Share News

యుద్ధం ఆగాలి!

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:25 AM

గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండ మొదలైన ఐదున్నర నెలలకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అక్కడ తక్షణకాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ తొలిసారిగా తీర్మానాన్ని ఆమోదించింది...

యుద్ధం ఆగాలి!

గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండ మొదలైన ఐదున్నర నెలలకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అక్కడ తక్షణకాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ తొలిసారిగా తీర్మానాన్ని ఆమోదించింది. భద్రతామండలిలో ప్రతీ తీర్మానాన్ని వీటో చేస్తూ ఇజ్రాయెల్‌ను రక్షించుకొస్తున్న అమెరికా మొన్న సోమవారం ఈ తీర్మానం సందర్భంగా ఓటింగ్‌కు దూరమై దానిని నెగ్గనిచ్చింది. రమ్‌జాన్‌ మాసాన్ని పురస్కరించుకొని తక్షణమే కాల్పులను విరమించాలని, తన వద్ద ఉన్న బందీలను హమాస్‌ విడిచిపెట్టాలని, ఒక దీర్ఘకాలిక, సుస్థిర కాల్పులవిరమణకు వీలుకల్పించే వాతావరణం ఏర్పడాలని ఈ తీర్మానం కోరింది. అల్జీరియా నేతృత్వంలో స్విట్జర్లాండ్‌ వంటి కొన్ని దేశాల సమష్టికృషితో రూపొందిన ఈ తీర్మానానికి అమెరికా అడ్డుతగలకపోవడం ఒక విశేషమైతే, బ్రిటన్‌ సైతం ఈ మారు భిన్నంగా వ్యవహరించి, తీర్మానానికి అనుకూలంగా ఓటువేయడం మరో వింత.

ముప్పైరెండువేలమంది మరణించి, డెబ్బయ్‌ఐదువేలకుపైగా గాయపడి, గాజా పూర్తిగా నేలమట్టమై, 90శాతం ప్రజలు వలసపోయిన తరువాత, పవిత్రమాసంలోనైనా కాల్పులు కాస్తంత ఆపండంటూ ఈ తీర్మానం ముందుకు వచ్చింది. అడ్డుపడకుండా దానిని నెగ్గనిచ్చినందుకు అమెరికా మీద ఇజ్రాయెల్‌కు ఎంతో కోపం వచ్చింది. సీనియర్‌ మంత్రులతో కూడిన బృందంతో అమెరికా వెడదామకున్న నెతన్యాహూ ఇందుకు నిరనసగా తన పర్యటన రద్దుచేసుకున్నారు. ఈ తీర్మానానికి నాలుగురోజుల ముందు అమెరికా స్వయంగా కాల్పుల విరమణను ప్రతిపాదిస్తూ భద్రతామండలిలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, అందులో అమెరికా వాడిన భాష ప్రపంచాన్ని తప్పుదోవపట్టించేట్టుగా ఉందంటూ రష్యా, చైనాలు దానిని వీటో చేశాయి. గాజాయుద్ధం విషయంలో అమెరికా ఆత్మరక్షణలో పడిందని ఈ పరిణామాలు తెలియచెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, గాజా తరహాలోనే మరో భయానకమైన ఊచకోతకు ఇజ్రాయెల్‌ సిద్ధపడుతూండటం. దాదాపు 15లక్షలమంది పాలస్తీనియన్లు కొంతలోకొంత సురక్షితంగా ఉంటున్న రఫా పట్టణంలోకి ఇజ్రాయెల్‌ సైన్యం చొరబడబోతున్నట్టు నెతన్యాహూ సహా ఆయన మంత్రులంతా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. గాజా యుద్ధం లక్ష్యం నెరవేరాలంటే తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం పరిపూర్ణంగా జరగాలని, రఫా నగరాన్ని జల్లెడపట్టినప్పుడు మాత్రమే ఆ ప్రక్షాళన పూర్తవుతుందని ఇజ్రాయెల్‌ నాయకులు వాదన. ఇందుకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రఫాలో కాలూనితే అమెరికా సాయం ఆగిపోతుందన్న తరహాలో హెచ్చరికలు చేయడమూ చూశాం. కానీ, ఆ హెచ్చరికలనూ, సలహాలనూ బేఖాతరుచేస్తూ నెతన్యాహూ తాను అనుకున్నది చేసుకుపోతున్నారు. అనతికాలంలోనే రఫా నేలమట్టం కాబోతున్నదని అక్కడ సాగుతున్న వైమానికదాడులు స్పష్టంచేస్తున్నాయి. సైన్యం ప్రత్యక్షంగా నగరంలోకి అడుగుపెడితే ఆ విధ్వంసం ఇక ఊహకు కూడా అందనంతగా ఉంటుంది. రఫా నగరాన్ని దురాక్రమించుకొనే ఆలోచనలో బెంజమీన్‌ ఉన్నారని అందరికీ తెలుసు.

ఈ నేపథ్యంలోనే, భద్రతామండలిలో తక్షణ కాల్పుల విరమణ తీర్మానాన్ని నెగ్గనిచ్చి, నెతన్యాహూ భవిష్యత్తు చర్యలతో తనకు ఏ సంబంధం లేదని అమెరికా ప్రపంచాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. తాను ఎంతగా ప్రయత్నిస్తున్నా నెతన్యాహూ ఆగడం లేదని చెప్పుకోవడం అమెరికా ఉద్దేశం కావచ్చు. భద్రతామండలి ఈ తీర్మానాన్ని ఆమోదించిన ఇరవైనాలుగు గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్‌ రక్షణమంత్రులు భేటీ అయి, రఫాలో ఇజ్రాయెల్‌ ఎంత జాగ్రత్తగా అడుగులువేయాలో, తీవ్రవాదులను మాత్రమే చంపుతూ, సామాన్యులమీద ఈగవాలనీయకుండా ఎలా వ్యవహరించాలో చర్చించారట. ప్రజల ప్రాణాలు, మానవతాసాయం అంటూ అమెరికా రక్షణమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ, హమాస్‌ ఉగ్రవాదుల అంతమే తమపంతమనీ, అందుకు ఎంతదూరమైనా వెడతామంటూ ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలు పరిస్థితిలో ఏ మార్పూ రాలేదనడానికి నిదర్శనం. రఫాలో ఇజ్రాయెల్‌ చొరబాటును ఆపే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రం లేదు. రేపు అది ఆ పట్టణాన్ని భస్మీపటలం చేస్తున్నా, ప్రజలను ఊచకోత కోస్తున్నా అమెరికా హితవులు చెబుతూంటుంది, ఆగ్రహాలు ప్రకటిస్తుంది తప్ప దానిని నిలువరించదు. గాజా దృశ్యాలను ప్రపంచమంతా చూస్తోంది, యుద్ధాన్ని ముగించాలి అని ట్రంప్ కూడా ఓ పక్కన సణుగుతూ ఉంటారు. ఇజ్రాయెల్‌కు తమ పాలకులు హద్దూపద్దూలేని సాయం అందిస్తూండటం మీద అధికశాతం అమెరికన్లు గుర్రుగా ఉన్నారని కూడా సర్వేలు చెబుతున్నాయి. అమెరికాకు చిత్తశుద్ధి గనుక ఉంటే, భద్రతామండలి తీర్మానాన్ని ఆచరణలోకి తెచ్చేవిధంగా ఇజ్రాయెల్‌మీద ఒత్తిడి తేవాలి.

Updated Date - Mar 28 , 2024 | 01:25 AM