Share News

ఎదురులేని నేత!

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:58 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధికశాతం ఓట్లు సాధించి ఐదోసారి మళ్ళీ అధ్యక్షుడైనారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీచేసిన మూడుపార్టీల అభ్యర్థులకు...

ఎదురులేని నేత!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధికశాతం ఓట్లు సాధించి ఐదోసారి మళ్ళీ అధ్యక్షుడైనారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీచేసిన మూడుపార్టీల అభ్యర్థులకు నాలుగుశాతం చొప్పున ఓట్లు పడితే, మిగతా 88శాతం ఓట్లు పుతిన్‌కే వచ్చాయి. తొలి ఓటు పడడానికి ముందే ఫలితం నిర్ణయమైపోయింది అంటూ పాశ్చాత్యమీడియా ఎప్పటినుంచో రాస్తున్నది, ఆయా దేశాల ప్రతిస్పందన కూడా తదనుగుణంగానే ఉన్నది. రష్యా మిత్రదేశాధినేతలు పుతిన్‌ను అభినందించారు, కలసికట్టుగా ప్రపంచాన్ని ఉద్ధరించాలని ఆకాంక్షించారు.

ప్రధానిగా, అధ్యక్షుడిగా మొత్తం పాతికేళ్ళు గద్దెమీద ఉన్న పుతిన్‌ అంటే ప్రజలకు నిజంగానే విసుగెత్తలేదో, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంవల్ల ఒనగూరిన ప్రయోజనమో తెలియదు కానీ, 2030లో కూడా గెలిస్తే ఈయన ఏకంగా స్టాలిన్‌ రికార్డునే బద్దలుకొడతారట. పుతిన్‌కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడినవారు నిజమైన ప్రత్యర్థులు కారన్న విషయం అందరికీ తెలుసు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వ్యతిరేకించే ఒకరిద్దరిని సైతం చివరిదశలో అభ్యర్థుల జాబితాలోనుంచి తొలగించి పుతిన్‌ ప్రజాదరణకు ప్రమాదం లేకుండా అధికారులు చూసుకున్నారు. అసలు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రశ్నించడమే తీవ్రమైన నేరం కిందకు మార్చేసిన తరువాత, ఎన్నికల్లో ప్రధానమైన అంశమంటూ ఏమీ మిగలకుండా పోయింది. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అలెక్సీ నావెల్నీ కనుక బతికుంటే, ఎన్నికల వేళ స్వేచ్ఛగా తిరగగలిగివుంటే ఫలితాలు ఈ విధంగా ఉండేవా?ఆరేళ్ళనాటి ఎన్నికల్లో పుతిన్‌కు కంటినిండా నిద్రలేకుండా చేసినందుకు ఈ జనాకర్షక ప్రజానాయకుడు ఈ ఎన్నికలకు సరిగ్గానెలరోజుల ముందు ఆర్కిటిక్‌ జైలులో అనుమానాస్పదంగా మరణించాడు. దేశాన్ని విడిచిపోయినవాడు, తిరిగి ప్రజలకోసమంటూ వచ్చినందుకు ప్రాణాలు కోల్పోయాడు. నావెల్నీ మాత్రమే కాదు, ఆయనకు ముందు పుతిన్‌కు సవాలువిసరగలడనుకున్న బోరిస్‌ నెమ్‌త్సోవ్‌ అనే నాయకుడు ఏకంగా నడిరోడ్డుమీదే హత్యకు గురైనాడు. అనేకమంది అసమ్మతినేతలు, రాజకీయ ప్రత్యర్థులు అనూహ్యంగా కన్నుమూస్తుండటంతో, పుతిన్‌తో వైరం ఉన్నవారు ఎత్తయిన భవనాల్లో నివసించకూడదని, ముఖ్యంగా బాల్కనీలో నిలబడి ప్రకృతిని ఆస్వాదించకూడదని ఓ హెచ్చరికలాంటి జోక్‌ ప్రచారంలో ఉంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడం, అసమ్మతి గొంతునొక్కడంలో పుతిన్‌ ఇంకా సంపూర్ణ విజయం సాధించలేకపోయి ఉండవచ్చును కానీ, అన్ని వ్యవస్థలమీదా ఆయన ఆధిపత్యం నూరుశాతం పూర్తయింది.

అంతమాత్రాన, పుతిన్‌ ఇప్పుడు సాధించిన ఘనవిజయమంతా అక్రమంగా ఆర్జించినదేనని అనడం అన్యాయమవుతుంది. బలమైన ప్రత్యర్థి అంటూ లేకపోయినందువల్ల ఆయన ఇంకా బలపడివుండవచ్చునేమో కానీ, ప్రజల్లో ఆయనకు విశేషమైన ఆదరణే ఉంది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నంతో కృంగి, కృశించిన రష్యాకు తిరిగి ప్రాభవాన్ని కట్టబెట్టిన నేతగా ఆయనను అభిమానిస్తున్నవారున్నారు. ఒకప్పుడు పాశ్చాత్యదేశాల ముందు తలదించుకున్న దేశాన్ని తిరిగి తలెగరేసే స్థాయికి తెచ్చాడని, అవమానభారం నుంచి బయటపడవేశాడని ఆయనను కీర్తిస్తున్నవారు ఉన్నారు. ఆయన నిర్ణయాలు, చర్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదన్న పాశ్చాత్యదేశాల ప్రచారం పూర్తిగా తప్పని, రష్యా ప్రయోజనాల పరిరక్షణ వినా పుతిన్‌కు ఏ స్వార్థమూ లేదని నమ్మే ప్రజల సంఖ్య అధికంగానే ఉన్నదని కొందరు అంటారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో రష్యన్లు తీవ్రంగా విసిగిపోయి ఉన్నారని, అది తెచ్చిన కష్టాలతో నానాబాధలు పడుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ, పాశ్చాత్యదేశాల రాజ్య విస్తరణ కాంక్షను ప్రతిఘటించేందుకు, నాటో వీరంగానికి అడ్డుకట్టవేసేందుకు ఈ యుద్ధం సాగుతోందని రష్యన్లు నమ్ముతున్నారు. దీనికితోడు, పశ్చిమదేశాల ఆంక్షలు రష్యాను గట్టిగా దెబ్బతీయలేకపోయాయి. మిగతారోజుల్లో కంటే ఈ యుద్ధకాలంలో అనేక రెట్ల చమురు తోడుతూ, అమ్ముతూ రష్యా ఆర్థికంగా మరింత బలంగా ఉంది. యుద్ధం మూడోఏడాదిలోకి ప్రవేశించినప్పటికీ, రష్యాదే పైచేయిగా ఉంటోంది. ఈ ఎన్నికలను ఉక్రెయిన్‌ యుద్ధం మీద రెఫరెండమ్‌గా ప్రచారం చేసుకున్న పుతిన్‌, ఫలితాలు వెలువడిన అనంతరం ప్రజలకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని కొనసాగించే విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, పాశ్చాత్యదేశాలకు చేసిన హెచ్చరికలను గమనిస్తే, ఆయన సమధికోత్సాహంతో ఉన్నాడని అర్థమవుతుంది. ఇప్పటికైతే పుతిన్‌ను సవాలు చేయగల నేత కనుచూపుమేరలో ఎవరూ లేరు.

Updated Date - Mar 21 , 2024 | 04:58 AM