Share News

హైకోర్టు హెచ్చరిక

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:43 AM

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముంచుకువస్తున్న నీటి ఎద్దడి ముప్పును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గుర్తించి అధికార యంత్రాంగాన్ని....

హైకోర్టు హెచ్చరిక

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముంచుకువస్తున్న నీటి ఎద్దడి ముప్పును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గుర్తించి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడం సకాలంలో వెలువడిన మేలుకొలుపు. పోయిన వర్షాకాలంలో తగినంత వర్షపాతం లేనందువల్ల, ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయన్న సూచనల వల్ల, రానున్న రోజులలో మంచినీటి ఎద్దడి, విద్యుచ్ఛక్తి కొరత కూడా తెలంగాణను బాధించవచ్చునని భావిస్తున్నారు. జలసంరక్షణ చర్యలు తీసుకోవాలని, ఇంకుడుగుంతలు లేని నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలని, తెలంగాణ జల, భూ, వృక్ష చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలని హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు దీర్ఘకాలికంగా దుర్భిక్ష పరిస్థితులను, తాగునీటి ఎద్దడిని నివారించడానికి అనుసరించవలసినవి. సామాజిక బాధ్యతను నెరవేర్చని నిర్మాణ సంస్థలను, పౌరులను ఈ కొరతల సమయంలో అయినా మందలించడం అవసరం.

వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపుగా దుర్భిక్షమనదగ్గ పరిస్థితి నెలకొన్నదని, అందువల్ల తీవ్రమైన నీటి ఎద్డడి ఎదురుకానున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల రైతులు వ్యవసాయ అవసరాల కోసం రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నా, సానుకూలంగా స్పందించగలిగే పరిస్థితులు లేవు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో పోయిన ఏడాది ఇదే సమయంలో సుమారు 200 టిఎంసిల నీరు విడుదలకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 140 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో పోయిన సంవత్సరం ఇదే సమయంలో 42 టిఎంసిలు విడుదలకు వీలుగా ఉండగా, ఇప్పుడు కేవలం 36 టిఎంసిలు మాత్రమే అందుబాటులో ఉంది. శ్రీశైలం నీటి విడుదల విద్యుత్ అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన జల అవసరాలను తీర్చవలసి వచ్చే ఆ రెండు రిజర్వాయర్ల నీటిని ఆచితూచి వినియోగించుకోవలసి ఉంది. జంటనగరాలకు మంచినీరు అందించే ఐదు ప్రధాన రిజర్వాయర్లలో నీటి అందుబాటు పోయిన సంవత్సరం కంటె రెండు టిఎంసిలు తక్కువగా ఉంది. ఇంకా తీవ్రమైన ఎండాకాలం ముందే ఉన్నది. నీటి అవసరాలు, ఉష్ణోగ్రతలు కలిసి చెరువులు త్వరత్వరగా ఖాళీ అవుతాయి. మార్చి మొదటి వారంలో ఒకరోజు 30 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని ఉత్తర, దక్షిణ తెలంగాణ డి‍స్కమ్‌లు నమోదు చేశాయి. బోర్ల వినియోగం, గృహ విద్యుత్ వినియోగం పెరిగిపోతున్నాయి. తగినంతగా విద్యుత్‌ను సమీకరించి, అవసరాలను తీర్చవచ్చును కానీ, నిర్వహణాక్రమంలో అయినా కొన్ని సరఫరా అంతరాయాలు లేకుండా ఉండవు. జలసంరక్షణలో దీర్ఘకాలికమైన అలక్ష్యానికి తోడు, ఇటీవలి వర్షాభావపరిస్థితులను రాజకీయాలకు ఆపాదించడం వాంఛనీయం కాదు. తాము అధికారంలో ఉంటే పరిస్థితి ఇట్లా ఉండేది కాదని ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించడం సరికాదు. చేయగలిగినంత చేస్తామని, కొద్దిపాటి అసౌకర్యాలను రైతాంగం, నగరపౌరులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది.

ఎన్నికల సీజన్‌లో నీటికి కరెంటుకు కొరతలు కోతలు ఎదురుకావడం ప్రభుత్వాలకు పెద్ద పరీక్ష. బెంగుళూరు మహానగరంలో నీటి కటకట వల్ల ఐటి పరిశ్రమ ఆఫీసులు మూతబడే పరిస్థితి నెలకొన్నది. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి కొంత మెరుగే కానీ, అక్కడా ఎంతో కాలం ఉదారంగా నీటివినియోగం కుదరదు. కర్ణాటకలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ నీటి ఎద్దడికి ముడిపెట్టి చూడడం సహజం. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఎలాగైనా కొరతలు తగ్గించాలని ప్రయత్నం చేయడమూ సహజం. రాజకీయమైన పోటీలో, ఉద్వేగపూరితమైన ప్రకటనలు కూడా వింటుంటాము. తమిళనాడుకు కావేరి నీరు ఒక్కచుక్క కూడా ఇచ్చేది లేదని కర్ణాటక నేతలు చేస్తున్న ప్రకటనలు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే. నిజానికి హైదరాబాద్‌లో లాగానే బాధ్యతారహితమైన పట్టణీకరణ, పర్యావరణ విలువలను ఖాతరు చేయని నిర్మాణాలు బెంగుళూరు పరిస్థితికి కూడా కారణాలు. దీర్ఘకాలికంగా బెంగుళూరు చూపిన నిర్లక్ష్యమే దాని ప్రస్తుత దుస్థితికి కారణమని తెలంగాణ హైకోర్టు భావించడం అందుకే.

పరిపాలనలో కానీ, విధాన నిర్ణయాలలో కానీ తాత్కాలిక వాదం పనికిరాదు. సుస్థిరమైన అభివృద్ధి విధానాలు, సమర్థవంతమైన వినియోగం ఉండేవిధంగా వివిధ వనరుల వాడకం, దీర్ఘకాలిక ప్రభావాల గురించిన అవగాహన ప్రభుత్వాలకు అవసరం. వరదలు, కరువులు వచ్చినప్పుడు మాత్రమే గుండెలు బాదుకుంటే ఉపయోగం లేదు. ప్రతి వర్షాకాలం మహానగరాలలో నివాసప్రాంతాలు మునిగిపోతున్నాయి. ప్రతి దుర్భిక్ష సందర్భంలోనూ నోళ్లు చేలూ ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. జవాబుదారీతనం లేని పట్టణీకరణను నియంత్రించాలి. అధికంగా నీరు, విద్యుత్ అవసరమయ్యే పంటలను నిరుత్సాహపరచాలి. రైతులైనా, వ్యాపారులైనా, సాధారణ పౌరులైనా తమ తమ బాధ్యతను తెలుసుకుని నేలను, నీటిని, అన్ని ప్రకృతి వనరులను సంరక్షించాలి.

Updated Date - Mar 15 , 2024 | 12:43 AM