Share News

‘కారు’కు దారేది?

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:33 AM

సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ర్టాలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రమైన పరిస్థితి...

‘కారు’కు దారేది?

సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ర్టాలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముందుగా తెలంగాణ విషయం చర్చిద్దాం! తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారంలో కొనసాగిన భారత రాష్ట్ర సమితి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి రావడం ఒక రకంగా ఆ పార్టీకి కొత్త అని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ వర్గాల నుంచి, ముఖ్యంగా తెలంగాణకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఇతరుల నుంచి అందిన సహకారంతో భారత రాష్ట్ర సమితి పరోక్షంగా అధికారం చెలాయించిందని చెప్పవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులలో లోక్‌సభకు ఎన్నికలు జరగనుండడంతో బీఆర్‌ఎస్‌ ఇరకాటంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నెలలు గడవకముందే ఈ ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఈ రెండు పార్టీలను ఢీకొని నిలదొక్కుకోవడం బీఆర్‌ఎస్‌కు సంకటంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేని పరిస్థితి ఎదురైతే ఆ తర్వాత పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఎంఎల్‌ఏలలో ఎంతమంది మిగులుతారో తెలియదు. అనూహ్య ఓటమితో కుంగిపోయిన నేతలు లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధపడతారా? వంటి ప్రశ్నలు కూడా బీఆర్‌ఎస్‌ నాయకులను వేధిస్తున్నాయి. మరోవైపు భారత రాష్ట్ర సమితిని మింగేయడం ద్వారా తెలంగాణలో ప్రతిపక్షపాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ అభిలషిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం! ఈ ప్రతిపాదనను మాజీమంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెరపైకి తెచ్చారు.

బీజేపీతో పొత్తు అనివార్యతను పార్టీ పెద్దల వద్ద ప్రస్తావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఈ ఆలోచనలను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో ముస్లింలు గణనీయంగా ఉన్నందున బీజేపీతో చేతులు కలిపి వారిని శాశ్వతంగా దూరం చేసుకోవడం సరైంది కాదని కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నంత వరకు మజ్లిస్‌ పార్టీతో మంచి దోస్తానా ఉండేది. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తే మజ్లిస్‌ పార్టీ కూడా దూరమవుతుందని, దాని ప్రభావంతో ముస్లింలు పార్టీకి దూరమవుతారని కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నారు. అయితే కేటీఆర్‌ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీని ఎదుర్కొని నిలదొక్కుకుంటూ పార్టీని బతికించుకోవడం కష్టమని కేటీఆర్‌ అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే దాని ప్రభావం పార్టీ మనుగడపై పడుతుందని, అదే జరిగితే పార్టీ నుంచి వలసలను నిరోధించలేమని కేటీఆర్‌ అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల గండాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు తమ ముందున్న అతి పెద్ద సవాలనీ, ఈ కారణంగా తమ ఆలోచనలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయని పార్టీ ముఖ్యుడొకరు చెప్పారు. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం ఇష్టపడి చేస్తున్న ఆలోచన కాదనీ, పార్టీ మనుగడ కోసం విధిలేని పరిస్థితులలో ఆ దిశగా ఆలోచిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. అంతులేని అధికారాన్ని చలాయించిన కేసీఆర్‌కు ప్రతిపక్ష రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఉన్నంత ఓర్పు, నేర్పు కూడా కేసీఆర్‌కు లేవు. గతంలోనూ, ఇప్పుడూ పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పటికీ అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నిలబెట్టుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఫాంహౌస్‌కు వెళ్లిపోయి, అక్కడ కాలు జారి పడి ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌కు ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవడం కత్తి మీద సామే అవుతుంది. శాసనసభ సమావేశాలలో పాల్గొని... నిన్నటి వరకు తాను కూర్చున్న స్థానంలో తనకు ఏ మాత్రం గిట్టని రేవంత్‌ రెడ్డి కూర్చోడాన్ని చూడలేకనే తుంటి విరిగిందన్న నాటకాన్ని కేసీఆర్‌ రక్తి కట్టించారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఏది ఏమైనా బీఆర్‌ఎస్‌ నాయకులకు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తున్నది. ఈ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే... అని ఆలోచన చేస్తున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ద్వారా ఈ పొత్తు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నిజానికి తెలంగాణలో భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి కూడా ఇష్టం లేదని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ లేచి నిలబడలేదు. ఈ పరిస్థితులలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్లీ జీవం పోసే బదులు... తెలంగాణ రాజకీయ రంగస్థలం నుంచి మాయమయ్యే పరిస్థితి బీఆర్‌ఎస్‌కు కల్పించగలిగితే తాము ప్రతిపక్షంగా నిలబడతామని కమలనాథులు ఆలోచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సుముఖంగా లేరు. అయితే, పొత్తు ప్రతిపాదన భారత రాష్ట్ర సమితి వైపు నుంచే వచ్చింది కనుక బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోలేదు.

బీఆర్‌ఎస్‌ దారెటు...

బీజేపీతో పొత్తు అనేది బీఆర్‌ఎస్‌కు ఆత్మహత్యాసదృశం అవుతుందా? లేక బతికి బట్టకట్టడానికి ఉపయోగపడుతుందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడంకోసమే జాతీయ రాజకీయాలలోకి వెళుతున్నానని ప్రకటించిన కేసీఆర్‌... తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో కూడా చెప్పుకొన్నారు. పొరుగు రాష్ర్టాలకు చెందిన వారిని ఆకర్షించడానికి డబ్బు పంచిపెట్టారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించి కొంతమంది ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించారు. దీంతో తెలంగాణకు చెందిన ఆ పార్టీ నాయకులు భ్రమల్లోకి వెళ్లారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు వంటివారు మాత్రం అప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ ఏర్పాటును, జాతీయ రాజకీయాల ఆలోచనను వ్యతిరేకించారు. అయితే కేసీఆర్‌ను ఎదిరించే సాహసం చేయలేక అప్పట్లో వారు కూడా వంత పాడారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురైన కేసీఆర్‌ ఇకపై జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే సాహసం చేయకపోవచ్చు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాలు అంటూ ఎగిరిపడితే ఏమవుతుందో నేను అప్పుడే చెప్పాను. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ఇకపై కొత్తగా అందుకోబోయే పదవి కూడా ఏదీ లేదు. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎదురుపడటం కేసీఆర్‌కు ఏ మాత్రం ఇష్టం లేదట! అందుకే మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్‌కు వయసు మీద పడుతోంది. పార్టీని ఎంతో కాలం ఆయన నడపలేరు. ఈ కారణంగా బీఆర్‌ఎస్‌ను నిలబెట్టుకోవలసిన బాధ్యత కేటీఆర్‌పై పడింది. అందుకే ఆయన ప్రస్తుతం పార్టీ పైనే దృష్టి కేంద్రీకరించారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. తనకు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నందున పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం కేటీఆర్‌కే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే బీజేపీతో పొత్తుకోసం ఆయన పట్టుపడుతున్నారు. కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నట్టుగా బీజేపీతో పొత్తు దీర్ఘకాలంలో బీఆర్‌ఎస్‌కు నష్టం చేసే అవకాశం లేకపోలేదు. పార్టీని బతికించుకోవాలంటే లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుతానికి బీజేపీతో చేతులు కలపడం అనివార్యం అన్న కేటీఆర్‌ అండ్‌ కో వాదనలోనూ హేతుబద్ధత లేకపోలేదు. అయితే బీజేపీ పెద్దలు ఈ పొత్తు ప్రతిపాదనను స్వాగతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.


ఏపీలో చిత్రం ఇలా...

తెలంగాణ రాజకీయం ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారతీయ జనతా పార్టీని కాదనలేని పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మంచి ఊపుమీదుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోవైపు జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరిపోయి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. వైసీపీలో జగన్‌ తిరస్కరిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంకుకు ఎంతో కొంత గండిపడుతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కలసివచ్చే అంశాలే అయినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తే నిరాకరించే పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేరు. దీంతో ఇటు తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి, అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలవాల్సి రావడం బలవంతపు బ్రాహ్మణార్థంగా మారింది. బీజేపీతో చేతులు కలపడం వల్ల తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి కొంత నష్టం, కొంత లాభం ఉంటుంది కానీ... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీకి నష్టమే ఉంటుంది. అయితే జగన్‌ అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే బీజేపీ సహకారం తెలుగుదేశం పార్టీకి అవసరం. అయితే, అదే సమయంలో బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాయలసీమలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్నారు. ఈ కారణంగా రాయలసీమకు చెందిన తెలుగుదేశం నాయకులు బీజేపీతో పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇది వరకే పొత్తు ప్రకటన చేసిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం నాయకత్వం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. బీజేపీతో చేతులు కలిపితే జగన్‌కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీ పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవొద్దని, ఎన్నికల అనంతరం ఎన్డీయేలో చేరతామని నచ్చజెప్పడానికి తెలుగుదేశం, జనసేన తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి చెప్పుకోదగిన బలం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేకపోగా ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. అయినా బీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలకు బీజేపీని కాదనుకోలేని అనివార్యత ఏర్పడిందంటే... ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణం. రాజకీయాలలో అవసరం కోసం పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మొదటిసారిగా తెలుగునాట ఇష్టం లేకపోయినా బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడటం సరికొత్త పరిణామం. రాజకీయాలలో కూడా బలవంతపు బ్రాహ్మణార్థం ఉంటుందని ఇప్పుడే తెలుస్తోంది.

ఈ విషయం అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇరువురూ రాజకీయాలు చర్చించుకున్నారని, జగన్‌కు కేసీఆర్‌ కొన్ని సలహాలు ఇచ్చారని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే తన ఓటమికి కారణం తెలుసుకోలేకపోయిన కేసీఆర్‌ మరొకరికి సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి కేసీఆర్‌ను పరామర్శించడానికి జగన్‌ రావడం పలువురు బీఆర్‌ఎస్‌ ముఖ్యులకు ఇష్టం లేదు. జగన్‌ వల్లే మెజారిటీ సీమాంధ్రులు తమ పార్టీకి దూరమయ్యారని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ జగన్‌తో రాజకీయాలు చర్చించడం సీమాంధ్రులను శాశ్వతంగా దూరం చేసుకోవడమే అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.


నెలదాటిన పాలన...

ఈ విషయం అలా ఉంచితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెలరోజులైంది. ఒక ముఖ్యమంత్రి వ్యవహార శైలి గురించి తెలుసుకోవడానికిగానీ, ప్రభుత్వం ఎలా ఉండబోతున్నదన్న దానిపై అభిప్రాయానికి రావడానికిగానీ ఈ నెల రోజులు సరిపోవు. అయితే రేవంత్‌ రెడ్డిపై పలువురిలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలిని గమనించిన వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. నిజానికి చాలా మందికి రేవంత్‌ రెడ్డి గురించి సరైన అవగాహన లేదు. చాలా మంది ఆయనను తేలికగా తీసుకున్నారు. రేవంత్‌ రెడ్డిలో లోతైన మనిషి ఉన్నాడని, నిర్దిష్టమైన ప్రణాళికతోనే ఆయన అడుగులు వేస్తారని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. నెల రోజులుగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ వ్యవహార శైలిని గమనిస్తున్న వారు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. రేవంత్‌ రెడ్డిపై మా అభిప్రాయం సరైంది కాదని ఈ నెల రోజుల్లో తెలుసుకున్నామని ఇప్పుడు వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు ప్రకటించడం మినహా మిగతా విషయాలలో ఆయన పరిణతి ప్రదర్శిస్తున్నారు. అధికారుల నియామకాల నుంచి ప్రభుత్వపరంగా సమీక్షల వరకు... రేవంత్‌ రెడ్డి అనుభవం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా ఆయన పనితీరును గమనించాక రేవంత్‌ రెడ్డిలో ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పవచ్చు. చంద్రబాబు వలె కష్టపడుతున్నారు, రాజశేఖర రెడ్డిలా కలుపుగోలుగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వాన్ని సాఫీగా నడపగలుగుతున్నప్పటికీ ఇకపై అసలైన సవాళ్లు ఎదురుకానున్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున రేవంత్‌ ప్రభుత్వానికి ఇంకా సుస్థిరత ఏర్పడలేదు. లోక్‌సభ ఎన్నికల గండం దాటితేగానీ ఆయన రాజకీయంగా కుదురుకోలేని పరిస్థితి! లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించలేని పక్షంలో రేవంత్‌ రెడ్డి ఇబ్బందుల్లో పడతారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఇప్పటికీ ఆయనను ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. రేవంత్‌ కింద పనిచేయడానికి ఒకరిద్దరు ఇప్పటికీ మానసికంగా సిద్ధపడలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరవలసిందిగా ఒకరిద్దరు మాజీ ఎంపీల వద్ద కొందరు ప్రతిపాదించగా, రేవంత్‌ దగ్గర పనిచేయాలా? అని చులకనగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అదే రేవంత్‌ రెడ్డి అందరికీ తెలిసిన రేవంత్‌ రెడ్డిలా కాకుండా అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన సమావేశాలకు సీనియర్‌ మంత్రులను ఆహ్వానిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో విభేదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘ఫార్మాసిటీ రద్దు చేస్తాం’ వంటి ఒకటీ రెండు తొందరపాటు ప్రకటనలు మినహా మిగతా వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నెల రోజులలో రేవంత్‌ రెడ్డి మంచి మార్కులే సాధించారు. ఆయనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు కూడా ఇప్పుడు తమ అభిప్రాయం మార్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో కూడా ఆయన పాలన ఇలాగే సాఫీగా సాగుతుందని చెప్పలేం. లోక్‌సభ ఎన్నికలే కాదు– ఆరు గ్యారంటీల అమలు వంటివి రేవంత్‌ సామర్థ్యానికి పరీక్షగా ఉండబోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఖజానా ఖాళీ చేశారని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. అయితే, ప్రజలు ప్రభుత్వ ఆర్థిక కష్టాలను పట్టించుకోరు.

ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ఎదురు తిరుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. లోక్‌సభ ఎన్నికల నాటికి గ్రేటర్‌ వాసులలో ఫీల్‌ గుడ్‌ భావన కల్పించాల్సిన బాధ్యత రేవంత్‌ రెడ్డిపై ఉంది. అదే సమయంలో రాజకీయంగా సుస్థిరత సాధించవలసి ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న అభిప్రాయం బలంగా ఉన్నందున లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఏ మేరకు ఉంటుందో తెలియదు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు భిన్నంగా రేవంత్‌ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉండే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకొని రాష్ర్టానికి సహాయ సహకారాలను అర్థించారు. అయితే, కాంగ్రెస్‌ పొడ గిట్టని నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారో లేదో తెలియదు. సొంత పార్టీలో కూడా పట్టు సాధించవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది. ప్రస్తుతానికి 39 మంది సభ్యుల బలంతో శాసనసభలో బీఆర్‌ఎస్‌ బలమైన ప్రతిపక్షంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌–బీజేపీ చేతులు కలిపితే కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు సాధించిపెట్టడం రేవంత్‌ రెడ్డికి అతి పెద్ద సవాల్‌ అవుతుంది. ఈ సవాల్‌ను అధిగమించగలిగితేనే తానేమిటో రుజువు చేసుకొనే అవకాశం ఆయనకు లభిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి వంటివారు ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కూడా బలమైన ముద్ర వేశారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి తనదైన ముద్ర వేయగలిగితేనే ఆయనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇటు ప్రజల్లో, అటు కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తన నాయకత్వం పట్ల విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిపై ఉంది. ముఖ్యమంత్రిగా కూడా రేవంత్‌ రెడ్డి ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగానే ఉంటున్నారు. ఆహార్యంలో కూడా ఎటువంటి మార్పు లేకుండా సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్నందున పార్టీపరంగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చునుగానీ ఎమ్మెల్యేలను సంతృప్తి పరుస్తూ ఉండటమే ప్రధాన సమస్యగా ఉంటుంది. ఫిరాయింపులను ప్రోత్సహించే పక్షంలో కాంగ్రెస్‌లో చేరడానికి బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిద్థంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి, ఆరు గ్యారంటీలను సజావుగా అమలు చేయగలిగితే రేవంత్‌ రెడ్డి నాయకుడిగా బలపడిపోతారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగిన రేవంత్‌ ఈ లక్ష్యాలను సాధించలేకపోతారా? వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - Jan 07 , 2024 | 02:33 AM