Share News

నిర్దోషి సాయిబాబా

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:13 AM

ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్, కవి, రచయిత జి.ఎన్. సాయిబాబా గురువారం ఉదయం నాగపూర్ జైలు నుంచి విడుదలైనప్పుడు, ఆయన అభిమానులలో, మిత్రులలో, ఉద్యమసహచరులలో...

నిర్దోషి సాయిబాబా

ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్, కవి, రచయిత జి.ఎన్. సాయిబాబా గురువారం ఉదయం నాగపూర్ జైలు నుంచి విడుదలైనప్పుడు, ఆయన అభిమానులలో, మిత్రులలో, ఉద్యమసహచరులలో రెండురోజులుగా భయకలవరాలతో సాగుతున్న నిరీక్షణ ముగిసినట్టయింది. నిజానికి గత మంగళవారం నాడు మహారాష్ట్ర హైకోర్టు నాగపూర్ బెంచి సాయిబాబాను, ఆయనతో పాటు మరో అయిదుగురిని నిర్దోషులుగా ప్రకటించినప్పుడే, నిర్బంధితుల ఆత్మీయులతో పాటు, దేశవ్యాప్తంగా వారి విడుదల కోసం ఉద్యమించిన ప్రజాస్వామిక వాదులంతా పెద్ద ఊరట పొంది ఉండాలి. కానీ, ఆ సంతోషం వెనుక ఒక భయం కత్తిలాగా వేలాడింది. 2022 అక్టోబర్‌లో జరిగినట్టు మళ్లీ జరుగుతుందా? ఈసారి కూడా విడుదలకు సుప్రీంకోర్టు చక్రం అడ్డు వేస్తుందా? అన్న ప్రశ్నలు ఉపశమనాన్ని ఉద్రిక్తతతో నింపివేశాయి.

నిందితుడు పైకోర్టుకు అపీలు చేసుకున్నప్పుడు, విచారణ పూర్తయ్యేదాకా కిందికోర్టు శిక్ష అమలును నిలిపివేయడం సాధారణంగా జరిగే పని. కేసు కొట్టివేసినప్పుడు ప్రాసిక్యూషన్ కూడా అపీలుకు వెళ్లవచ్చు కానీ, నిర్దోషిత్వ ప్రకటనను నిలిపివేయడం ఆనవాయితీ కాదు. కానీ, ఏడాదిన్నర కిందట, ఇదే హైకోర్టు ప్రక్రియాపరమైన కారణాలతో ఇదే కేసును కొట్టివేసినప్పుడు, మహారాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అత్యున్నత న్యాయస్థానం అంతే వేగంతో తీర్పును నిలిపివేయడం జరిగాయి. ప్రమాదకరమైన అభియోగాలున్న కేసులో ప్రక్రియా కారణాలతో కేసును ఎట్లా కొట్టివేస్తారు అని సుప్రీంకోర్టు అప్పుడు ప్రశ్నించింది. సాంకేతిక అంశాల ఆధారంగా కాక, ఈ సారి కేసులోని అంశాల ఆధారంగానే తీర్పు వచ్చినప్పటికీ, మరేదో మెలిక ముందుకు వచ్చి, సుప్రీంకోర్టులో అపీలు విచారణ ముగిసేదాకా నిర్బంధంలోనే కొనసాగాలన్న ఆదేశం వస్తుందేమోనన్న అనుమానం, భయం అందరిలో ఏర్పడ్డాయి. పదేళ్ల పాటు నడిచిన కేసులో, సుమారు ఎనిమిదేండ్లకు పైగా జైలు జీవితం గడిపి, న్యాయం దక్కించుకున్న సాయిబాబా విడుదలైన సందర్భంలో దేశంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఈ రెండురోజుల ఉత్కంఠ ఒక గుర్తు. న్యాయస్థానం తీర్పు అమలు జరుగుతుందన్న నమ్మకం లేదు. ఏ తీర్పు తరువాతైనా ప్రభుత్వం తాను అనుకున్నది చేయగలదన్న భయం ఉన్నది. చట్టబద్ధపాలనపై పాలకులకు ఉండవలసిన విశ్వాసం ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన షరతు. ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ అస్వతంత్రంగా మారిపోయినప్పుడు, ఆ పరిపాలనకు నియంతృత్వమనో, ఫాసిజమనో ఏదో ఒక పేరుతో విమర్శలు రావడం సహజం.

సాయిబాబా ఆలోచనాపరుడు. తనదైన మంచీచెడ్డా విచక్షణ కలిగినవాడు. ఇప్పుడున్న సమాజం, పరిపాలన, విలువలు బాగాలేవని, వీటిని మార్చుకోవాలని తపించే వ్యక్తి. తన విద్యార్థులతో కూడా జ్ఞానాన్ని, వివేచనను పంచుకునేవాడు. ప్రశ్నలను ప్రోత్సహించేవాడు. అటువంటి వ్యక్తికి మావోయిస్టు సంబంధాలను ఆపాదించి, ఊపా చట్టం కింద తీవ్రమైన అభియోగాలను మోపి మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను నిందితుడిని చేసింది. రాష్ట్రప్రభుత్వం నిమిత్తమాత్రమే, తెరవెనుక నడిపించిందంతా కేంద్రప్రభుత్వమే. ప్రజాఉద్యమాలతో కలసి నడిచే మేధావులను అర్బన్ నక్సలైట్లని పిలుస్తూ, వారిమీద తీవ్రనిర్బంధాన్ని ప్రయోగించాలన్న జాతీయ విధానం ఆధారంగానే సాయిబాబా కేసు కానీ, ఆ తరువాత రూపొందించిన బీమాకోరేగావ్ కేసు గానీ నడిచాయి, నడుస్తున్నాయి. చక్రాల కుర్చీ ద్వారానే కదలగలిగిన 90 శాతం వికలాంగుడిగా సాయిబాబా శారీరక పరిస్థితి, ఆయనను అండాసెల్‌లో నిర్బంధించడానికి కానీ, జైలులో కనీస సదుపాయాల కల్పనకు నిరాకరించడానికి కానీ, సె‌షన్స్ న్యాయస్థానం తీర్పు అనంతర అపీళ్ల విచారణలో జాప్యంలో కానీ అడ్డు కాలేదు. ఈ క్రమంలో భారతదేశంలో మానవహక్కుల పరిస్థితికి సాయిబాబా ఒక అంతర్జాతీయ చిహ్నంగా మారిపోయారు. కేంద్రప్రభుత్వం కూడా స్వతంత్రంగా, హేతుబద్ధంగా ఆలోచించగలిగేవారందరికీ ఒక హెచ్చరికగా ఉండాలని సాయిబాబా కేసులో తీవ్రకాఠిన్యాన్ని ప్రదర్శించింది. బీమాకోరేగావ్ కేసులో స్టాన్‌స్వామి మరణించినట్టే, ఈ కేసులో కూడా పాండు నరోటే అనే నిందితుడు మరణించారు. మంగళవారం నాటి తీర్పుతో మరణానంతర నిర్దోషిత్వాన్ని పొందాడు.

ఈ తీర్పు మీద మహారాష్ట్ర ప్రభుత్వం అపీలుకువెళ్లింది, నిర్దోషిత్వ తీర్పు మీద స్టే ఇవ్వమని కూడా అడిగింది. కానీ మరోసారి బాహాటపు అన్యాయానికి ఆస్కారం లేకుండా ఏదో అడ్డుపడి, విడుదల జరిగింది. ‘స్టే’ సంగతి ఇంకా తెలియదు కానీ, అపీలు మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. నాగపూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వాల్మీకి మెనెజెస్, వినయ్ జోషి తమ తీర్పుకు ఇచ్చిన వివరణలను చూస్తే, సాయిబాబా మీద మోపిన అభియోగాలన్నీ తప్పుల తడక అని, మానవ, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, అనుమతులు ఏవీ సక్రమంగా లేవని అర్థమవుతుంది.

ప్రజల హక్కులను అనుమతించని పాలనల్లో, కర్కశమైన నిర్బంధ విధానాలు కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ప్రజలు తమ ప్రతిస్పందనలను సహనంతో, సాహసంతో, సృజనాత్మకతతో రూపొందించుకుంటారు. ప్రజాస్వామ్యం సామాన్య ప్రజలకే ఎక్కువ అవసరం.

Updated Date - Mar 08 , 2024 | 01:13 AM