Share News

రానురాను తీసికట్టు

ABN , Publish Date - Mar 05 , 2024 | 12:39 AM

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, తాము సాధించిన ఘనకార్యాలను, అందించబోయే స్వర్గాలను రాజకీయ పక్షాలు ప్రజల ముందు ఏకరువు పెడుతుంటాయి. గత ప్రభుత్వ హయాంలో తాము నిజంగా...

రానురాను తీసికట్టు

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, తాము సాధించిన ఘనకార్యాలను, అందించబోయే స్వర్గాలను రాజకీయ పక్షాలు ప్రజల ముందు ఏకరువు పెడుతుంటాయి. గత ప్రభుత్వ హయాంలో తాము నిజంగా పొందిందేమిటో, కోల్పోయిందేమిటో ఓటర్లు సమీక్షించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా భావోద్వేగాల సందడి చేస్తుంటారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, అధికమవుతున్న ఆర్థిక అంతరాలు, సామాజిక ఉద్రిక్తతలు, నియంతృత్వ ధోరణి, హక్కులు స్వేచ్ఛల కుదింపు, ఇటువంటి కీలక అంశాలపై చర్చ జరగవలసిన సమయం ఇది.

రానురాను భావ ప్రకటనా స్వేచ్ఛపై, ముఖ్యంగా మీడియా స్వాతంత్ర్యం మీద ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కేంద్రప్రభుత్వం నేరుగా, పరోక్షంగా విధిస్తున్న నిర్బంధ వాతావరణం వల్లనే అధికంగా ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం పత్రికా స్వేచ్ఛ సూచికలో మన దేశం స్థానం దారుణంగా పడిపోయింది. మొత్తం 180 దేశాల పరిశీలనలో భారత్ 161వ స్థానంలో ఉంది. అంతకు ముందు సంవత్సరం ఉన్న 150 స్థాయి నించి ఇంకా పడిపోయిందన్న మాట. ఇంకా సులువుగా అర్థం కావాలంటే, పాకిస్థాన్ కంటె, ఆఫ్ఘనిస్థాన్ కంటె, శ్రీలంక కంటె కూడా మనం దిగువన ఉన్నామన్నమాట. బాధ్యతలు, కర్తవ్యాలు మాత్రమే ఉండాలి తప్ప, హక్కుల స్మరణ అప్రధానం కావాలనుకుంటున్న అమృతకాలంలో రానురాను పరిస్థితి మరెంతగా దిగజారుతుందో చూడాలి.

‘కశ్మీర్ నరేటర్’ అనే మాస పత్రికకు సహాయ సంపాదకుడిగా, విలేఖరిగా పనిచేసే ఆసిఫ్ సుల్తాన్ అనే పాత్రికేయుడిని 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తున్నాడని ఆయన మీద అభియోగం. కానీ, అంతకు నెలరోజుల కిందట బుర్హాన్ వనీ అనే మిలిటెంట్ మీద రాసిన ముఖచిత్ర కథనమే సుల్తాన్ మీద అధికార యంత్రాంగానికి ఆగ్రహం తెప్పించిందని అందరికీ తెలుసు. అప్పటినుంచి, అతనికి బెయిలు లేదు. 2022లో ఒకసారి బెయిల్ వచ్చింది కానీ, వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. అతని మీద అభియోగాలకు ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చిన స్పెషల్ కోర్టు చెప్పగా, తాజాగా, గత డిసెంబర్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు అతని మీద కేసు కొట్టివేసి, నిర్బంధం అక్రమమని చెప్పింది. అయినా, ఫిబ్రవరి 27 దాకా విడుదల చేయలేదు. విడుదలై తన ఇంటికి వెళ్లిన సుల్తాన్‌ను మరో కేసు పేరిట తిరిగి 29వ తేదీన అరెస్టు చేశారు.

కశ్మీర్ వంటి చోట పాత్రికేయులు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులు తెలిసినవే. అయితే, తక్కినచోట్ల పరిస్థితులు ఏమీ మెరుగుగా లేవు. సుదీర్ఘ నిర్బంధాలు, కోర్టు తీర్పులను ఖాతరు చేయకపోవడం దేశమంతటా ఉంది. కేవలం వార్తాసేకరణకు వెళ్లిన పాపానికి సిద్ధిఖీ కప్పన్ మూడేళ్లు నిర్బంధంలో గడిపారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ‘న్యూస్ క్లిక్’ దాడులలో అరెస్ట్ అయిన ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థకు ఇంకా బెయిల్ దొరకలేదు. దాదాపు అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ‘దస్తక్’ పత్రిక సంపాదకురాలు సీమా ఆజాద్ మీద, మరికొందరి మీద జరిగిన ఎన్ఐఏ దాడులు తెలిసినవే. తాజాగా తెలంగాణలో ‘వీక్షణం’ పత్రిక సంపాదకుడి ఇంటిలో ఎన్ఐఎ సోదాలు జరిపింది. కొవిడ్ సామూహిక అంత్యక్రియల కాలంలో గంగానదిలో కళేబరాల ఫోటోలు తీసి ప్రచురించిన కోపంతోనే కాబోలు, పాతికేళ్ళుగా ఉంటూ, దేశంలోనే స్థిరపడిన ఫ్రెంచి పాత్రికేయురాలు వనెసా డౌనాక్‌ను బలవంతంగా వెనక్కు పంపించారు. దేశంలో వాస్తవికత కంటె, దాన్ని బయటకు చెప్పడమే పాలకులకు ఇబ్బందికరం అవుతోంది. తాజాగా జార్ఖండ్‌లో ఒక స్పానిష్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం సందర్భంగా వస్తున్న ట్వీట్ల నిరసనను జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు తప్పుపట్టారు. దేశాన్ని అప్రదిష్ఠపాలు చేసే విధంగా సోషల్ మీడియాలో ఎందుకు రాయాలని ఆమె ప్రశ్న. పాలకుల ఒడిలో కూర్చున్న మీడియా తప్ప, తక్కిన అన్నిటికి గడ్డుకాలమే కొనసాగుతోంది. మునుముందు, కొత్త నేరచట్టాలు, డిజిటల్ మీడియా చట్టాలు పాత్రికేయుల స్వేచ్ఛకు మరిన్ని సంకెళ్లు బిగించబోతున్నాయి కూడా.

అన్నిటి కంటె దురదృష్టకరం ఏమిటంటే, ఈ స్వేచ్ఛల గురించి గట్టిగా నిలదీయగలిగిన ప్రజాస్వామిక ఉద్యమమేదీ దేశంలో లేకపోవడం. గొంతువిప్పగలిగిన అతి కొద్ది మందిని దేశద్రోహులుగా, కమ్మీలుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రించే దుర్మార్గం కొనసాగుతున్నది. ప్రజాస్వామ్యానికి కాపలాదారులుగా ఉండే పాత్రికేయుల విశ్వసనీయతను, నైతిక స్థైర్యాన్ని దానదండోపాయాల ద్వారా దెబ్బతీస్తున్నప్పుడు, నష్టపోయేది కేవలం మీడియా మాత్రమే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, తాను తిరిగి అధికారంలోకి వస్తే మెరుగైన స్వేచ్ఛలను కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించాలి. ప్రతిపక్ష కూటమిగా రంగంలో ఉన్న పక్షాలు, తమ ప్రధాన ప్రచారాంశాలలో ప్రజాస్వామ్య పరిరక్షణను చేర్చుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న వాతావరణంలో, పత్రికాస్వేచ్ఛతో సహా ఏ స్వేచ్ఛలనయినా పునరుద్ధరిస్తామని చెప్పడం ఏ పక్షానికయినా రాజకీయంగా ప్రమాదకరమే. కానీ, నష్టాలకు సిద్ధపడి అయినా ముందుకు అడుగువేసేవారే ఫలితాలను కూడా సాధిస్తారు.

అనేక రకాల మాధ్యమాలలో పనిచేస్తున్న పాత్రికేయులు, వారి వృత్తి సంఘాలు పత్రికాస్వేచ్ఛను అణచిపెడుతున్న ధోరణులను గట్టిగా వ్యతిరేకించాలి. ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేయగలిగే రంగమే భయానికో, భక్తికో మౌనంగా ఉండిపోతే, ప్రజాస్వామ్యానికి ఏది రక్షణ?

Updated Date - Mar 05 , 2024 | 12:39 AM