Share News

ఎన్నికల వేసవి!

ABN , Publish Date - Mar 20 , 2024 | 02:50 AM

సార్వత్రక ఎన్నికలకూ, నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో రాబోయే వేసవికి ఎన్నికలవేడి కూడా తోడవుతోంది...

ఎన్నికల వేసవి!

సార్వత్రక ఎన్నికలకూ, నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో రాబోయే వేసవికి ఎన్నికలవేడి కూడా తోడవుతోంది. అత్యాధునిక ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు, ఆధునిక సౌకర్యాలు అందివచ్చినప్పటికీ, దేశ తొలిసార్వత్రక ఎన్నికల తరువాత మళ్ళీ అంతటి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో దాదాపు 97కోట్ల మంది ఓటర్లు పాల్గొనబోతున్నారు. ఈ ప్రక్రియ నలభైనాలుగురోజులకు విస్తరించడం వెనుక పాలకపక్షం ప్రయోజనాల పరిరక్షణ ఉన్నదన్న విమర్శలూ వింటున్నాం. ఇక, ఎన్నికలతో ముడిపడిన మరో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పుడే ఈ షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఒకపక్క, ఎన్నికల బాండ్లలో రహస్యాన్ని విప్పే లక్ష్యంతో సుప్రీంకోర్టు అదేపనిగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెంటపడుతోంది. మరోవైపు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని కమిటీ 2029నుంచి జమిలికి పోవాల్సిందేనంటూ వందలపేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది.

ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికతను, నిబద్ధతను అంచనావేసే, అనుమానించే కాలం ఇది. సుప్రీంకోర్టు స్ఫూర్తికి పూర్తిభిన్నం గా ఎన్నికల కమిషనర్లను ఎంపికచేసే కమిటీనుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్రప్రభుత్వం ఆ స్థానంలో హోంమంత్రిని చేర్చుకొని, ప్రతిపక్షనాయకుడి మాట చెల్లుబాటు కాకుండా జాగ్రత్తపడింది. ఇక, పాలకులు గతంలో ఏరికోరి నియమించుకున్న అరుణ్‌గోయల్ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారన్నది ఓ బ్రహ్మరహస్యం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తప్ప మిగతా రెండుస్థానాలు ఖాళీ కావడంతో, ఆ పోస్టుల భర్తీ జరిగిపోయింది, తన మార్గదర్శకాలకు భిన్నంగా జరిగిన ఆ నియామకాలను నిలువరించడానికి సర్వోన్నత న్యాయస్థానం కూడా ఉత్సాహపడలేదు. ఆ ఇద్దరు కమిషనర్ల నియామకం తీరును ప్రతిపక్షనాయకుడు ఆధిర్‌ రంజన్‌ ‘రిగ్గింగ్‌’తో పోల్చిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ను నెలలతరబడి సాగదీయడం వెనుక బీజేపీకి ప్రయోజనం కలిగించే ఉద్దేశం ఈసీకి ఉన్నదన్న విమర్శలు కొత్తవేమీ కావు. పశ్చిమబెంగాల్‌లో ఏడుదశల్లో ఎన్నికలు ఉండేలా షెడ్యూల్‌ రూపొందడం వెనుక ఏ అంశాలు పనిచేశాయో తెలియదు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు, ప్రజలకు ఆ మేరకు నమ్మకాన్ని కలిగించాలి. హద్దులుదాటినవారు ఎంతటివారైనా విడిచిపెట్టకుండా, ఎన్నికలు సజావుగా జరిగేట్టు చూడాలి.

అంత తొందర ఎందుకో తెలియదు కానీ, ఈ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు కొద్దిరోజుల ముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ జమిలి ఎన్నికలను బలంగా సమర్థిస్తూ నివేదికను సమర్పించింది. పదేళ్ళుగా పాలకులు కలగంటున్న ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను ఆచరణసాధ్యం చేయడానికి వీలుగా నివేదిక రూపొందింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేమారు నిర్వహించడం, మరో వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయడం, ఒకే ఓటర్లజాబితా, ఒకే ఐడెంటిటీ కార్డు ఇత్యాదివి అనేకం అందులో ఉన్నాయి. జమిలి ఎన్నికలతో కాలమూ ఖర్చూ కలిసొస్తాయని బీజేపీ ఎప్పటినుంచో అంటోంది. గత ఎన్నికల మానిఫెస్టోలో దానిని తన ఎజెండాగా ప్రకటించింది. ౪౭ రాజకీయపక్షాలు తమ అభిప్రాయాన్ని తెలియచేశాయని, వాటిలో 32 పార్టీలు జమిలికి అనుకూలంగా ఉన్నాయని కోవింద్‌ అంటున్నారు. ఏకాభిప్రాయంతోనే జమిలిని సుసాధ్యం చేస్తానని బీజేపీ హామీ ఇస్తున్నది కానీ, ఈ మారు అధికారంలోకి వస్తే ఏ విధంగానైనా దానిని ఆచరణలోకి తెస్తుందన్నది నిర్వివాదాంశం. ఏ ఎన్నికల విధానం ద్వారా ప్రజల ఆకాంక్షలకు, మనోభావాలకు ప్రాధాన్యం దక్కుతుందో దానిని ఆచరించడం ముఖ్యం కానీ, ఆర్థికమో, సౌలభ్యమో ప్రాతిపదికలు కాకూడదు. పార్లమెంటు ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు వేర్వేరు అంశాల ఆధారంగా ఓటుచేస్తారు. జమిలి వల్ల రాష్ట్ర, స్థానిక అంశాలు వెనక్కుపోయి జాతీయ ప్రాధాన్యాల ఆధారంగా ఓటింగ్‌ జరుగుతుందన్నది వాస్తవం. గత రెండు సార్వత్రక ఎన్నికల్లోనూ ఢిల్లీలోని అన్ని స్థానాలనూ బీజేపీ గెలుచుకుంటే, ఆ మరుసటి ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ అద్భుతమైన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. జమిలిలో జాతీయ అంశాలు కీలకమై, ప్రాంతీయపార్టీలకు నష్టం జరుగుతుంది కనుక, బీజేపీ ఈ విధానాన్ని రుద్దుతున్నదని విపక్షాలు అంటున్నాయి. మందబలంతో రాజ్యాంగసవరణలు చేసి, జమిలిని బలవంతంగా తేవడం కాక, సమాఖ్యస్ఫూర్తికి భిన్నమైన ఈ విధానంపై ముందుగా లోతైన చర్చలు జరగాలి.

Updated Date - Mar 20 , 2024 | 02:50 AM