Share News

‘పౌరసత్వ’ ఉపద్రవం

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:34 AM

ఈ సార్వత్రక ఎన్నికలకు ముందే ‘పౌరసత్వ సవరణచట్టం–2019’ని అమలులోకి తీసుకువస్తామని హోంమంత్రి అమిత్‌షా నెలక్రితమే చెప్పారు....

‘పౌరసత్వ’ ఉపద్రవం

ఈ సార్వత్రక ఎన్నికలకు ముందే ‘పౌరసత్వ సవరణచట్టం–2019’ని అమలులోకి తీసుకువస్తామని హోంమంత్రి అమిత్‌షా నెలక్రితమే చెప్పారు. తదనుగుణంగానే, నాలుగేళ్ళనాటి ఈ చట్టాన్ని ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి కాస్తంత ముందు ఆచరణలోకి తెచ్చారు. అసలు ఆ చట్టం రూపకల్పనలోనే రాజకీయ లక్ష్యాలు, దురుద్దేశాలున్నాయని విపక్షాలు భావిస్తున్నప్పుడు, వాటిని మరింత బాగా నెరవేర్చుకొనే సమయాన్ని అధికారపక్షం ఎంచుకుంటే ఎందుకంత ఆగ్రహిస్తున్నాయో అర్థంకాదు. గత సార్వత్రక ఎన్నికల్లో ఒక ప్రధాన అస్త్రంగా ఉపకరించిన అంశాన్ని నాలుగేళ్ళుగా దాచివుంచింది మరో పుణ్యకాలం కోసమే కనుక, సమయం, సందర్భం చూసి అధికారపక్షం దానిని ప్రయోగించింది, ఎందుకైనా మంచిదని దానికి ఓ గ్యారంటీ ట్యాగ్‌ కూడా వేలాడదీసింది.

ఎన్నికల బాండ్ల గుట్టు ఇప్పట్లో విప్పేది లేదని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అన్నందుకు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి, మంగళవారం లోగా వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించిన నాడే పాలకులు సీఏఏని ఆచరణలోకి తేవడం కూడా కొందరికి విచిత్రంగా అనిపించింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వలసవచ్చిన ముస్లిమేతర శరణార్థులకు తగినపత్రాలు లేకున్నా ఈ దేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు ఈ చట్టంలోని నిబంధనలున్నాయి. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడుదేశాల నుంచి మనదేశానికి వచ్చిన ఒక మతంవారు మినహా మిగతా మతస్తులంతా భారత పౌరసత్వాన్ని సునాయాసంగా స్వీకరించవచ్చు. దేశచరిత్రలో తొలిసారిగా భారత పౌరసత్వ అర్హత పరీక్ష మతం ప్రాతిపదికన జరగబోతున్నదని అర్థం. మూడు ముస్లిం దేశాల్లో మతపరమైన హింస దౌర్జన్యాలను తట్టుకోలేక తరలివచ్చిన అక్కడి మైనారిటీలకు ఈ సవరణ చట్టం ఉపకరిస్తుందని పాలకులు అంటున్నప్పటికీ, మతమే పునాదిగా ఒకరికి పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ ఆశయాలకు భిన్నంగా వ్యవహరించడమేనని ఈ దేశంలోని మేధావుల ఆవేదన. కులం, మతం ఇత్యాది భావనలతో, వ్యక్తిగత నమ్మకాలతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో నివసించేవారంతా భారత పౌరులేనని రాజ్యాంగం ప్రవచిస్తుంటే, మూడు ఇస్లామిక్‌ దేశాలనుంచి తరలివచ్చిన ఆయా మతాలవారు అంటూ కొందరిని ప్రత్యేకించి, ఒకమతం వారిని వేరుపరచడం రాజ్యాంగాన్ని అవమానించడం, భారతదేశ లౌకిక స్వరూప స్వభావాలకు పూర్తి భిన్నంగా నడుచుకోవడమే. మతపరమైన ఊచకోతలు, దాడులతో ఈ మూడు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో నివాసం ఉంటున్నవారికి పౌరసత్వాన్ని కట్టబెట్టడంలో తప్పేమీ లేదనుకుంటే, పాకిస్థాన్‌లోనే చాలా ముస్లిం తెగలు వీరితో సమానమైన తీవ్ర మతవివక్షను ఎదుర్కొంటున్నాయి.

దీని అమలుతో తక్షణంగా లబ్ధిపొందేది ఓ ముప్పైవేల మందికి మించి ఉండకపోవచ్చు. కానీ, ఎన్నికల తరుణంలో ఇది అందించే సందేశం బలమైనది. 2020లో సుదీర్ఘకాలం సాగిన ఉద్యమాలు, వాటిని అణచివేసేందుకు పాలకులు ప్రయోగించిన హింసను గుర్తుచేసుకుంటే, రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుంది. యూనివర్సిటీల్లో ఇప్పటికే నిరసనలు జోరందుకున్నాయి, దేశ రాజధాని భయపడుతోంది, అసోం మళ్ళీ వేడెక్కుతున్నది. అసోంలో ముప్పై విద్యార్థి సంఘాలు నిరసనకార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. అక్రమ వలసదారుల ఏరివేత కోసం దశాబ్దాలుగా ఈశాన్యం పోరాడుతూంటే, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా చొరబడినవారిలో హిందువులను మాత్రం ఈ చట్టంతో స్థిరపరచే ప్రయత్నం జరుగుతోందని వారందరి భయం. ఇక, కొన్ని రాష్ట్రాలు ఈ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని ఇప్పటికే ప్రకటించినప్పటికీ, పశ్చిమబెంగాల్‌ రాజకీయాన్ని ఇది మరింత తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నది. సవరణ చట్టం అమలుకు నిబంధనలను నోటిఫై చేయడమే ప్రధానం కనుక, అతిముఖ్యమైన ఆ పని ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు కాక, ఎన్నడో జరిగివుంటే ఉన్నతంగా ఉండేది. ‘మోదీ గ్యారంటీ’లన్నీ అధికారపక్షానికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేరీతిలోనే అమలు జరుగుతాయని, మిగతావన్నీ అమిత్‌ షా ‘జుమ్లా’లుగా మిగిలిపోతాయని పాలకులే తమ చర్యలతో తేల్చేస్తున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 04:34 AM