Share News

ముసురుకుంటున్న రజాకార్‌ మనస్తత్వం!

ABN , Publish Date - Mar 26 , 2024 | 02:16 AM

ఫాసిస్టులు పోయారు! నాజీలు నాశనమొందారు! ఎంత గట్టిగా చెప్పుకొన్నా ఇది అర్ధసత్యమే! భావజాలంగా ఫాసిజం పోలేదు. నాజీయిజమూ కనుమరుగు కాలేదు. కొత్తరూపాల్లో అవి కనపడుతూనే ఉన్నాయి. రజాకార్లు ఇప్పుడు లేరు. కానీ...

ముసురుకుంటున్న రజాకార్‌ మనస్తత్వం!

ఫాసిస్టులు పోయారు! నాజీలు నాశనమొందారు! ఎంత గట్టిగా చెప్పుకొన్నా ఇది అర్ధసత్యమే! భావజాలంగా ఫాసిజం పోలేదు. నాజీయిజమూ కనుమరుగు కాలేదు. కొత్తరూపాల్లో అవి కనపడుతూనే ఉన్నాయి. రజాకార్లు ఇప్పుడు లేరు. కానీ రజాకర్‌ మనస్తత్వం పుంజుకుంటోంది. జాతి, మత ఆధిక్యతా భావాలు.. ప్రజాస్వామ్యం– సామాజిక సమానత్వంపై వ్యతిరేకత.. అసమ్మతి అణచివేత కేంద్రంగా ఫాసిస్టు మనస్తత్వం ఉంటుంది. రజాకార్‌ మనస్తత్వానికి ఇదే పునాది. రజాకార్ల దురాగతాలపై ఎన్ని సినిమాలైనా తీయొచ్చు. ఎన్ని కథలైనా రాయొచ్చు. ఇప్పడు ముసురుకుంటున్న ప్రమాదం రజాకార్‌ మనస్తత్వమే. రజాకార్ల ఆగడాల గురించి అలుపెరగకుండా మాట్లాడుతున్న వారే దీన్ని ప్రదర్శిస్తున్నారు.

గెలుచుకున్న రాజ్యం ఎల్లకాలం ముస్లింల ఆధిపత్యం కింద ఉండాలన్న భావన రజాకార్లను నడిపించింది. ఇందుకోసం చాలా వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. పాలించే అధికారం నవాబుకు కాకుండా ముస్లిం ప్రజలకే చెందుతుందనేది అందులో ప్రధానమైంది. నిజాం నవాబు కేవలం ఆ అధికారానికి పరిరక్షకుడు మాత్రమే. ఆ పరిరక్షకుడికి ప్రమాదం వస్తే ముస్లింలందరూ పోరాడాలని ప్రచారం చేశారు. అందుకోసం ముస్లింలు స్వచ్ఛంద సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు. రజాకార్ల పుట్టుకకు పూర్వరంగమిది. 1920ల నుంచి ప్రజాప్రాతినిధ్య పాలన కోసం దేశంలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. నిజాం సంస్థానంలోనూ వాటి ప్రతిస్పందనలు తలెత్తాయి. ముస్లింలను సంఘటితపరచటానికి 1927లో ఏర్పాటైన ఇత్తెహాద్‌ ఉల్‌ ముసల్మీన్‌ సంస్థ 1936 నాటికి రాజకీయ సంస్థగా మారింది. ఇత్తెహాద్‌ స్థాపకుల్లో నవాబ్‌ బహదూర్‌ యార్‌ జంగ్‌ ఒకరు. సార్వభౌమాధికారం ముస్లిం ప్రజలదే అన్న సిద్ధాంతానికి రూపకర్త ఆయనే. ప్రజల్లో పెరిగే ప్రజాస్వామ్య ఆకాంక్షలను, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవటమే క్రమేపీ ఇత్తెహాద్‌ అజెండాగా మారింది. 1946లో ఇత్తెహాద్‌ అధ్యక్షుడిగా ఖాసింరజ్వీ ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి రజాకార్లు చెలరేగిపోయారు. మూడేళ్ల పాటు నిజాం సంస్థాన రాజకీయాలను రజ్వీ శాసించాడు. రాజ్యాధికారాన్ని కాపాడుకోవటానికి నిజాం కూడా రజ్వీకి చేదోడుగా నిలిచాడు. రజ్వీ నిజాం సంస్థానంలో పుట్టలేదు. ఇక్కడ చదవలేదు. కానీ స్థానిక ముస్లింలకు తిరుగులేని నాయకుడయ్యాడు. అతని పిలుపుతో వేలమంది స్వచ్ఛంద సైనికులయ్యారు. నైజాంను శాసించటమే గాక, ప్రధానిగా ఎవరు ఉండాలో అతనే నిర్దేశించాడు. భారత్‌తో వ్యవహరించాల్సిన తీరుపై ఆదేశాలిచ్చాడు. యూపీలో పుట్టి అలీఘడ్‌లో లా చదివిన రజ్వీకి నైజాం సంస్థానంపై ఇంతపట్టు ఎలా వచ్చింది? ఆపరేషన్‌ పోలో (పోలీసు చర్య) అనంతరం రజ్వీపై పెట్టిన కొన్ని కేసులు ఎందుకు వీగిపోయాయి. ఘోర దారుణాలకు ఏడేళ్ల శిక్షను మాత్రమే అనుభవించి పాకిస్తాన్‌ ఎలా వెళ్లిపోగలిగాడు? నిజాం సంస్థానం చివరి ప్రధానిగా వ్యవహరించిన లాయక్‌ అలీపై కేసులెందుకు పెట్టలేదు? గృహ నిర్బంధం నుంచి పాక్‌కు ఎలా పారిపోగలిగాడు? ఉక్కుమనిషి పటేల్‌ హోంమంత్రిగా ఉన్నప్పుడే ఇదెలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉన్నాయి. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నరేంద్ర చపల్‌గావ్‌కర్‌ వాటిల్లో కొన్నిటిని చాలా ఆసక్తికరంగా వివరించారు. ‘ద లాస్ట్‌ నిజాం అండ్‌ హిజ్‌ పీపుల్‌’ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో అవన్నీ దొరుకుతాయి.

1900 మే 31న పుట్టిన (కొన్నిచోట్ల 1902 జూలై 17గా ఉంది) రజ్వీ న్యాయవాదిగా లాతూర్‌ (మహారాష్ట్ర) వచ్చాడు. అక్కడే ఇత్తెహాద్‌లో చేరాడు. అతివాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1946 డిసెంబరులో ఇత్తెహాద్‌ అధ్యక్షుడు అయ్యాడు. ఇత్తెహాద్‌కు ఆనాటికి రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉండేవి. ముస్లిం పాలక రాజ్యంగా నిజాం సంస్థానాన్ని యథాతథంగా కొనసాగించటం అందులో మొదటిది. భారత్‌లో చేరకుండా స్వతంత్రంగా ఉండటం రెండోది. మొదటి దాని కోసం ముస్లింల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టటం ప్రారంభించారు. రెండో దానికోసం భారత్‌తో విలీనం ఊసెత్తకుండా హిందువులను భయభ్రాంతులకు గురిచేశారు. కమ్యూనిస్టుల నేతృత్వంలో మొదలైన తెలంగాణ సాయుధపోరుపై కూడా రజాకార్లు విరుచుకుపడ్డారు. ముస్లిం పాలనను దెబ్బతీసే ఉద్యమంగానే రజాకార్లు దీన్ని భావించారు. రకరకాల దారుణాలు, ఉద్యమాలతో నిజాం సంస్థానం అట్టుడుకుతున్న పరిస్థితుల్లోనే దేశ విభజనకు రంగం సిద్ధమైంది. బ్రిటిషు పాలకులు దేశాన్ని వీడటం ఖాయమైపోయింది. అప్పుడే నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రకటించింది. వీటి ప్రకారం ప్రతి జిల్లా నుంచి ఒక హిందూ, ఒక ముస్లిం ప్రతినిధిని చట్ట సభలకు ఎన్నుకుంటారు. జాగీరుదార్లు, సర్దార్ల ప్రతినిధులూ ఎన్నికవుతారు. ప్రభుత్వమూ మరికొందరిని నామినేట్‌ చేస్తుంది. ఒకటి మాత్రం స్పష్టంగా కపడుతుంది. ముస్లింల ఆధిక్యతకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ వీటిని తిరస్కరించింది. ముస్లిం స్థానాలన్నిటినీ ఇత్తెహాద్‌ కైవసం చేసుకుంది. సభాపక్షం నేతగా రజ్వీ ఎన్నికయ్యాడు. ఉదారవాది, పాలనానుభవం ఉన్న ప్రధాని మీర్జా ఇస్మాయిల్‌ని రజాకార్లు పనిచేయనివ్వలేదు. విసిగిపోయి రాజీనామా చేశారు. ‘రజాకార్ల ఆగడాల కట్టడికి మీ నుంచి ఒక్క మాట వస్తే చాలు’ అని ఇస్మాయిల్‌ లేఖ రాసినా నిజాం నుంచి ఉలుకూపలుకూ లేదు.

1947 ఆగస్టు 15 నాటికి కశ్మీర్‌, జునాగఢ్‌, నిజాం సంస్థానాలు మాత్రమే భారత్‌లో విలీనానికి దూరంగా ఉన్నాయి. నిజాం ప్రతినిధి బృందం (ప్రధాని ఛత్తారీ, వాల్టర్‌ మాంక్టన్‌, సుల్తాన్‌ అహ్మద్‌)తో అప్పటికే ఢిల్లీలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఇరుపక్షాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మినహా మిగతా అంశాలన్నీ నిజాం ప్రభుత్వం కిందే ఉండేటట్లుగా ముసాయిదా తయారైంది. 1947 అక్టోబరు 26న నిజాం మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపింది. నిజాం కూడా అందుకు సరేనని సంతకాన్ని ఒక రోజు వాయిదా వేస్తాడు. మరుసటి రోజు ఉదయానికి పరిస్థితి భయానకంగా మారుతుంది. రజ్వీ ఆదేశాలతో రజాకార్లు ప్రతినిధి బృందం ఇళ్లను చుట్టిముట్టి బీభత్సం సృష్టిస్తారు. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిజాం తన ఇంట్లో ఏర్పాటుచేసి రజ్వీని దానికి ఆహ్వానించాడు. ఒప్పందాన్ని రజ్వీ మొత్తంగా వ్యతిరేకిస్తాడు. రజ్వీని నిలువరించలేని నిజాం వైఖరికి నిరసనగా ప్రధానితో పాటు ప్రతినిధి బృందం రాజీనామా చేస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో చర్చల కోసం కొత్త ప్రతినిధి బృందం ఏర్పాటవుతుంది. ఎట్టకేలకు 1947 నవంబరు 29న భారత–నిజాం ప్రభుత్వాల మధ్య యథాతథ ఒప్పందం కుదురుతుంది. ఏడాది పాటు అమల్లో ఉండాల్సిన దానిపై తొలి నుంచి ఉల్లంఘనలు ఆరోపణలు వెల్లువెత్తాయి. షరతుల ప్రకారం భారత సైన్యం హైదరాబాద్‌ నుంచి వైదొలగింది. ఇక ఒప్పందానికి విరుద్ధంగా నిజాం ప్రభుత్వం ఆయుధ సేకరణనూ మొదలుపెట్టింది. మరోవైపు పాక్‌తో సంప్రదింపులూ మానలేదు. రహస్యంగా రూ.20 కోట్ల సహాయాన్ని అందచేసింది. భారత్‌ కరెన్సీ నిజాం సంస్థానంలో చెల్లుబాటు కాదని ప్రకటించింది. ఐరాస భద్రతామండలి తలుపుతట్టింది. భారత సైన్యం సంస్థానంలోకి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.. పాక్‌, బ్రిటన్‌ల‌లో ప్రభుత్వం తరఫున ప్రతినిధులనూ నియమించింది. తొలి నుంచి తమకు చేదోడుగా ఉన్న ప్రధాని మీర్‌ లాయిక్‌ అలీ అండ చూసుకుని రజాకార్లు మరింతగా విజృంభించారు. విలీనం కోసం గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంటన్‌ బాటన్‌ చేసిన విన్నపాలనూ నిజాం లెక్కచేయలేదు. రజాకార్ల దారుణాలు, విస్తరిస్తున్న రైతాంగ సాయుధ పోరాటం, స్వతంత్రంగా ఉండేందుకు నిజాం చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఆపరేషన్‌ పోలోతో అయిదు రోజుల్లోనే నిజాం ప్రభుత్వం లొంగిపోతుంది. లాయిక్‌ అలీని గృహనిర్బంధంలో ఉంచుతారు. రజ్వీని అరెస్టుచేసి కేసులు పెడతారు. ఏడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. 1957లో జైలు నుంచి విడులైన తర్వాత ఇత్తేహాద్‌ సమావేశంలో పాల్గొంటాడు. తాను పాక్‌కు వెళుతున్నాననీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరతాడు. ఎవరూ ముందుకు రారు. అబ్దుల్‌ వహీద్‌ ఓవైసీని రజ్వీ నామినేట్‌ చేస్తాడు. 1957లో కరాచీకి వెళ్లి 1970లో అక్కడే చనిపోతాడు.

నెహ్రూ నిర్వాకం వల్ల కశ్మీర్‌ సమస్య జటిలమైందనీ, అసంబద్ధమైన విధానాలతో ఆర్టికల్‌ 370ని రూపొందించారనే విమర్శ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. పటేల్‌ సమర్థంగా వ్యవహరించి హైదరాబాదుకు ఆ పరిస్థితి లేకుండా చేశారన్న పొగడ్తలూ అందరికీ తెలిసినవే. జరిగిన పరిణామాలను చూస్తే హైదరాబాదు పట్ల కొంత ఉదారత ప్రదర్శించినట్లు కనపడుతుంది. సంస్థానానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యం దీనికి కారణం కావచ్చు. విలీనానికి ఒప్పుకోని ఏ సంస్థానంతోనూ హైదరాబాదు తరహాలో యథాతథ ఒప్పందం జరగలేదు. ఇక లాయిక్‌ అలీతో 1948 మేలో ఢిల్లీలో జరిపిన చర్చల్లో వి.పి.మేనన్‌ కొన్ని ముఖ్య ప్రతిపాదనలను చేశారు. పటేల్‌ వాటిని ఆమోదించారు. వీటి ప్రకారం: 1) తాత్కాలిక క్యాబినెట్‌ వెంటనే ఏర్పాటుకావాలి. ఇందులో 50 శాతానికి తగ్గకుండా ముస్లింమేతరులు ఉండాలి. 2) ఓటు హక్కుని విస్తృతపరచి 1950 జనవరి 1 నాటికి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరపాలి. పరిషత్తులో 60 శాతం ముస్లిమేతరులు ఉండాలి. పరిషత్తుకు బాధ్యత వహించే ప్రభుత్వం ఏర్పడాలి 3) పరిషత్తు నూతన రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది 4) భారత–హైదరాబాదు మధ్య సంబంధాలను కొత్త రాజ్యాంగం నిర్దేశిస్తుంది. 5) ఉద్యోగాల్లో ముస్లిమేతరుల సంఖ్య 1954 జనవరి 1 నాటికి 60 శాతానికి చేరుకోవాలి. వీటినీ నిజాం అంగీకరించలేదు. ఆమోదం తెలిపితే కొన్నేళ్లపాటు హైదరాబాదు స్వతంత్ర రాజ్యంగా కొనసాగేది. ఆ తర్వాతి పరిణామాలు ఏ మలుపులు తిరిగేవో ఇప్పుడు ఊహించనూలేం. విలీనం ఇంత హింసాత్మకంగా మారిన వ్యవహారం మరొకటి లేదు. అయినా నిజాంపైనా, లాయక్‌ అలీపైనా ఎలాంటి కేసులూ పెట్టలేదు. పైపెచ్చు నిజాంకు రాజ్‌ప్రముఖ్‌ పదవినీ కట్టబెట్టారు. పటేల్‌ ఆమోదంతో జరిగిన ఈ నిర్ణయాలపై చాలా వ్యాఖ్యానాలు చేయవచ్చు. అతిగా ఆలోచిస్తే హిందూత్వ రాజకీయ పరిభాషలో ముస్లిం బుజ్జగింపుగానూ భావించొచ్చు. మరోవైపు అతి ప్రాంతీయ మమకారం నిజాం పాలనపై నిష్పాక్షిక అంచనాను మసకబారుస్తోంది.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Mar 26 , 2024 | 02:16 AM