Share News

మసకబారుతున్న ప్రతిష్ఠ

ABN , Publish Date - Mar 19 , 2024 | 02:31 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెద్దలకు ఏమి అనిపిస్తున్నదో తెలియదు కానీ, ఆ బ్యాంకుతో దశాబ్దాల అనుబంధం ఉన్న సామాన్యులకు మాత్రం ఎంతో అవమానంగా...

మసకబారుతున్న ప్రతిష్ఠ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెద్దలకు ఏమి అనిపిస్తున్నదో తెలియదు కానీ, ఆ బ్యాంకుతో దశాబ్దాల అనుబంధం ఉన్న సామాన్యులకు మాత్రం ఎంతో అవమానంగా ఉంది. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో అగ్రస్థానంలో ఉంటూ ప్రపంచ జాబితాల్లోనూ చోటు సాధించిన ఈ బ్యాంకు ఎన్నికల బాండ్ల విషయంలో ఇలా వరుసపెట్టి సర్వోన్నత న్యాయస్థానంతో చివాట్లు తినడం సరికాదు. నిజాయితీ, పారదర్శకతలకు పెద్దపీట వేయాల్సిన ఈ సంస్థ, తనకు తానుగానే తప్పటడుగులు వేస్తున్నదో, పాలకుల ఒత్తిడికి వంగిపోతున్నదో తెలియదు కానీ, సుప్రీంకోర్టుతో అది వ్యవహరిస్తున్న తీరువల్ల ఏళ్ళతరబడి కూడబెట్టుకున్న విశ్వసనీయత చెదిరిపోయే ప్రమాదం ఉంది.

ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారన్న కీలక సమాచారాన్ని తెలియచెప్పే యూనిక్‌ బాండ్‌ కోడ్స్‌ సహా తన వద్ద ఉన్న సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందచేయాల్సిందేనంటూ బ్యాంకును సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు గౌరవప్రదమైన భాషనే ఉపయోగించినప్పటికీ, బ్యాంకు కొంత సమాచారాన్ని దాస్తున్నదనీ, తాను ఎంపిక చేసినదానిని మాత్రమే అందిస్తున్నదని, కీలకమైన లింకులను దాచిపెడుతున్నదని పలు వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. ఎన్నికల సంఘానికి అంతా ఇచ్చేశానని, వీసమెత్తు సమాచారాన్ని కూడా దాచలేదని మార్చి 2౧వ తేదీ సాయంత్రం ఐదుగంటలలోపు బ్యాంకు చైర్మన్‌ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేసుకోవాల్సి వస్తున్నది. కోర్టు ఏది అడిగితే అది అందించడానికి బ్యాంకు సంసిద్ధంగా ఉందని దాని తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే అంటున్నారు కానీ, ఫిబ్రవరి 15 ఆదేశాలను అమలు చేయాలన్న ఉద్దేశం బ్యాంకుకు ఏ మాత్రం ఇష్టంలేదని ఆదిలోనే తేలిపోయింది. గత నాలుగేళ్ళలో అమ్మినబాండ్లు, వాటిని కొన్నవారి వివరాలు ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్‌ అందించాలని కోర్టు ఆదేశిస్తే, ఈ తీర్పు వెలువడిన మూడువారాలకు మళ్ళీ కోర్టుముందుకు వచ్చి, జూన్‌ 30వరకూ గడువు పెంచాలని ఎస్‌బీఐ విన్నవించుకుంది. సార్వత్రక ఎన్నికల్లోగా బాండ్ల రహస్యాన్ని బట్టబయలు చేయాలని, సమస్త వివరాలను ప్రజలముందు ఉంచాలని సుప్రీంకోర్టు సంకల్పిస్తే, ఎన్నికలు ముగిసేవరకూ ఆ రహస్యాన్ని దాచాలని బ్యాంకు చూసింది. దీనిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు గడువు ఏ మాత్రం పొడిగించకుండా బ్యాంకును దారికి తేవడంతో, విధిలేక అది ఎన్నికల సంఘానికి సమాచారాన్ని అందించాల్సి వచ్చినప్పటికీ, కీలకమైన లింకులు లేకుండా చేసి, సర్వోన్నత న్యాయస్థానం తీర్పువెనుక స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నమైతే జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు, ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం దేనికదిగా ఉంటూ ఏ పార్టీకి ఏ దాత ఎంత ఇచ్చాడన్న వివరాలను జతచేయగలిగే అవకాశం లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. కంపెనీలకు, పార్టీలకు మధ్య బాండ్లతో ఏర్పడిన బంధం కానీ, క్విడ్‌ ప్రోకో కానీ ప్రజలకు తెలియకుండా పోతోంది. సుప్రీంకోర్టు ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని రద్దుచేయడానికి ప్రధాన కారణం ప్రతీదశలోనూ ఉన్న గోప్యతే. రాజకీయ పార్టీలకు గుప్తనిధులను సమకూర్చిపెట్టే ఈ విధానానికి కర్తగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోర్టు ఏమిచెప్పినా, ఎంత మొత్తుకున్నా ఆ బాంధవ్యం బట్టబయలు కాకూడదని అనుకుంటోంది. వివిధ పారిశ్రామికవేత్తల సంఘాలు సంస్థలు కూడా ఏవో కేసులు వేస్తూ, ప్రత్యేక అభ్యర్థనలు చేస్తూ కోర్టును ఇబ్బంది పెడుతున్నాయి. చివరకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూడా బరిలోకి దిగారు.

ఎన్నికల బాండ్లమీద కోర్టుకు ఎక్కి విజయం సాధించినవారు, ఆ వివరాలను వక్రీకరిస్తున్నారని, బాండ్ల లెక్కలను తారుమారు చేస్తున్నారని సోమవారం తుషార్‌ మెహతా కోర్టుకు ఫిర్యాదుచేశారు. కోర్టు తీర్పును అడ్డుపెట్టుకొని ఒక ఎజెండా ప్రకారం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నారనీ, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వాదన. ఎన్నికలబాండ్ల విధానాన్ని న్యాయస్థానం కొట్టివేయడం సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారపక్షానికి ఇబ్బంది కలిగించే విషయమే. అయితే, ఆ తీర్పుకంటే, దానిని అమలుచేసే క్రమంలో ఈ దేశ అతిపెద్ద బ్యాంకు వ్యవహరిస్తున్న తీరే ప్రభుత్వాన్ని మరింత అప్రదిష్టపాల్జేస్తున్నది. ఇప్పటికైనా ఆ బ్యాంకును స్వతంత్రంగా పనిచేసుకోనిస్తే పాలకులు తమ పరువు గురించి భయపడాల్సిన పని ఉండదు.

Updated Date - Mar 19 , 2024 | 02:31 AM