Share News

పాకిస్థాన్‌లో మారని దృశ్యం

ABN , Publish Date - Mar 07 , 2024 | 02:00 AM

ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు నెలరోజులకు పాకిస్థాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని చూసినవారికి ఇంతకీ అక్కడ ఏం మారిందన్న అనుమానం కలిగేవుంటుంది. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను...

పాకిస్థాన్‌లో మారని దృశ్యం

ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు నెలరోజులకు పాకిస్థాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని చూసినవారికి ఇంతకీ అక్కడ ఏం మారిందన్న అనుమానం కలిగేవుంటుంది. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దెదించేసి, ఎన్నికలు జరిగేంతవరకూ దేశాన్ని ఏడాదిన్నరపాటు ఏలినవారే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. నవాజ్‌షరీఫ్‌ పార్టీ, భుట్టోల పార్టీ రోజుల తరబడి చర్చోపచర్చలు జరిపి, ఎట్టకేలకు ఒక అవగాహనకు రావడంతో అధికశాతం ప్రజలు కోరుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీని అధికారానికి దూరం పెట్టడంలో సైన్యం పైచేయి సాధించింది. గతంలో తాను ప్రతిష్ఠించిన ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చినందున ఇకమీదట కూడా తెరవెనుకనుంచి సైన్యమే చక్రం తిప్పుతుందని అర్థం.

ప్రధాని కావాలనుకున్న నవాజ్ షరీఫ్‌ మళ్ళీ తన సోదరుడినే అధికారంలో కూచోబెట్టి తాను పక్కకు తప్పుకున్నారు. కేంద్రంలో ఈ రెండుపార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, పంజాబ్‌కు నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె ముఖ్యమంత్రి, సింధ్‌లో పీపీపీ, ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీనుంచి స్వతంత్రులుగా గెలిచివచ్చినవారు ఖైబర్‌ఫక్తుంక్వా ప్రావిన్సులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇమ్రాన్‌ సన్నిహితుడి స్థానంలో బెనజీర్‌ భుట్టో భర్త ఆసిఫ్‌ అలీ జర్దారీ దేశాధ్యక్షుడు కాబోతూండటం, ఇమ్రాన్‌ విషయంలో సానుకూలంగా ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్‌కావడం వంటివి అధికారపక్షానికి, సైన్యానికి శుభ పరిణామాలు. అధికారంనుంచి దించడం, మళ్ళీ రాకుండా అడ్డుకోవడమన్న లక్ష్యాలు నెరవేరినంత మాత్రాన ఇమ్రాన్‌ విషయంలో సైన్యం ఇకముందు ఉదాసీనంగా వ్యవహరించే అవకాశమైతే లేదు. సైన్యం మీద ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనది. దాని మద్దతు లేకుండా రాజకీయక్షేత్రంలో నెగ్గుకురావడం కష్టమన్న భావనను ఆయన తుడిపేశారు. ప్రజల్లో సైన్యం పరువుప్రతిష్ఠలను దిగజార్చారు. ఎన్నికల ప్రక్రియ యావత్తూ ఎంత లోపభూయిష్టంగా జరిగినా, ఎన్నికలకు ముందు, తరువాత ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు జరిగినా, ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ ఉన్నదని ఫలితాలు రుజువుచేశాయి. సైనికస్థావరాలపై ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు గత ఏడాది మేనెలలో చేసిన దాడులను చూపుతూ ఆయనను దేశవ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో నిలబడి పోరాడుతున్న యోధుడిగా ఇమ్రాన్‌ను ప్రజలు అభిమానించారు, ఆదరించారు. సైన్యంతో చేతులు కలిపిన పార్టీలకు ప్రజామోదంతో పాటు, విశ్వసనీయత కూడా లేదని ఈ ఫలితాలు తేల్చేసినందువల్లనే, ఇమ్రాన్‌ కంటే ముందు సైన్యంమీద వీరంగం వేసి, ఇప్పుడు సాగిలబడి, అధికారంలోకి రావాలనుకున్న నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని కాకుండా జాగ్రత్తపడ్డారు, సైన్యానికి నమ్మినబంటులాగా వ్యవహరించే సోదరుడిని కూచోబెట్టారు.

వివిధ కారణాలతో కొత్తప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదన్న వాదనలను అటుంచితే, ప్రస్తుతానికి సైన్యం తాను అనుకున్నది సాధించగలిగింది. కొత్త ప్రభుత్వానికి ఆర్థికం నుంచి అంతర్జాతీయ సంబంధాల వరకూ చాలా సమస్యలు పోగుబడివున్నాయి. అఫ్ఘానిస్థాన్‌నుంచి ఉగ్రవాదం ముప్పు, ఇరాన్‌తో దెబ్బతిన్న దౌత్యసంబంధాల సమస్య ఉండనే ఉన్నాయి. భారీగా అప్పులు ఇచ్చిన ఐఎంఎఫ్‌ను మెప్పించాలంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయాలి, ప్రజలను మరింతగా పీల్చిపిప్పిచేయాలి. నవాజ్‌ షరీఫ్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే భారతదేశంతో పాకిస్థాన్‌ వ్యవహారశైలిలో మార్పువస్తుందని చాలా విశ్లేషణలు జరిగాయి. గతంలో మోదీ–నవాజ్‌ బంధం, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ దేశాన్ని సైన్యం ప్రమాదంలో పడవేస్తున్నదంటూ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. 2019లో పుల్వామాదాడి, దానికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన బాలాకోట్‌ దాడులతో ఉభయదేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తిని మోదీ రద్దుచేయడంతో వాతావరణం మరింత గట్టిపడింది. కశ్మీరీలను పాలస్తీనియన్లతో పోల్చడం సహా షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలమీద భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంది. ఇకపై కూడా సైన్యం మనోగతానికి భిన్నంగా వ్యవహరించగలిగే శక్తి ప్రభుత్వానికి ఉండదు కనుక, ఇరుదేశాల సంబంధాల్లో చెప్పుకోగదగ్గ మార్పువచ్చే అవకాశాలైతే లేవు. గతంలో కంటే మరింత అస్థిరమైన పరిస్థితుల్లో, అనేకానేక సమస్యల్లో పాకిస్థాన్‌ ఉన్నది కనుక దాని వైఖరి ఇంకొంత బిగుసుకుపోయే అవకాశాలే మెండు. భారతదేశం ఎప్పటిలాగానే సరిహద్దు ఉగ్రవాదం నుంచి అంతర్జాతీయవేదికలమీద పోరాటం వరకూ దానితో వ్యవహరిస్తూ పోవాల్సిందే.

Updated Date - Mar 07 , 2024 | 02:00 AM