Share News

హిమాచల్‌ చల్లబడినట్టేనా?

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:15 AM

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి, కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మనుసింఘ్వీ పరాజయానికి కారకులైన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలమీద హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌...

హిమాచల్‌ చల్లబడినట్టేనా?

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి, కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మనుసింఘ్వీ పరాజయానికి కారకులైన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలమీద హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ గురువారం అనర్హతవేటు వేశారు. రాష్ట్ర బడ్జెట్‌ ఓటింగులో విప్‌కు అనుగుణంగా వ్యవహరించని నేరంపై వారికి ఈ శిక్షపడింది. ఈ చర్యతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68నుంచి 62కు తగ్గింది, కాంగ్రెస్‌ బలం 34, ముగ్గురు స్వతంత్రులతో కలిపి బీజేపీ బలం 28అయింది. పతనం అంచుకు జారుకున్న హిమాచల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అనర్హత నిర్ణయం తరువాత ప్రస్తుతానికి ఓ పెద్ద గండంనుంచి బయటపడింది. స్పీకర్‌ స్థానంలో అస్మదీయులున్నప్పుడు అధికారపక్షాలకు ఎన్నెన్నో లాభాలుంటాయి మరి.

ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం అభిషేక్‌ మనుసింఘ్వీ ఓటమికి మాత్రమే పరిమితం కాలేదు. వారి చర్యతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖూ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సభలో మెజారిటీ కోల్పోయిందని, ఆయన సభావిశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిందేనని బీజేపీ డిమాండ్‌ చేసింది. కానీ, బుధవారం బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలో పదిహేనుమంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం, మర్నాడు ఈ ఆరుగురిమీదా ఆర్థికబిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటుచేయలేదన్న ఆరోపణతో అనర్హతవేటువేయడం ద్వారా కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకుంది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా జారీ చేసిన విప్‌ను ధిక్కరించినందుకు పార్టీ ఫిర్యాదుమేరకు స్పీకర్‌ వారిపై ఈ చర్య తీసుకున్నారు. ఈ ఆరుగురితోపాటు ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులను కూడా బీజేపీ తనవైపు తిప్పుకోవడంతో సభలో దాని బలం పాతికనుంచి 34కు పెరిగి, కాంగ్రెస్‌ సరిసమానమైపోయిన విషయం తెలిసిందే. ఓట్లను ఇలా సమానం చేసి, ఆ తరువాత లక్కీడ్రా ముందుకు తెచ్చి తన రాజ్యసభ అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌ను బీజేపీ గెలిపించుకుంది. అప్పటివరకూ 43మందితో నిక్షేపంగా ఉన్న కాంగ్రెస్‌ తన అభ్యర్థి ఓటమితో పాటు, ప్రభుత్వాన్నే కోల్పోయే ప్రమాదంలోకి జారుకుంది.

ప్రస్తుతానికి సమస్యనుంచి గట్టెక్కినా, ఉన్నవారిని నిలబెట్టుకుంటూ ఎవరూ జారిపోకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్‌ ఎంతకాలం నెట్టుకురాగలదన్నది అసలు ప్రశ్న. కర్ణాటక శివకుమార్‌, చత్తీస్‌గఢ్‌ భూపేష్‌భగల్‌, హర్యానా హూడా సహా చాలామంది కాంగ్రెస్‌ పెద్దలు, మేధావులు గురువారం శిమ్లాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో చర్చోపచర్చలు జరిపారు. సంక్షోభం సమసిపోయిందనీ, అంతా సవ్యంగా ఉన్నదని ప్రకటించారు. ముఖ్యమంత్రి సుఖూను మార్చాలన్న డిమాండ్‌ బలంగా ఉన్నా, ఆ పనిచేస్తే ఈసారి తిరుగుబాటు ఆయన వర్గంనుంచి వస్తుంది కనుక ప్రస్తుతానికి కొనసాగింపే శ్రేయస్కరమన్నది పర్యవేక్షకుల వ్యాఖ్యల సారాంశం. ఆరుసార్లు హిమాచల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీర్‌భద్రసింగ్‌ భార్య ప్రతిభాసింగ్‌ వర్గానికి, ముఖ్యమంత్రి సుఖూ వర్గానికి మధ్య నిరంతరపోరు పార్టీని ముంచుతోంది. మంత్రిగా ఉన్న ఆమె కుమారుడు సైతం ఇప్పుడు తన రాజీనామా విషయంలో రాజీపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ, నేను బాహుబలిని అని నిరూపించుకోవడానికి గురువారం ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అల్పాహారానికి పిలిస్తే 31మంది మాత్రమే వచ్చారట.

అసెంబ్లీలో ఎంత బలం ఉన్నా, కాంగ్రెస్‌ నిద్రమత్తులోనే ఉంటుంది, ఇటువంటి ప్రమాదాలు వచ్చిపడుతూనే ఉంటాయి అంటూ సీపీఎం పత్రిక గురువారం ఓ వ్యాఖ్య చేసింది. బీజేపీ అవినీతికరమైన చర్యలను తప్పుబడుతూనే, పార్టీలో అంతర్గతవైరుద్ధ్యాలను, లుకలుకలను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం విఫలమవుతున్నదని అది వ్యాఖ్యానించింది. హిమాచల్‌లో పరిస్థితులు సవ్యంగా లేనందునే సోనియాగాంధీని రాజస్థాన్‌నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ పంపిందని వార్తలు వచ్చాయి. అభిషేక్‌మను సింఘ్వీ పరాజయం, ప్రభుత్వం పతనమయ్యే ప్రమాదం, ఒక మంత్రి రాజీనామా వంటి తీవ్ర పరిణామాలతో కానీ కాంగ్రెస్‌ అధినాయకత్వం సంక్షోభనివారణకు దిగకపోవడం విచిత్రం. పార్టీలో అంతర్గత పోరు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు బీజేపీ పరం కావడానికి ఉపకరించింది. ఇప్పుడు ఉత్తరభారతంలో హిమాచల్‌ మాత్రమే కాంగ్రెస్‌ చేతిలో మిగిలింది. 2022లో బీజేపీని ఓడించి మంచి ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ పదిహేనునెలల్లోనే ప్రజలు అప్పగించిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలూ పడుతోంది.

Updated Date - Mar 01 , 2024 | 05:15 AM