Share News

హర్యానా వ్యూహం

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:10 AM

అతిసమీపంలో సార్వత్రక ఎన్నికలు, ఆర్నెల్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా హర్యానా రాజకీయం అనూహ్య వేగంతో మారిపోయింది. రాష్ట్రశాఖ అధ్యక్షుడుగా...

హర్యానా వ్యూహం

అతిసమీపంలో సార్వత్రక ఎన్నికలు, ఆర్నెల్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా హర్యానా రాజకీయం అనూహ్య వేగంతో మారిపోయింది. రాష్ట్రశాఖ అధ్యక్షుడుగా ఉన్న నాయబ్‌సింగ్‌ సైనీ మంగళవారం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దేవీలాల్‌ మునిమనవడు దుష్యంత్‌చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్‌ జనతాపార్టీ (జేజేపీ)తో ఐదేళ్ళుగా సాగుతున్న పొత్తును తెంపేసుకుంటే తప్ప రాజకీయంగా మేలు జరగదని బీజేపీ అనుకుంది. అసెంబ్లీలో పదిమంది సభ్యులున్న ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని, ఆ లోటు భర్తీకోసం ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురి మద్దతు తెచ్చుకుంది. మిత్రపక్షాన్ని గెంటేసిన తరువాత కూడా మిగిలిన ఆర్నెల్ల కాలాన్ని నిక్షేపంగా నెట్టుకురాగలిగే సంఖ్యాబలం సాధించుకుంది కనుక, భాగస్వామి పార్టీ పోయినప్పటికీ, ముఖ్యమంత్రిగా ఖట్టర్‌ నిక్షేపంగా కొనసాగవచ్చు. కానీ, అదే పాతమంత్రులు కొందరు తిరిగి ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఖట్టర్‌ స్థానంలోకి సైనీరావడం వెనుక చాలా లెక్కలూ వ్యూహాలూ ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికల సీట్లపంపకాల్లో తేడాలు వచ్చి రెండుపార్టీలూ వేరుపడ్డాయట. 2019లో బీజేపీ పది లోక్‌సభస్థానాలు గెలుచుకుంటే, ఈ ఎన్నికలకు కాస్తంత ముందు చౌతాలా కుటుంబంలో వచ్చిన విభేదాలతో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ)నుంచి దుష్యంత్‌ వేరుపడ్డారు. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా ఆయన గెలవలేదు. సీట్ల పంపకాల వివాదం ఇంకా కొలిక్కిరాకముందే ఒక్కసీటు కూడా ఇవ్వబోమని బీజేపీ తేల్చేయడంతో, జాట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తనకు ఇంకా కొన్నింటిలో ఎంతోబలం ఉన్నదని నమ్ముతున్న దుష్యంత్‌ వేరుపడినట్టు కనిపిస్తోంది. హర్యానాలో జాట్లు 27శాతం వరకూ ఉంటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికశాతం బీజేపీ పక్షాన నిలబడ్డారు. మోదీమీద అభిమానంతోపాటు, పుల్వామా రగల్చిన దేశభక్తి వంటివి బలంగా పనిచేశాయి. కానీ, ఈ మారు రైతు ఆందో‌ళనలు, మహిళా మల్లయోధుల నిరసనలు, మద్దతు ధర ఉద్యమాలు సహా చాలా కారణాలతో అధికశాతం జాట్లు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఖట్టర్‌ మీద మరీ కోపంగా ఉన్నారని తేలిపోయింది. జాట్లు ఈ మారు కాంగ్రెస్‌ వైపు చూస్తున్న నేపథ్యంలో బీజేపీ–జేజేపీ కలిసి సాగితే ఇరువురికీ నష్టమే కనుక విడిపోయి బాగుపడాలని రెండు పార్టీలూ అనుకొని ఉంటాయి. కాంగ్రెస్‌, ఐఎన్‌ఎల్‌డి, జేజేపీ మధ్య జాట్ల ఓట్లు చీలిపోయిన పక్షంలో మిగతా అగ్రకులాల, ఓబీసీల ఓట్లతో తాను లబ్ధిపొందవచ్చునని, ఓబీసీల ఓట్లు సంపాదించడానికి కొత్తముఖ్యమంత్రి ఉపకరిస్తారని బీజేపీ భావించి గత అక్టోబర్‌లో రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమితుడైన వ్యక్తిని ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది. రాహుల్‌గాంధీ హామీ ఇస్తున్న కులగణన ఓబీసీలను ప్రభావితం చేస్తున్నందున, దానికి విరుగుడుగా సైనీని బీజేపీ ముందుకు తెచ్చి ఉండవచ్చు. నాయబ్‌సింగ్‌ వచ్చినంతమాత్రాన ఓబీసీలంతా బీజేపీకి ఓట్లువేయరన్న విమర్శలను అటుంచితే, హర్యానాలో సైనీలు 8శాతం వరకూ ఉన్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ మాదిరిగా ఈయన కూడా యూపీ, బిహార్‌ సహా చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో ఓబీసీలను ఆకర్షించేందుకు బీజేపీకి ఉపకరించవచ్చు.

ఖట్టర్‌ ప్రభుత్వం మీద ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో ఈ పరిణామాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్లముందే ఆయనను బీజేపీ అధిష్ఠానం పక్కకు తప్పించింది. కర్నాల్‌నుంచి లోక్‌సభకు పోటీచేయించి, అసెంబ్లీ ఎన్నికలబరిలో ఆయన లేకుండా జాగ్రత్తపడుతోంది. అప్రదిష్టపాలైన గత ప్రభుత్వం ఛాయలను పూర్తిగా చెరిపివేసి, కొత్తమొఖాన్ని ముందుపెట్టి విజయం సాధించాలని అనుకుంటోంది. బీజేపీ–జేజేపీ మధ్య సీట్ల ఒప్పందం కొలిక్కివచ్చిందని, విపక్షాల ఓట్లను చీల్చి తిరిగి తాము అధికారంలోకి వచ్చేందుకు అది ఉపకరిస్తుందని కొద్దిరోజుల క్రితమే ఖట్టర్‌ ప్రకటించారు. ఇప్పుడు ఆయనే బరిలో లేకుండాపోయారు. కొందరు ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్‌ ఇవ్వకుండా ప్రజావ్యతిరేకతను చల్లార్చేందుకు అధికారపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హర్యానాలో ముఖ్యమంత్రినే మార్చివేయడం బీజేపీ తన ఓటమిని అంగీకరించడమేనని కాంగ్రెస్‌ అంటోంది.

Updated Date - Mar 13 , 2024 | 05:10 AM