Share News

లద్దాఖ్‌ బతుకుపోరు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:49 AM

లద్దాఖ్‌ ప్రాంతానికి రాష్ట్రహోదా కల్పించడం, దానిని రాజ్యాంగంలోని ఆరవషెడ్యూల్‌లో చేర్చడం ఇత్యాది డిమాండ్లతో ఇరవై ఒక్కరోజుల నిరాహారదీక్షకు దిగిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌...

లద్దాఖ్‌ బతుకుపోరు

లద్దాఖ్‌ ప్రాంతానికి రాష్ట్రహోదా కల్పించడం, దానిని రాజ్యాంగంలోని ఆరవషెడ్యూల్‌లో చేర్చడం ఇత్యాది డిమాండ్లతో ఇరవై ఒక్కరోజుల నిరాహారదీక్షకు దిగిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ మంగళవారం తన దీక్ష ముగించారు. మార్చి 6నుంచి అత్యంత కఠినమైన వాతావరణంలో కొనసాగిన ఆయన దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. దీక్షవిరమణ రోజున సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ తన పుట్టినరోజును దీక్షాస్థలిలోనే జరుపుకొని లద్దాఖ్‌ ప్రజల ఉద్యమానికి తన సంఘీభావం ప్రకటించారు. తాను దీక్షవిరమించినప్పటికీ లద్దాఖ్‌ ప్రజల హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటం ఆగదని ప్రకటించిన సోనమ్‌, ఒక వీడియోలో ప్రధాని, హోంమంత్రిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మైనస్‌ పదిడిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో తనతోపాటు 350మంది దీక్షలో కూచుంటే పాలకులు ఏ మాత్రం స్పందించపోవడంమీద ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మోదీ, అమిత్‌షాలు రాజకీయనాయకుల్లాగా కాక, రాజనీతిజ్ఞుల్లాగా వ్యవహరించాలని తామంతా కోరుకుంటున్నామని, అందుకు వారిద్దరూ కాస్తంత ఔన్నత్యాన్ని, దూరదృష్టిని ప్రదర్శించాలని వ్యాఖ్యానించాడు. ఆయన దీక్ష ముగిసినప్పటికీ, ఇప్పుడు లద్దాఖ్‌లోని మహిళాసంఘాలు అవే డిమాండ్లతో నిరాహారదీక్ష ఆరంభించాయి.

లద్దాఖ్‌ ప్రజల డిమాండ్ల మీద నెలలక్రితమే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించి, ఉద్యమకారులతోనూ, ప్రతినిధులతోనూ పలుమార్లు చర్చోపచర్చలు సాగించింది కేంద్రప్రభుత్వం. మార్చి 4వతేదీన తనను కలిసిన లద్దాఖ్‌ నాయకులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కఠినంగా మాట్లాడుతూ వారి డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని తేల్చేయడంతో సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఈ దీక్షకు పూనుకున్నట్టు వార్తలు వచ్చాయి. పర్యావరణ ఉద్యమకారుడు, సృజనాత్మక విద్యావేత్త, ఇంజనీర్‌ అయిన సోనమ్‌ జీవితం ఆధారంగానే హిందీచిత్రం ‘త్రీ ఇడియట్స్‌’ నిర్మితమైన విషయం తెలిసిందే. లద్దాఖ్‌ పర్యావరణం, గిరిజన సంస్కృతి పరిరక్షణల కోసం ఈ రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత పడుతున్న ఆవేదనను కానీ, భూమి, ఉపాధి ఇత్యాది విషయాల్లో స్థానికుల భయాందోళనలను కానీ పాలకులు లెక్కచేయడం లేదు.

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కుదించిన ఏడాదిలోనే లద్దాఖ్‌వాసులకు తమకు జరిగిన, జరగబోతున్న అన్యాయం అర్థమైంది. లద్దాఖ్‌ ప్రధానంగా బౌద్ధమతాన్ని ఆచరించే వివిధ ఆదివాసీ తెగల ప్రాంతం. రాష్ట్రంగా లేకపోవడం, ప్రత్యేకరక్షణలు తొలగిపోవడంతో భూమిపై వస్తున్న సంప్రదాయహక్కులకు హామీలేకుండా పోయింది. డెబ్బయ్యేళ్ళలో ఎన్నడూ లేనంత అభద్రతలోకి వారు జారిపోయారు. తమ సర్వహక్కులను, రక్షణలను ఆర్టికల్‌ 370 మింగేసిన నేపథ్యంలో, వాటిని తిరిగి సాధించడానికి పోరాటం తప్పదని వారు గ్రహించారు. వివిధ ప్రజాసంఘాలతో కూడిన లేహ్‌ అపెక్స్‌ బాడీ నాలుగేళ్ళుగా లద్దాఖ్‌ను ఆరోషెడ్యూల్‌ కింద చేర్చాలని పోరాటం చేస్తున్నది. లద్దాఖ్‌తో బలవంతంగా కలిపిన కార్గిల్‌ ప్రాంతవాసులు తమను తిరిగి కశ్మీర్‌తో కలపమని మరోపక్క ఉద్యమిస్తున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా, రాజ్యాంగంలోని ఆరోషెడ్యూల్‌లో చేర్చడం ద్వారా ఆదివాసీ తెగల స్థానిక స్వయంపాలనకు అవకాశం, స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రిజర్వుచేస్తూ ఒక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు ఇత్యాదివి వారి డిమాండ్లలో ప్రధానమైనవి.

లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఆరోషెడ్యూల్‌లో చేర్చడం స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణరీత్యా అవశ్యకమంటూ షెడ్యూల్‌ తెగల జాతీయ కమిషన్‌ నాలుగేళ్ళక్రితం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసిందని అంటారు. అయితే, కేంద్రప్రభుత్వం స్థానిక ప్రజల ఉద్యమాలకు స్పందిస్తున్నట్టు కనిపిస్తూనే వారి డిమాండ్లకు ఏమాత్రం లొంగదల్చుకోలేదని అర్థమవుతోంది. తమ వనరులు ఇతరులు దోచుకుంటారన్న లద్దాఖ్‌వాసుల భయం కూడా క్రమంగా నిజమవుతోంది. బయటివ్యక్తులు వారి భూములను కొనుగోలు చేయడం, అభివృద్ధి పేరిట సాగే విధ్వంసం కూడా ఆరంభమైంది. అస్మదీయ కార్పొరేట్‌ సంస్థలకు వేలాది ఎకరాల భూమిని అప్పగించడం మొదలైంది. ఆరవషెడ్యూల్‌లో చేర్చినపక్షంలో ఈ భారీ భూ సంతర్పణలు, వనరుల అప్పగింత సులభం కాదు కనుక, కేంద్రప్రభుత్వం ఆ ఊసు ఎత్తడం లేదు. చైనా, పాకిస్థాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న లద్దాఖ్‌ వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఎంతో కీలకమైనది. కశ్మీర్‌ ఉగ్రవాదం పతాకస్థాయిలో ఉన్నప్పుడు కూడా అది లద్దాఖ్‌ను తాకలేదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో లద్దాఖ్‌వాసులు భారతసైన్యానికి అందించిన సేవలు విలువకట్టలేనివి. గాల్వాన్‌ ఘటన, చైనా వరుస చొరబాట్లు లద్దాఖ్‌ విషయంలో మనం అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. గడ్డకట్టే చలిలో వేలాదిమంది చేస్తున్న ఆ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు.

Updated Date - Mar 27 , 2024 | 12:49 AM