Share News

దృశ్యాల వెనుక అదృశ్య ప్రయోజనాలు!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:11 AM

అందరూ వేషాలు వేస్తారు, మాటలూ చెబుతారు. కానీ, అందరి పప్పులూ ఉడకవు. ఏమి చూపించినా, ఏమి చెప్పినా, జనానికి ఏమి కనిపించిందన్నదే ముఖ్యం. దర్జా ప్రదర్శించబోతాం, జనం మాత్రం....

దృశ్యాల వెనుక అదృశ్య ప్రయోజనాలు!

అందరూ వేషాలు వేస్తారు, మాటలూ చెబుతారు. కానీ, అందరి పప్పులూ ఉడకవు. ఏమి చూపించినా, ఏమి చెప్పినా, జనానికి ఏమి కనిపించిందన్నదే ముఖ్యం. దర్జా ప్రదర్శించబోతాం, జనం మాత్రం దర్పాన్ని చూస్తారు. మంచితనం చూపబోతాం, మెతకదనమే కనిపించవచ్చు.

అప్పుడిక మార్గం ఏమిటంటే, ఎట్లా కనబడితే అనుకున్న ప్రయోజనం దొరుకుతుందో, అట్లా కనిపించగలగాలి. అదొక విద్య. దానికో శాస్త్రం ఉంది. కొందరు నిపుణులున్నారు. ఈ ఇంద్రజాలికులు, జనం దృక్వలయంతో యథేచ్ఛగా విన్యాసాలు చేయగలరు. అబ్బురపరిచి, తన్మయపరిచి, వశీకరణం చేసుకోగలరు. వారు కనికట్టు చేసినప్పుడు, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు పారవశ్యం కలుగుతుంది. మనకు కలిగే మనోభావాలు ఎవరో సంకల్పించి జొప్పించినవి అని కనిపెట్టలేము. నాడీమండలం పూర్తిగా పరాధీనం అయిపోతుంది. ఏది హితవో ఏది కాదో విచక్షణ ఉండదు.

నరేంద్రమోదీ ద్వారక దగ్గర చేసిన పని ఏదో, ఆయన కేవలం తన సొంత భక్తిలో భాగంగా చేసి ఉంటారని, లేదా, యథాలాపంగా జరిగి ఉంటుందని అనుకోలేము. ఆ ప్రక్రియ అంతటినీ దృశ్యీకరించి ప్రపంచంతో పంచుకున్నారు కాబట్టి, దానికి ఒక సార్వజనీన విలువ ఉంటుంది, ఒక ప్రయోజనమూ ఉంటుంది. ఆయనను అట్లా చూసిన ప్రజలు రకరకాల భావసంచలనాలను పొంది ఉంటారు. అట్లా పొందడం కోసమే ఆ సన్నివేశం ఏర్పడి ఉంటుంది. మోదీ వంటి నాయకుడి ప్రతిక్షణమూ, ప్రతిచర్యా అతి జాగ్రత్తగా ముందస్తు రూపకల్పనతో, నిర్దిష్ట లక్ష్యంతో నిర్మితమవుతుంది. అందుకోసం పెద్ద పటాలమే పనిచేస్తూ ఉంటుంది.

ఎన్నో రాచకార్యాలతో ఎంతో పనిఒత్తిడిలో ఉండే పదవిలో ఉన్నారు మోదీ. పైగా, ఎన్నికలు సమీపిస్తున్నందున, రాజకీయమైన పనిభారం కూడా ఆయన మీద చాలా ఉన్నది. వీటన్నిటి మధ్య ఆయన ద్వారక సందర్శన చేశారంటే, స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా ఉండి ఉండాలి. ఈ మధ్య నరేంద్రమోదీ ఎక్కడికి ఏ అధికారిక, రాజకీయ కార్యక్రమానికి వెళ్లినా, అక్కడికి సమీపంలోని గుడులు గోపురాలను సందర్శిస్తున్నారు. రామ మందిర ప్రతిష్ఠకు ముందు అయితే, దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఆయన ఆలయసేవ చేశారు, నిద్రచేశారు. వీటన్నిటిని గమనిస్తున్నవారు, ఆయన దేశానికి ప్రధానమంత్రా, ప్రధాన అర్చకుడా అని హాస్యాలు కూడా చేశారు. రెంటికి మధ్య సరిహద్దులు చెరిగిపోయే కాలంలో జీవిస్తున్నామని ఆ వేళాకోళాల వారికి తెలియనట్టుంది. మోదీ తమ పార్టీ బలాన్ని 370కి, కూటమి బలాన్ని 400కు పెంచే మహాకార్యంలో ఉన్నారు. ద్వారక సందర్శనతో సహా అన్ని ఆలయ పర్యటనలూ ఆ మహాకార్యంలో భాగాలే.

ఒక వయసు వచ్చిన తరువాత రామా, కృష్ణా అనుకోవాలని పెద్దవాళ్లు చెబుతుంటారు. పార్టీ సహచరులలో ముప్పాతిక వయసు వచ్చినవారందరినీ వానప్రస్థానికి పంపించివేసిన నరేంద్రమోదీ, తాను మాత్రం ముచ్చటగా మూడోసారి పదవికి సిద్ధపడుతున్నారు. పదవిలో ఉంటూ కూడా రామా, కృష్ణా అనుకోవడంలో ఆయనకు పుణ్యం, పురుషార్థం రెండూ ఉన్నాయి. అయోధ్య కార్యక్రమంతో రామస్మరణ జరిగింది, ద్వారక విన్యాసంతో కృష్ణ కృష్ణ అని కూడా అనుకున్నారు. మరోపక్క వారణాసిలో హరహరమహదేవుడు కూడా సిద్ధమవుతున్నాడు. ద్వారక శిథిలాలు ఉన్న సముద్రభాగంలో నీటిలోపల మోదీ కూర్చుని, నెమలీకలు సమర్పించి భక్తి ప్రదర్శించిన దృశ్యాన్ని చూసి, చాలా మంది ప్రజలు పులకించిపోయి ఉంటారు. రామాలయాన్ని మోదీయే సాధించారని ఒక వాడుక స్థిరపడిన వాతావరణంలో, ఇప్పుడు మరో అవతార పురుషుడి రాజ్యస్థానంలో, ఎంతో ప్రమాదానికి సిద్ధపడి భక్తి ప్రదర్శించడం ఆయనను జనహృదయాలలో మరొక మెట్టు ఎక్కించింది. మ్లేచ్ఛ నామం కలిగిన అరేబియా సముద్రం నుంచి ద్వారకను పైకి తీసుకురాగలిగిన ధీరుడు అని కూడా మోదీ మీద అంచనాలు పెరిగి ఉండవచ్చు. మోదీ అనే ఒక సజీవ విగ్రహాన్ని తాము సంకల్పించిన రూపురేఖలతో నిర్మించడానికి, వాటిని మెచ్చేటట్టుగా ప్రజలను తీర్చిదిద్దడానికి గత దశాబ్దంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ద్వారక రంగస్థలం రూపొందింది.

అట్లాగని, నరేంద్రమోదీకి భక్తి లేదని కాదు. భక్తినివేదనను ఈ రూపంలో ప్రదర్శించి, ప్రచారం చేయడంలో ఉద్దేశం వ్యక్తిగతం కాదు. ఆయన వంటి రాజకీయనాయకుడు ప్రదర్శించే అన్ని వ్యక్తిత్వ లక్షణాలూ వాస్తవంలో ఉండనక్కరలేదు. హిమాలయాల్లో పర్వతగుహల్లో ధ్యానం చేయడం, సముద్రతీరంలో వాలుకుర్చీలో సేదతీరడం, సఫారీ వాహనం మీద వేటగాడి వేషంలో సంచరించడం, డిస్కవరీ ఇంటర్వ్యూ కోసం వనవిహారం చేయడం, సముద్రం ఒడ్డున స్వచ్ఛభారత్ చేయడం... బహుముఖ ప్రజ్ఞలు, సకల కళలు ఉన్న మహానాయకుడుగా మోదీ కనిపించి, ఆశ్చర్యపరుస్తారు. ధీరుడు, వీరుడు, కర్కశుడు, కారుణ్యమూర్తి, విహారి, వినోది, భక్తుడు, ఈ వ్యక్తిత్వాలను అన్నిటిని జనహృదయాలలో ప్రతిష్ఠించిన ప్రజాసంబంధాల ప్రచారవ్యవస్థను అభినందించవచ్చు.

వేషభాషలు, ఇతర ప్రదర్శనలు రాజకీయరంగంలో ఎప్పటినుంచో ఉన్నాయి. గాంధీజీకి తన ఆహార్యమే పెద్ద రాజకీయ ఆయుధం. చైనా నేత మావోసేటుంగ్ 1960 దశకం మధ్యలో కమ్యూనిస్టు పార్టీలో బలహీనపడినప్పుడు, 73వ ఏట యాంగ్సీ నదిని మరోసారి ఈది, తన దృఢత్వాన్ని ప్రదర్శించాడు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఆరంభదినాల్లో ఖాకీ డ్రెస్‌లోనూ, తరువాత కాషాయంలోను ఎన్టీయార్ ఉద్దేశించిన ప్రయోజనాలు రాజకీయమైనవే. బేఖాతరు జులాయి అధ్యక్షుడిగా కనిపించడం వల్లనే డొనాల్డ్ ట్రంప్ 2020లో ఓడిపోయారు. జో బైడెన్ తనను తాను అమెరికాకు అవసరమైన అనుభవశాలినని అనుకుంటుంటే, ప్రజలు మాత్రం ఇప్పుడు తడబడునడకల నీరస వృద్ధుడిగా చూస్తున్నారు.

భౌతిక శాస్త్రంలోనే కాదు, రాజకీయాలలోనూ ‘ఆప్టిక్స్’ దృశ్యనిర్వహణగా ఇప్పుడు మంచి డిమాండ్‌లో ఉన్నది. ‘ఆప్టిక్స్‌’ను సమర్థంగా నిర్వహించాలని బీజేపీ అనుకోవడం సహజమే. అందుకు కావలసిన హంగు, సమర్థతా కూడా ఆ పార్టీకి ఉన్నాయి. మరి వ్యూహకర్తలు సంకల్పించిన దృశ్యాలను జనం వడగట్టుకోరా? ఆ కనికట్టులోకి అందరూ జారిపోతారా? మోదీ ద్వారక సన్నివేశాన్ని ప్రశంసాపూర్వకంగా చూసేవారు, నిజంగా ఆయన ప్రయత్నంలో రాజకీయ ఉద్దేశ్యాలు లేవని అనుకుంటారా? లేక, భక్తిని రాజకీయాలకు వాడుకోవడం కాక, రాజకీయాలనే భక్తివ్యాప్తికి ఉపయోగించుకుంటున్నారని మెచ్చుకుంటారా? ఆలయ సందర్శనల మధ్య విరామంలో, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ లేదా గగన్‌యాన్ వ్యోమగాముల ప్రకటన కార్యక్రమంలోనో మోదీ కనిపిస్తారు. వైజ్ఞానిక, మౌలిక వసతుల అభివృద్ధివాదిగా ప్రదర్శిస్తున్న మరో ముఖాన్ని కూడా ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారా? దైనందిన జీవితానికి ఎంతో కీలకమయిన అవసరాలను నెరవేర్చడంలో విఫలమైన నాయకుడి ముఖాన్ని మరచిపోతారా? ఓటు మీట నొక్కేముందు ఏ ముఖం వారికి గుర్తుకు వస్తుంది?

వాస్తవమైన, భౌతికమయిన కష్టనష్టాలు, స్థితిగతులు ప్రధానం కాకుండా, ఉద్వేగపూరిత ప్రపంచంలోకి పంపించడం ఈ ప్రక్రియల లక్ష్యం. చారిత్రక అన్యాయం, వర్తమానంలో దాని నివృత్తి, ఒక ప్రజాసమూహంపై కృత్రిమ ఆధిక్య ప్రదర్శన, ఇవన్నీ వాస్తవజీవితాన్ని మెరుగుపరిచేవి కావు. ద్వేషాన్ని కల్పించి, అది లక్ష్యంగా చూపే కల్పిత శత్రువుని నిర్మూలించి, కృత్రిమ ఉపశమనాన్ని, బూటకపు విజయభావాన్ని పొందే మేధావరణంలో విచక్షణ, హేతువులకు ప్రవేశమే ఉండదు.

ఫోటో, వీడియో ఏదైనా కానీ, దృశ్యం అనేది బలమైన కమ్యూనికేషన్ సాధనం. అటువంటి దృశ్యంలో ఆలోచనాత్మక సందేశం కాక, ఉద్వేగాత్మక సందేశాన్ని దట్టించినప్పుడు, వీక్షకుల మనసులో అది ముద్రలనే వేస్తుంది. పదే పదే ఒకే ముద్ర పడినప్పుడు, ఆలోచనకు ఉద్వేగం అవకాశమివ్వనపుడు, ప్రజల ఎంపికలు వారిచేతిలో ఉండవు. మరబొమ్మలుగా మారిపోతారు. తమ మీద తాము అదుపుతప్పిపోతారు. రాజకీయ దృశ్యశాస్త్రజ్ఞులు దానినే కోరుకుంటారు. దీనికి ఔషధం ఏమిటి? ఉద్వేగం మీద ఆలోచన పైచేయి కావడం ఎట్లా? పారవశ్యం నుంచి, పూనకం నుంచి మనిషి విచక్షణాయుత హృదయాన్ని ఉద్ధరించడం ఎట్లా? ప్రతి దృశ్యం వెనుక ఉండే అసలు అర్థాన్ని ఆవిష్కరించడం ఎట్లా? మీడియాను వినోద సాధనంగా, సమాచార సాధనంగా మాత్రమే కాకుండా, ఒక రాజకీయ పరికరంగా కూడా అర్థంచేసుకోవాలి. ప్రతి అక్షరాన్ని, శబ్దాన్ని, దృశ్యాన్ని వడగట్టకుండా లోపలికి తీసుకోగూడదు, సంశయించకుండా స్వీకరించకూడదు.

కె. శ్రీనివాస్

Updated Date - Feb 29 , 2024 | 04:11 AM