Share News

మనుగడకే గురిపెడుతున్న మానసిక యుద్ధం

ABN , Publish Date - Mar 07 , 2024 | 02:10 AM

ఊదరగొట్టుట అనే ప్రాపగాండాకు అనుబంధ ఫలితాలు అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. జనంలో భయభక్తులను పెంచుకోవడానికి నాయకుడు ఇంద్రుడు చంద్రుడు వీరుడు శూరుడు అని ప్రచారం చేస్తారు...

మనుగడకే గురిపెడుతున్న మానసిక యుద్ధం

ఊదరగొట్టుట అనే ప్రాపగాండాకు అనుబంధ ఫలితాలు అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. జనంలో భయభక్తులను పెంచుకోవడానికి నాయకుడు ఇంద్రుడు చంద్రుడు వీరుడు శూరుడు అని ప్రచారం చేస్తారు. అట్లా చేయగా చేయగా, నిజమే కాబోలు అని ప్రతినాయకుడు అనుకుంటాడు, అంతేకాదు, నిజంగా తాను అరివీర భయంకరుణ్ణేమో అని ప్రచార నాయకుడు కూడా నమ్మడం మొదలుపెడతాడు. ఇతరుల మీద కమ్మే మాయపొర ఎంతో కొంత తమని కూడా మత్తులో ముంచుతుంది.

నరేంద్రమోదీ, ఆయన పార్టీ వారు సామాన్యులు కాదు. ఉత్సాహం, వ్యూహం, ముందుజాగ్రత్త అన్నీ తగుపాళ్లలో ఉన్న మేధాబృందం వారికి ఉన్నది. తమ లక్ష్యసాధన గురించి జాగరూకత ఎంత ఉన్నప్పటికీ, రేపు కూడా తమదే అధికారం, పరమాధికారం అన్న బేఖాతరుదర్పం కూడా వారిలో తరచు పొడుచుకు వస్తోంది. పొగరుగా కనిపించే ఆ ధీమా కూడా వారి చేతిలో ఒక రాజకీయ పాచికే!

మొన్న ఆదివారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సాధారణ ఎన్నికలకు ముందు అదే చివరి సమావేశం. మంత్రులు ఎన్నికల ప్రచారాల్లో ఎట్లా ఉండాలి, ఏమేమి జనాలకు చెప్పాలి వంటి సుద్దులు ప్రధానమంత్రి తన సహచరులకు చెప్పారు. అది సరే. మరోసారి అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల కాలంలో ఏమి చేయాలో మోదీ చర్చించారట. తన ప్రభుత్వమే వస్తుందని, తాను ప్రధాని అవుతానని అనుకోవడం ఓకే. సంభావ్యత అధికంగా ఉన్న విషయం అది. కానీ, ఈ మంత్రివర్గమే ఉండకపోవచ్చు కదా? అయినా, ప్రస్తుతం ఇంత హడావిడి నడుస్తుండగా, నూతన ప్రభుత్వమూ నూరురోజులూ అన్న మేధోమథన కార్యక్రమం ఎందుకు? వికసిత భారతాన్ని సాధించాలనే లక్ష్యం ప్రధానమంత్రిని ఆత్రుత పెడుతోంది అనుకుందాం, అందుకు సమయం సందర్భం చూసుకోనక్కరలేదా? నిజంగా, ఆ అంశం గురించి చర్చించడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. అట్లా చర్చించినట్టు బయటకు చెప్పుకోవడంలోనే అసలు కిటుకు ఉన్నది. విశ్వసనీయవర్గాల ద్వారా బయటకు పొక్కిన ఆ రహస్యం ద్వారా ప్రతిపక్షాలు ఏమి అనుకోవాలంటే, మోదీ గారు గెలవడమే కాదు, మరో హయాం పాలన కూడా ఆరంభించారు, భవిష్యత్తు వర్తమానంలోకి చొచ్చుకు వచ్చేసింది, అని. ఇక ప్రజలు ఏమి అనుకోవాలంటే, చూశారా, మోదీ ఎప్పుడూ దేశ వికాసం కోసమే ఆలోచిస్తారు, ఆయన ప్రత్యర్థులే రాజకీయాలు చేస్తున్నారు, అని.

ప్రతిపక్షాల మీద మానసికయుద్ధంలో మోదీ బ్రహ్మాస్త్ర ప్రయోగం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే మొదలయింది. సాధారణంగా, ఇటువంటి బడ్జెట్‌లు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందుతాయి. చాలాసార్లు, ప్రభుత్వాలకు తామే మళ్లీ గెలుస్తామన్న నమ్మకం నూటికి నూరుపాళ్లు ఉండదు. అందుకని, ఎన్నికల ప్రయోజనాల కోసం బడ్జెట్‌లో యథేచ్ఛగా వరాలు, వాగ్దానాలు గుప్పిస్తారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే అవన్నీ అమలుచేస్తామన్న వాగ్దానం ఆ బడ్జెట్ ఇస్తుంది. కానీ, మోదీ ప్రభుత్వం 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఏ మాత్రం ‘జనాకర్షణ’ లేని విధంగా రూపొందించింది. తామే తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు కాబట్టి, అమలు చేయగలమా లేదా అన్న విచికిత్స వారి మీద పనిచేసింది. ప్రజల ఆధ్యాత్మికతను సంతృప్తిపరచడం ద్వారా ఎన్నికలను గెలవబోతున్నప్పుడు, భౌతిక అవసరాల గురించిన పెద్ద పట్టింపు అవసరం లేదన్న నిశ్చింతా వారికి ఉంది. తరువాతి పదవీకాలం కూడా తమదే అని అధికారపక్షం తమ ప్రత్యర్థులకు తేల్చిచెప్పింది. మీకేమీ తాయిలాలు ఇవ్వకపోయినా సరే, మీరు మమ్మల్ని గెలిపించడం కంటె మరేమీ చేయలేరు అని కూడా ప్రజలకు చెప్పింది.

తెలంగాణలో కూడా అదే మానసిక యుద్ధతంత్రం నడుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ అంతరించిపోతుందని బీజేపీ అంటుంది. ఆరునెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని అసెంబ్లీ ఎన్నికల నాటి పాతపాటే కాంగ్రెస్ పాడుతుంది. ఎన్నికల ప్రచారానికి ఏవో వివాదాంశాలు అవసరం అవుతాయి. కానీ, తెలంగాణలో ఉన్న ప్రస్తుత వాతావరణం, ప్రభుత్వాల, పార్టీల మనుగడలనే చర్చలోకి తెచ్చింది. జాతీయ రాజకీయ సమరంలో తలపడుతున్న రెండు జాతీయపార్టీలు, మొన్నటిదాకా పదేళ్లు అధికారంలో, మరో పదమూడేళ్లు ఉద్యమంలో ఉన్న ప్రాంతీయపార్టీ, తమ తమ శక్తియుక్తులన్నిటిని ఉపయోగించి, ఎన్నికల గండాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాయి.

నిజానికి, ఈ ఎన్నికలు బీజేపీకి గండం కావు. ఈ ఎన్నికల ఫలితాల వల్ల కొత్తగా ఏ నష్టమూ పొందనిది బీజేపీ ఒక్కటే. ప్రస్తుతం ఉన్న స్థానాలను నిలుపుకున్నా చాలు. కాంగ్రెస్ అనుకూలత నేపథ్యంలో కూడా తన బలాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. అదనంగా స్థానాలు గెలుచుకుంటే, పురోగమిస్తున్నట్టు లెక్క. సగానికి పైగా గెలిస్తే, ఆపైన తిరుగుండదు. ఉన్న సీట్లకు తగ్గితే కూడా, అర్థం చేసుకోదగ్గ పరిణామమే తప్ప, పెద్ద పతనం కాదు. కాబట్టి, బీజేపీ ఒక సౌకర్యవంతమైన స్థితినుంచి పోరాటంలోకి దిగుతోంది. దాని ప్రయత్నం అంతా మెరుగుదల కోసమే. ఆ మెరుగుదల వస్తే, రాష్ట్ర రాజకీయాలను కూడా మలుపుతిప్పగలిగిన పరిణామాలకు అవకాశం ఉంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి అట్లా లేదు. వాటికి జీవన్మరణ సమస్య. అసెంబ్లీ విజయానికి తగినట్టు, అంతకు మించి విజయాలు రాకపోతే, రేవంత్ రెడ్డికి అధిష్ఠానం దగ్గర రేటింగ్ తగ్గవచ్చు, లేదా, ఇంటిపోరు అధికం కావచ్చు. తమకు మంచి గెలుపు రావడం ఒక్కటే సరిపోదు, బీఆర్ఎస్‌కు అనూహ్యమైన విజయాలు ఏమీ రావు కానీ, బీజేపీకి అదనపు బలం సమకూరకూడదు. కాంగ్రెస్ పది గెలిచి, తక్కినవి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం దక్కించుకుంటే ఓకె. అట్లా కాకపోతే, అదనపు గెలుపులతో బీజేపీలోకి వలసలు పెరిగిపోతాయి. కొందరు నిబద్ధులు ఉన్న మాట నిజమే కానీ, బీఆర్ఎస్ శా‍‍సన‍సభ్యులు అనేకులు తమకు ఉన్నచోట భవిష్యత్తు లేదన్న చింతలో పడిపోయారు. వారికి సహజంగానే బీజేపీ ఒక ఆకర్షణీయ గమ్యంగా కనిపిస్తుంది. ఇక అప్పుడు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు అనుమతించాలన్న తాత్విక ప్రశ్న బీజేపీ ఢిల్లీ పెద్దలలో తలెత్తవచ్చు.

బీఆర్ఎస్‌ది ప్రస్తుతానికి దయనీయ పరిస్థితే. లోక్‌సభ ఎన్నికలలో ప్రచారాంశమే లేని పార్టీ ఇది. కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి అయినా, బీజేపీకి వేయడానికి అయినా ఓటరుకు తగిన కారణాలున్నాయి. మరి బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి పోయి ఏమి సాధిస్తారు? అట్లాగని, ఎన్నికలను వదులుకోలేరు. మొన్నటి ఎన్నికలలో బలం చూపిన చోట్ల అయినా, ఎంపీలను గెలిపించుకోవాలి. లేకపోతే, ఎమ్మెల్యేల బలగాన్ని నిలుపుకోవడం కష్టం. కానీ, గత పదేళ్ల దాని పరిపాలనా కాలాన్నే కాంగ్రెస్ వివాదాస్పదం చేస్తున్నది. ఇంకా నాలుగున్నరేండ్ల కాలం ఎడారిలాగా కనబడుతుంటే, పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ వేట ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

బీజేపీ మీద కాకుండా, రేవంత్ రెడ్డి తన అస్త్రాలన్నిటినీ బీఆర్ఎస్ మీద ఎందుకు గురిపెడుతున్నట్టు? బీఆర్ఎస్ లక్ష్యం కూడా రేవంత్ మాత్రమే ఎందుకు అవుతున్నారు? బీఆర్ఎస్ నుంచి సిద్ధంగా ఉన్న వలసలను కాంగ్రెస్ ఎందుకు ఆపుతున్నది? అదనపు బలాన్ని సమకూర్చుకుని, ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లకుండా, దిగువశ్రేణి నేతల వలసలతోనే ఎందుకు తృప్తి చెందుతున్నట్టు? ఎన్నికల తరువాత బలం పెంచుకుందామనుకుంటున్నారేమో కానీ, అప్పటికి బీఆర్ఎస్ శిబిరంలో ఎవరైనా మిగులుతారా? ప్రధానమంత్రి పర్యటనలో రేవంత్ వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? తెలంగాణ అస్తిత్వ స్పృహ రేవంత్‌లో కనిపించడం లేదన్న విమర్శ బీఆర్ఎస్ తిరిగి ఉద్యమ ఉద్వేగాలను ఆశ్రయించనున్నట్టు సూచిస్తోందా? మోదీ చెప్పిన సర్జికల్ స్ట్రయిక్ అంతరార్థమేమిటి? ఇంతకీ, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో ప్రధాన పోటీ ఏ రెండు పార్టీల మధ్య? ఇవన్నీ తెలంగాణ రాజకీయరంగాన్ని కుదిపివేస్తున్న ప్రశ్నలు.

తమ పార్టీ మిగులుతుందా లేదా అన్న ఆందోళనలో ఒక పార్టీ, తమ ప్రభుత్వానికి గండం ఉందేమోనన్న భయంలో మరో పార్టీ సతమతమవుతున్నాయి. ఆ కలవరాన్ని మరింతగా పెంచిపోషిస్తూ బీజేపీ తమాషా చూస్తున్నది. ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి, పబ్బం గడుపుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నించారు. అందుకే పనిగట్టుకుని బీజేపీ బలం పెంచి, ఆ బలానికి తానే భయపడే స్థితికి వచ్చారు. స్వయంగా బీజేపీయే తనను తాను తగ్గించుకుని, యుద్ధంనుంచి తప్పుకున్నది కాబట్టి, కాంగ్రెస్‌కు లాభం కలిగింది. ఉత్సాహంతో పరుగులు తీస్తున్న బీజేపీని ప్రమాదరహితం చేసుకోవాలంటే, బీఆర్ఎస్ ఉనికి కూడా కొనసాగేట్టు కాంగ్రెస్ ప్రయత్నించాలి. బీజేపీకి మళ్లే బీఆర్ఎస్ ఓట్లను కొంతమేరకైనా నిరోధించగలగాలి. అట్లా కాక, తన గురిని బీఆర్ఎస్ మీద మాత్రమే సంధిస్తే, బీజేపీకి అదనపు బలం సమకూరుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో కూడా బలం పెరిగితే పర్యవసానాలు ఏమిటో రాష్ట్ర కాంగ్రెస్‌కు తెలియవా?

కె. శ్రీనివాస్

మైండ్ గేమ్స్‌లో మైమరపు పనికిరాదు.

ఆత్మరక్షణలో ఆదమరపూ కూడదు.

Updated Date - Mar 07 , 2024 | 02:10 AM