Share News

బ్యాంకు విప్పని గుట్టు

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:20 AM

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో గుప్తనిధులను సమకూర్చిపెట్టే విధానానికి ఏకైక వ్యవహర్తగా, కర్తగా ఉన్న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం సుప్రీంకోర్టుకు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఎన్నికల బాండ్లు...

బ్యాంకు విప్పని గుట్టు

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో గుప్తనిధులను సమకూర్చిపెట్టే విధానానికి ఏకైక వ్యవహర్తగా, కర్తగా ఉన్న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం సుప్రీంకోర్టుకు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగవ్యతిరేకం అంటూ ఫిబ్రవరి 14న ఆ విధానాన్ని కొట్టివేసి, వాటి అమ్మకాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు, గత నాలుగేళ్ళలో అమ్మినబాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్‌ అందించాలనీ, ఈసీ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గతపరచాలనీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన మూడు వారాలకు, గడువుకు కేవలం రెండు రోజుల ముందు, ఈ ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైనదనీ జూన్‌ 30 వరకూ గడువు పెంచాలనీ సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ విన్నవించుకుంది. సార్వత్రక ఎన్నికల్లోగా ఈ బాండ్ల సంగతి తేల్చి, గోప్యతను ఛేదించి, సమస్త వివరాలను ప్రజలకు అందించాలని సుప్రీంకోర్టు సంకల్పిస్తే, ఎస్‌బీఐ ఇప్పుడు ఆ సదాశయాన్ని వమ్ముచేయడానికి ప్రయత్నిస్తున్నది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని అంటూనే ఎన్నికలు ముగిసేవరకూ రహస్యాన్ని దాచాలనుకుంటోంది.

సుప్రీం తీర్పును వమ్ముచేయకండి, అడ్డదారులు తొక్కకండి అని విపక్షపార్టీ నేతలతో సహా న్యాయకోవిదులు, మేధావులు అప్పట్లోనే ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మోదీ ప్రభుత్వం ఆర్డినెన్సుతో తీర్పును వమ్ముచేయవచ్చునని కొందరు అనుమానించారు. ఇప్పుడు బ్యాంకును అడ్డుపెట్టుకొని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరదీసిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రోజూ లక్షలాది లావాదేవీలు నిర్వహించే భారతదేశపు అతిపెద్ద బ్యాంకుకు 22వేల ఎన్నికల బాండ్ల వివరాలను కోర్టుకు ఇవ్వడానికి నిజంగానే నాలుగున్నర నెలలు అవసరమా? దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చేసిన తరువాత కూడా ఈ కాస్తంత సమాచారానికే నెలలకొద్దీ సమయం అడుగుతూ ఎస్‌బీఐ డైరెక్టర్లు ప్రధానిని అవమానిస్తున్నారని, వారిని శిక్షించాలని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలో కాస్తంత వెటకారం ఉన్నా, సరైనదే. ఎన్నికల బాండ్ల విధానంలోనే తీవ్రమైన సంక్లిష్టత, గోప్యత, దాతలు వివరాలు దాచడం అంతర్లీనమైన విలువలు కనుక, బ్యాంకు తదనుగుణంగానే వాటిని కంప్యూటర్‌లో దాచకుండా, పాలకులకు ప్రీతిపాత్రమైన సీల్డ్‌ కవర్‌ మార్గాన్నే అనుసరించింది. బాండు కొన్నవారి వివరాలు ఒక సీల్డు కవరులో, రాజకీయపార్టీలు నగదుగా మార్చుకుంటున్న సందర్భంలో ఆ వ్యవహారం వివరాలు మరో సీల్డుకవర్‌లో వేర్వేరుగా ఉంచి, వాటిని ఒకదానితో ఒకటి సరిపోల్చి అతుకువేయడానికి తనకు మరింత సమయం కావాలని అడుగుతోంది. బాండ్ల సంఖ్య వంటి అతికొన్ని వివరాలు డిజిటల్‌ రూపంలో, కొనుగోలుదారు పేరు, కెవైసీ ఇత్యాది కీలకమైన వివరాలు ఫిజికల్‌గా రికార్డు అయివున్నందున పనిచక్కబెట్టడం సులభం కాదని అంటోంది. దశాబ్దాల క్రితమే బ్యాంకులు రాతకోతలు వదిలేసి, కంప్యూటర్ల వాడకం ఆరంభిస్తే, డిజిటల్‌ లావాదేవీల్లో అగ్రస్థానంలో ఉన్న ఓ అతిపెద్ద బ్యాంకు ఎన్నికల బాండ్ల లావాదేవీలకు మాత్రం కాగితాలనే వాడటం ఆశ్చర్యం. దేశంలో ఒకచోట ఒక కార్పొరేట్‌ కంపెనీ ఈ బాండ్లు కొంటే, రాజకీయ పార్టీలు వేరొకచోట నగదుగా మార్చుకుంటే, వాటిని అమ్మిన, స్వీకరించిన బ్రాంచ్‌లన్నీ ఆ వివరాలన్నీ కాగితాలమీద రాయడం, సీల్డు కవర్లలో దాచడం విచిత్రమైన విన్యాసం. తద్వారా, ఒక దాత పదికోట్ల రూపాయల బాండ్లు కొంటే, అతడి చేతికి కోటి విలువైన బాండ్లు పది ఇస్తే పది కవర్లు తయారవుతాయి. వాటిని వేర్వేరు బ్రాంచ్‌లలో వేర్వేరు పార్టీలు నగదుగా మార్చుకున్నప్పుడు మరిన్ని సీల్డు కవర్లు తయారవుతాయి. నాలుగేళ్ళలో అమ్మిన బాండ్ల సంఖ్య 22వేలు కావచ్చుకానీ, కంప్యూటర్‌లను వాడకుండా, సీల్డు కవర్లను మాత్రం అధికంగా తయారుచేసి బ్యాంకు పాలకుల ఆశయాన్ని చక్కగా నెరవేర్చింది.

ఇక, దేశవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లలో బాండ్ల లావాదేవీలు ఎన్ని జరిగినా, సీల్డు కవర్లన్నీ ముంబైలోని ప్రధాన కార్యాలయానికే చేరినందున వాటిని సరిపోల్చడానికీ, జతచేయడానికీ నిజంగానే అన్ని నెలలు పడుతుందా? దాతల, స్వీకర్తల వివరాలను గుదిగుచ్చి, రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూండమని 2019లోనే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో, బ్యాంకు ఆ ఆదేశాలను ఉల్లంఘించి అయినా ఉండాలి, ఇప్పుడు కోర్టుకు అబద్ధమైనా చెప్పివుండాలి. బ్యాంకు అభ్యర్థన వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం ఉన్నదా లేదా అన్నది అనవసరం. కానీ, తన ఆదేశాన్ని బేఖాతరుచేసి, సదాశయాన్ని వమ్ము చేయడానికి ప్రయత్నిస్తున్న బ్యాంకును ఓ నాలుగు చీవాట్లు పెట్టి, చివరకు దాని ఒత్తిడికే లొంగిపోవడం కాక, సుప్రీంకోర్టు తీవ్రంగా, భిన్నంగా వ్యవహరించడం అవసరం.

Updated Date - Mar 06 , 2024 | 01:20 AM