... ఇప్పుడు ఆయన సతీమణి శీలాన్ని శంకించే విధంగా పోస్టులు పెట్టడాన్ని ప్రశ్నించకపోవడం ఏమిటి? రాజశేఖర రెడ్డి అమితంగా ఇష్టపడే షర్మిలను సైతం చంపేయాలని రెచ్చగొడుతున్నప్పటికీ మౌనంగా ఉండటం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌ పౌర సమాజం ఇంత నిస్తేజంగా ఎందుకు మారిపోయింది? రాజకీయాల్లోకి ఉన్మాద సంస్కృతిని ప్రవేశపెట్టడాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను బలంగా ప్రభావితం చేసిన వారిలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆ కుటుంబాలలోని మహిళలకే రక్షణ లేకుండాపోతే ఇక సామాన్య మహిళల రక్షణ ఎలా? ఇంత జరుగుతున్నప్పటికీ స్పందించని జగన్‌కు తనను అందరూ ‘అన్నా’ అని పిలవాలని కోరుకునే హక్కు ఉందా? రాజశేఖర రెడ్డిని అభిమానించే వారు ఈ చర్యలను సమర్థిస్తారా?


వైఎస్‌ వారసుడి లక్షణాలు ఇవేనా?

రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే అని ఉన్మాద మూక ప్రచారం చేస్తున్న విషయానికి వద్దాం! రాజశేఖర రెడ్డి తన అధికారానికి అడ్డు వస్తారనుకున్న వారిని మాత్రమే ప్రత్యర్థులుగా పరిగణించే వారు. సదరు ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారే కానీ ఇలా వాళ్ల ఇళ్లలోని ఆడవారిపైకి తన మద్దతుదారులను ఉసిగొల్పలేదే? ఇప్పుడు తన వారసుడి చర్యల కారణంగా తన సతీమణి శీలపరీక్షకు నిలవాల్సి వస్తుందని రాజశేఖర రెడ్డి కలలో కూడా ఊహించి ఉండరు. షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టిందని విజయమ్మ చెప్పుకోవాలా? ఇంతకంటే అవమానం, అపచారం ఉంటుందా? షర్మిల తన తండ్రి రక్తం పంచుకొని పుట్టలేదని జగన్మోహన్‌ రెడ్డి చెప్పగలరా? జగన్‌ నిజంగా రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడే అయితే దివంగత నేత కుటుంబంలోని ఆడవాళ్లకు అతడే పెద్ద దిక్కు అవుతాడు కదా? అయినా తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో తమకు రక్షణ లేదని ఆయన చెల్లెళ్లు రోదించడం ఏమిటి? ఈ పరిస్థితికి కారకుడైన జగన్‌ను ముఖ్యమంత్రిగానే కాదు ఒక మనిషిగా గుర్తించి గౌరవించాలన్నా ఇబ్బందిగా ఉంటోందని ఎవరైనా అంటే ఎందుకు అభ్యంతర పెట్టాలి? రాజకీయాల్లో ఇంతటి నీచ సంస్కృతిని ప్రవేశపెడుతున్న జగన్‌ చివరకు సాధించబోయేది ఏమిటి? కుటుంబ సభ్యుల ఆర్తనాదాలనే ఆలకించని మనిషి ప్రజల ఆర్తనాదాలను పట్టించుకుంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది. తండ్రిని మించిన తనయుడిని అనిపించుకుంటానంటే ఏమో అనుకున్న వాళ్లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. తమకు తెలిసిన జగన్‌ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ వేరు అన్న షర్మిల వ్యాఖ్యల్లో అర్థం లేకపోలేదు. తన పుట్టుకను సైతం బజారుకీడ్చడంతో తొలుత రోదించిన షర్మిల ఇప్పుడు మనసుకు సర్దిచెప్పుకొని ‘ఏం పీక్కుంటారో పీక్కోండి. నేను వెనక్కి తగ్గేది లేదు’ అని సవాలు చేసే స్థితికి వచ్చారు. జగన్‌ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు. అధికారంలో ఉన్నందువల్ల ఇప్పుడు సోషల్‌ మీడియా నుంచి వారికి రక్షణ లభిస్తుండవచ్చు. రేపు అధికారం కోల్పోతే వారి పరువును మాత్రం బజారుకు ఈడ్చరన్న గ్యారంటీ ఏమిటి? రాజశేఖర రెడ్డి జీవించినంత కాలం ఆయన కుటుంబ సభ్యులు తలెత్తుకొని బతికారు. ఇప్పుడు ఆయన భార్య, కూతురు పరువు బజారున పడింది. ఇంతకంటే విషాదం ఉంటుందా? ఆడపడుచుల ఆక్రందనకు ప్రభుత్వం స్పందించకపోయినా పౌరసమాజం అయినా స్పందిస్తుందని కోరుకుందాం!

ఇదీ అసలు స్వరూపం...

పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల తన సోదరుడైన జగన్‌ పాలనపైన నేరుగా విమర్శలు చేయడంతో పాటు ఆయన నిజ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. ‘రాయలసీమ పౌరుషం, పులివెందుల పులి’ అని జగన్‌రెడ్డిని ఆయన మద్దతుదారులు శ్లాఘిస్తూ ఉంటారు. అయితే ఆయన ‘పులి కాదు పిల్లి’ అని ఇప్పుడు షర్మిల బయటపెట్టిన రహస్యంతో స్పష్టమవుతోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యంత బలవంతురాలిగా ఉన్న సోనియాగాంధీని ధిక్కరించి మరీ జగన్‌ అధికారంలోకి వచ్చారని ఇప్పటిదాకా జరిగిన ప్రచారం బోగస్‌ అని షర్మిల మాటలతో తేలిపోయింది. జైలులో ఉన్నప్పుడు తనకు బెయిల్‌ కోసం సహకరించవలసిందిగా సోనియాగాంధీ వద్దకు జగన్‌రెడ్డి తన భార్య భారతీ రెడ్డిని రాయబారం పంపారని షర్మిల చెప్పకనే చెప్పారు. జగన్‌కు బెయిల్‌ కోసం సోనియా వద్దకే కాదు– అప్పట్లో ఆమెకు సలహాదారుడుగా ఉన్న అహ్మద్‌ పటేల్‌ను విజయమ్మ, భారతీ రెడ్డి పలుమార్లు కలసి వేడుకున్నట్టు అప్పట్లోనే కొందరికి తెలుసు. అయితే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా... ‘నా భర్తతో కలసి భారతి.. సోనియాగాంధీ వద్దకు వెళ్లలేదా? నన్ను ముఖ్యమంత్రిని చేయాలని అప్పుడు నేను సోనియాకు నా భర్త ద్వారా ప్రతిపాదన పంపానా? సోనియా వద్ద ఏమి జరిగిందో భారతీ రెడ్డి చెప్పగలరా?’ అని షర్మిల సూటిగా సవాలు చేయడంతో అప్పుడు తెర వెనుక ఏమి జరిగిందో తెలుస్తోంది. ఆనాడు సోనియా వద్దకు తన కుటుంబ సభ్యులను పంపిన జగన్‌రెడ్డి కాళ్ల బేరానికి దిగారని ఇప్పుడు స్పష్టం అవుతోంది. తనకు బెయిల్‌ ఇప్పిస్తే తన మద్దతు కాంగ్రెస్‌ పార్టీకే ఉంటుందని జగన్‌ ప్రతిపాదన కూడా పంపారు. కేవలం బెయిల్‌ కోసం కాళ్ల బేరానికి దిగిన జగన్‌రెడ్డి ‘పులివెందుల పులి’ ఎలా అవుతారు? అతడొక పిల్లి మాత్రమే! ఇప్పుడు తన బెయిల్‌ రద్దు కాకుండా ఉండటం కోసం,

తన కేసుల విచారణ ముందుకు సాగకుండా ఉండేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఊడిగం చేయడం నిజం కాదా? రాష్ట్ర ప్రయోజనాలు గాలికి పోయినా ఫర్వాలేదు– తనకు రక్షణ కల్పిస్తే చాలు అని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా వద్ద మోకరిల్లడం నిజం కాదా? ఇలాంటి మనిషికి ‘పులి’ అంటూ భుజకీర్తులు తగిలించడం హాస్యాస్పదంగా ఉంటుంది. మడమ తిప్పడంలో కూడా జగన్‌ రికార్డు సృష్టించారు. గతంలో సోనియా వద్ద, ఇప్పుడు మోదీ–షాల వద్ద మడమ తిప్పుతూనే ఉన్నారు. అందుకే కాబోలు ఆయన కాలి మడమ తరచూ బెణుకుతూ ఉంటుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని రక్షించడం కోసం జగన్‌ చేసిన ప్రయత్నాలు తెలియనివి కావు. అవినీతి కేసులలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయగలిగిన సీబీఐ అధికారులు వివేకానంద రెడ్డి కేసులో అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారంటే జగన్‌ ప్రయత్నాలు ఎంతగా ఫలించాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ గమనిస్తే జగన్‌రెడ్డి నిజమైన పులి కాదు – మేకవన్నె పులి మాత్రమే అని భావించవచ్చు. ఆయన మేకవన్నె పులి కనుకే తనను సవాలు చేస్తున్న చెల్లెళ్ల పైకి సోషల్‌ మీడియాలోని కిరాయి మూకలను ఉసిగొల్పుతున్నారు. నిన్నటి వరకు తెలంగాణలో జగన్‌ అనుకూల కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నందున సోషల్‌ మీడియా వికృతాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినందున డాక్టర్‌ సునీత శుక్రవారం నాడు చేసిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందిస్తారని ఆశిద్దాం! సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వికృత మూకకు కూడా కుటుంబాలు ఉంటాయి. ఈ వికృత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలను వాళ్ల ఇళ్లలోని ఆడవారు ఎలా సహిస్తున్నారో తెలియదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్నప్పటికీ ఉన్మాద మూక రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కూడా వదలకుండా వేధిస్తున్నారంటే జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటో? ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుందా? పోలీసులను సైతం కిరాయి సైనికులుగా మార్చివేసినందున జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు ప్రాథమిక హక్కులను మరచిపోవాల్సిందే. ఒకప్పుడు థగ్గులు, పిండారీలు గ్రామాలపై పడి దోచుకొనే వాళ్లు. మహిళలను చెరపట్టే వాళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో నాటి పరిస్థితులు పునరావృతమైనా ఆశ్చర్యపోవాల్సినది ఉండదు. తస్మాత్‌ జాగ్రత్త! తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం గద్దె దిగాక పౌర సమాజం ప్రజాస్వామ్య గాలులు పీలుస్తోంది. రానున్న ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిద్దాం!

ఆర్కే

Updated Date - Feb 04 , 2024 | 05:05 AM