Share News

ఉనికి చాటింపు కాదు, వాస్తవాల గ్రహింపు కావాలి

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:20 AM

నక్సలైట్లు పేలుళ్లో కాల్పులో చేస్తే, అది వారు ఉనికి చాటుకునే చర్య అని పోలీసులు వెంటనే అనేవారు. ఆ చర్య వెనుక సంచలనమే తప్ప నిజమైన బలమేమీ లేదని ఆ వ్యాఖ్య ఉద్దేశ్యం. ఉనికిని చాటింపు...

ఉనికి చాటింపు కాదు, వాస్తవాల గ్రహింపు కావాలి

నక్సలైట్లు పేలుళ్లో కాల్పులో చేస్తే, అది వారు ఉనికి చాటుకునే చర్య అని పోలీసులు వెంటనే అనేవారు. ఆ చర్య వెనుక సంచలనమే తప్ప నిజమైన బలమేమీ లేదని ఆ వ్యాఖ్య ఉద్దేశ్యం. ఉనికిని చాటింపు వేసుకోవలసిరావడం పాలక, ప్రతిపక్ష రాజకీయాలలోకి కూడా ప్రవేశించి చాలా రోజులయింది. సంస్థలనో, ఉద్యమాలనో నిర్మించలేక చతికిలపడినప్పుడో, ఎన్నికలలో ప్రజల తిరస్కారానికి గురయినప్పుడో ఉనికికే ముప్పు వచ్చే ప్రమాదం రాజకీయపార్టీలకు ఎదురవుతుంది. భస్మం నుంచి లేచి ఎగిరే ఫీనిక్స్ పక్షి ఉదాహరణ చెబుతారు కానీ, నేలమట్టమయిన అస్తిత్వాలన్నిటికి అంతటి శక్తి ఉండదు. బలమైన నాయకత్వం, పట్టుదల, అనువైన పరిస్థితులు, నిరీక్షించగలిగిన నిబ్బరం అన్నీ కలసినప్పుడు, ఎన్ని పాములు మింగినా, ఎగబాకే నిచ్చెనలు కూడా అందివస్తాయి. పతనానికీ పునర్నిర్మాణ ప్రయత్నానికి మధ్య కాలంలో, బతికిచెడిన స్థితిని నిభాయించుకోగల స్థితప్రజ్ఞత అందరికీ సమకూరదు.

భారత రాష్ట్ర సమితికి ఇది గడ్డుకాలం. నిన్నమొన్నటిదాకా, మూడోసారి విజయం ఖాయమని ఆశించిన పార్టీ, ఇప్పుడు ఉనికి సమస్యను ఎదుర్కొంటున్నది. ఇంత మౌనానికీ ధ్యానానికీ ప్రయత్నించకుండా, వెనువెంటనే ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలకు, ప్రతిస్పందనలకు పాల్పడుతూ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నది. అధికారప్రతిపక్షాలకు వచ్చిన ఓట్లలో పెద్దతేడా లేదు. రెండు శాతం కంటే తక్కువే. గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలా, 39! ఎంతో గౌరవప్రదమైన ప్రతిపక్ష సంఖ్య! అధికారపక్షం బెదిరిపోయే సంఖ్య కూడా! అయినా, ఆ పార్టీకి ఉనికి సమస్య ఎందుకు వస్తోంది? రానున్న అయిదేళ్ల కాలం ఎడారిలాగా భయపెడుతున్నదా? లేక భవిష్యత్తే శూన్యంగా

అనిపిస్తున్నదా?

మొత్తంగా ఉండడం, పూర్తిగా లేకపోవడం లాంటి ఉనికి సమస్య కాదిది. నిలబడడం, నిలబడలేకపోవడం వంటి సమస్య. ఓ అయిదేళ్లకు ప్రభుత్వ వ్యతిరేకత ఉధృతమైనప్పుడు ప్రజల గజమాలకు తన కంఠమొక్కటే ఏకైక ఎంపికవుతుందా అన్న సందేహం. ఓటర్లు కాక, బలీయమైన ఇతరేతర శక్తులేవో కూడా తన మనుగడను శాసిస్తాయేమోనని భయం! ప్రాంతీయ పార్టీలన్నిటికి నూకలు పుట్టకుండా చేయాలని భారతీయ జనతాపార్టీ పంతం పట్టకపోయి ఉంటే ఈ అస్తినాస్తి విచికిత్సకు ఆస్కారం ఉండేది కాదు. తెలంగాణలో ఇప్పుడు రంగంలో ఉన్నది తామూ కాంగ్రెస్ మాత్రమేనని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది మురుగుకాల్వలో వేసినట్టేనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాటలు ఏదో యథాలాపంగా అన్నవి కాదు. అంతే కాదు, బీఆర్ఎస్‌కు అసలు ప్రాసంగికతే లేదని, లోక్‌సభ ఎన్నికల్లో పోరాడడానికి ఆ పార్టీ దగ్గర విషయమే లేదని కూడా ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉనికే ఉండదని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు.

వాస్తవంలో కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీ మీద, దాని మనుగడకు ఉండే ప్రమాదం మీద ఎక్కువ చర్చ జరగాలి. కానీ, ప్రభుత్వం కుదురుకున్నదన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. కాంగ్రెస్ బలం క్రమంగా పెరుగుతూ పోతుందని, బీఆర్ఎస్‌ది క్షీణించిపోతుందని స్పష్టంగా తెలిసిపోతోంది! ముప్పు ఉన్నది బీఆర్ఎస్ మనుగడకే అని సూచనలు కనిపిస్తున్నాయి. హామీలు అమలుచేయకపోతే ఖబడ్దార్ అంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు కేవలం ఉనికిని చాటుకునే గర్జనలు మాత్రమే. సాధారణ ఎన్నికలలో తమ ప్రాసంగికతను వెదుక్కునే బలహీనమైన ప్రయత్నాలు మాత్రమే! కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పెట్టే ఉద్దేశ్యమేదీ బీజేపీకి లేదు. ఇప్పట్లో ఉండదు కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయ్యాయని ఆరోపణలు వచ్చినా రావచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవగాహనతో వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎట్లాగూ అంటూనే ఉంది. లాలూచీ ఉన్నా లేకపోయినా, రంగంలో తనూ కాంగ్రెస్ మాత్రమే మిగలడం బీజేపీ ప్రాధాన్యం. ముగ్గురి నడుమ తాను లాభపడాలని కాంగ్రెస్ ఆలోచన. అధికారపక్షంతోనే కాక, సాటి ప్రతిపక్షంతో కూడా ఎట్లా పోరాడాలని బీఆర్ఎస్ సంకటం!

కిషన్ రెడ్డి, ఉత్తమ్ చేస్తున్న విమర్శల్లో ఆసక్తికరమైన అంశమొకటి ఉన్నది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేస్తారు? వేయాలి? అసెంబ్లీ ఎన్నికలలో పోల్అయిన ఓట్ల ప్రకారం, బీఆర్ఎస్‌కు 3, 4 స్థానాలు రావాలి. అంతకంటే ఎక్కువ సాధించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చును కానీ, అసలైన పరీక్ష ఆ మూడు నాలిగింటినైనా దక్కించుకోవడం! బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలోనూ లేదు! రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలో కాపాడే బాధ్యత అయితే కాంగ్రెస్‌ది లేదా ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీది? మధ్యలో ఈ బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేమిటి? ఏ నినాదంతో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలలో పోటీపడుతుంది? జాతీయస్థాయిలో ఉన్న ప్రధాన రాజకీయాంశం రామమందిరమో, మతతత్వవ్యతిరేకతో అనుకుంటే బీఆర్ఎస్ ఏ పక్షంలో ఉంటుంది? సెక్యులరిజం విషయంలో కాంగ్రెస్‌తో పోటీపడలేదు, మతవాదంలో బీజేపీతో పోటీపడలేదు. గత నెలరోజులుగా బీఆర్ఎస్ శిబిరం నుంచి వస్తున్న ప్రకటనలు కొన్ని హిందూత్వ వాదానికి సానుకూలతను ప్రకటించడం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీతో ఏదో అవగాహనకోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకు బీజేపీ విముఖత చూపిందని అనధికార వార్తలు చెలామణిలో ఉన్నాయి. నిజానికి ఆ వైపు వెళ్లడంలో ఉపయోగమేమీ ఉండదని బీఆర్ఎస్ గ్రహించే ఉంటుంది. బీఆర్ఎస్ బలహీనపడడమే బీజేపీ దీర్ఘకాలిక అజెండాకు అనుగుణమైనది. ఈ జటిలమైన వాతావరణంలో బీఆర్ఎస్ తన వ్యూహాన్ని ఎట్లా రూపొందించుకుంటుందన్నది ఆసక్తికలిగించే అంశం.

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓటర్ల నుంచి జనాదేశాన్ని విజయవంతంగా సాధించిన బీఆర్ఎస్, లోక్‌సభ ఎన్నికలలోనూ దాన్ని పొందగలదా? ఏ ఓటర్లు బీఆర్ఎస్ చేసిన ‘పట్టణాభివృద్ధి’ని, నిర్వహించిన శాంతిభద్రతలను, నిర్మించిన ఆధునికమైన సాంకేతిక పౌరవ్యవస్థలను మెచ్చి ఓట్లు వేశారో, ఆ ఓటర్లు జాతీయస్థాయిలో అవే కారణాల వల్ల, వాటికి తోడు ఉద్వేగపూరిత కారణాల వల్ల లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వేసే అవకాశం ఉన్నది. ఒకవేళ అట్లా జరిగితే, బీఆర్ఎస్ ఉనికి సమస్య ఉధృతమవుతుంది. అడ్రస్ గల్లంతు కాకపోయినా, ప్రమాదంలో పడుతుంది. మరి ఏమి చేయాలి?

అడ్డదారులు ఏవీ లేవు. అధికార కాలం మధ్యలోనే ‘రీకాల్’ చేసే వెసులుబాటు లేదు. కాబట్టి, ఐదేళ్లు ప్రతిపక్షవాసానికి మానసికంగా సిద్ధపడాలి. ‘కౌంట్ డౌన్’లు లెక్కించడం మానేయాలి. ఆత్రుత పడి, అత్యుత్సాహం చూపి ఉనికిని ప్రదర్శించడం కాకుండా, మొదటి గడి నుంచి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాలి. ఎక్కడ కోల్పోయారో అక్కడే వెదుక్కోవాలి. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ, ప్రజలలో అభిమానాన్ని తిరిగి పునఃస్థాపితం చేసుకోవాలి. ప్రజలు పెద్ద తప్పు చేశారనీ, తాము మాత్రం చిన్నచిన్న తప్పులు చేశామని, యూట్యూబ్ చానెళ్ల వల్ల మాత్రమే ఓడామని వ్యాఖ్యానించడం విరమించి, ఓటమిని దాని కారణాలతో సహా అంగీకరించాలి.

బీఆర్ఎస్ గుర్తించవలసిన అతి ముఖ్యమైన విషయం, తన ఉనికి కేవలం తనకు మాత్రమే సంబంధించినది కాదు. తెలంగాణ సమాజం కోసం కూడా బీఆర్ఎస్ ఉనికి కొనసాగాలి. ఏ రాజకీయపక్షాన్నీ తుడిచిపెట్టడం ప్రజాస్వామికం కాదు. తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షల సాధనలో భాగంగా రంగం మీదికి వచ్చిన పార్టీ నాటి టీఆర్ఎస్. తన నేరాలను వైఫల్యాలను సమీక్షించుకుంటే ఆ పార్టీకి కొత్త జీవితం సమకూరుతుంది. తన పేరు నుంచి కత్తిరించుకున్న తెలంగాణను తిరిగి తొడుగుకొని, కేవల భ్రమాత్మక ఊహలతో కల్పించుకున్న జాతీయ ఉనికిని కడిగేసుకుని, ప్రజలు తిరస్కరించిన అహంకార పూరిత దుష్పరిపాలనను సమీక్షించుకుని బీఆర్ఎస్ నిలబడాలి. నేటి అధికారపక్షాన్ని ప్రశ్నించడానికి మాత్రమే కాదు, రేపటి ప్రత్యామ్నాయం కావడానికి కూడా ఆ పార్టీ కొనసాగాలి.

తెలంగాణ రాజకీయాలలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత నైతికత అట్టడుగుకి జారిపోవడం బీఆర్ఎస్ హయాంలోనే మొదలైంది. ఆ పతనపు ప్రభావం రేపు బీఆర్ఎస్ మీద పడవచ్చు. ముప్పైతొమ్మండుగురులో కొందరు జారిపోవచ్చు, కొనుగోలు కావచ్చు. మారుమనసు పొందవచ్చు. సాధారణ ఎన్నికలలో ప్రతికూల ఫలితాలకు తోడు, ఈ నిష్క్రమణలు కూడా పార్టీని తీవ్రంగా బాధించవచ్చు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి బీఆర్ఎస్‌కు పరిపక్వత అవసరం.

ప్రధాన పక్షాలుగా రెండూ ప్రాంతీయపార్టీలుండే స్థితి తెలంగాణకు ఆరోగ్యకరం. ఫక్తు రాజకీయపార్టీగా మారిన ఉద్యమపార్టీ నుంచే ఒక పాయ మరో పార్టీగా మారి ఉంటే బాగుండేది. ఒకటి రెండుసార్లు అటువంటి అవకాశం వచ్చినా, సారథ్యం వహించవలసినవారు చొరవచూపలేకపోయారు. రెండు ప్రాంతీయపార్టీలు లేని పక్షంలో, ఒక జాతీయపార్టీ, ఒక ప్రాంతీయపార్టీ ఉండడం, ఆ జాతీయ పార్టీ కూడా తెలంగాణ సామరస్య జీవనశైలిని పెంపొందించే సెక్యులర్ పార్టీ అయి ఉండడం శ్రేయస్కరం. ఉత్తరభారతదేశపు ఉద్రిక్తతలను, ఉన్మాదాన్ని దిగుమతి చేసే రాజకీయాలు తెలంగాణ భవిష్యత్తుకు క్షేమం కావు. అందుకోసం కూడా బీఆర్ఎస్ తనను తాను కాపాడుకోవాలి.

కె. శ్రీనివాస్

Updated Date - Jan 04 , 2024 | 01:20 AM