Share News

అపూర్వ సామాజిక విప్లవానికి అంకురం

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:28 AM

కార్మికుల కరిగిన కండల్లో నుంచి, రైతు కూలీల రక్తం నుంచి, కష్టజీవుల కంటిమంటల్లో నుంచి, నిరుపేదల కన్నీటి నుంచి, అన్నార్తుల ఆక్రందనల నుంచి, శ్రామికుడి స్వేదం నుంచి, ఆడపడుచుల...

అపూర్వ సామాజిక విప్లవానికి అంకురం

కార్మికుల కరిగిన కండల్లో నుంచి, రైతు కూలీల రక్తం నుంచి, కష్టజీవుల కంటిమంటల్లో నుంచి, నిరుపేదల కన్నీటి నుంచి, అన్నార్తుల ఆక్రందనల నుంచి, శ్రామికుడి స్వేదం నుంచి, ఆడపడుచుల ఆర్తనాదాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఎన్టీఆర్ చేసిన ప్రసంగం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభంజనాన్ని సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరంగా తెలుగు ప్రజలు భావించారు. పార్టీ ఆవిర్భావానికి ముందు వరకు రాజకీయ అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో కొనసాగింది. సమాజంలో ఆర్థిక, సాంఘిక అసమానతలకు గురవుతున్న బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.

రాజకీయ పద్మవ్యూహాల మధ్య, అన్నదాతల అవస్థల మధ్య, శ్రమజీవుల రెక్కల కష్టం మధ్య, తాగేందుకు నీరు, అడిగేందుకు నోరులేని అభాగ్యుల కడగండ్ల మధ్య, ప్రగతి కోసం – ప్రజాసంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే తెలుగునాట ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం మొదలైంది. రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. బూజుపట్టిన బూర్జువా వ్యవస్థను రూపుమాపి విప్లవాత్మకమైన విధానాలకు శ్రీకారం చుట్టింది ఆ పార్టీ.

ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసే నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత, అస్థిరత్వం నెలకొని ఉన్నాయి. తెలుగుజాతికి, తెలుగుభాషకు గుర్తింపు లేకుండా పోయింది. ఆనాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని హస్తినాపురంలో అణాపైసలకు అమ్మకానికి పెట్టారు. ఏ క్షణాన ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితి దాపురించింది. ప్రజాభిప్రాయానికి తావులేకుండా సీల్డ్ కవర్లలో అభ్యర్థుల పేర్లు వచ్చేవి. అవినీతి సొమ్ము ఢిల్లీ పెద్దలకు అప్పజెప్పి పదవులు కొనుక్కునేవారు. సంక్షేమం, అభివృద్ధి కరువై దైనందిన పాలనకు రాజకీయ గ్రహణం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో నూతన రాజకీయ వ్యవస్థకు, కొంగొత్త సంస్కృతికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. అప్పటివరకు మదరాసీలుగా గుర్తించిబడిన తెలుగుజాతికి ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.

కాంగ్రెస్ కుటిల రాజకీయాలతో దిగజారిన పాలనా ముఖచిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ సింహగర్జన చేస్తూ విప్లప శంఖారావాన్ని పూరించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని పిలుస్తూ ప్రజలను ఉత్సాహపరిచారు. చైతన్యరథం వేదికగా అందులో నిద్రిస్తూ, ప్రయాణిస్తూ, రోడ్డుపక్కన కాలకృత్యాలు తీర్చుకుంటూ తొమ్మిది నెలలు అవిశ్రాంతంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నిటికి ఎన్టీఆరే ఆద్యుడు. తెలుగుదేశం పార్టీ సృష్టించిన ప్రభంజనం రాజకీయ రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. 125 మంది పట్టభద్రులు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 47 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు తమ అభ్యర్థులుగా రంగంలోకి దించారు. అభ్యర్థుల సగటు వయసు కూడా 47 సంవత్సరాలలోపే. యువత, విద్యావంతులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు.

294 స్థానాలకు గాను 202 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది. అహంకారానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరులో ఆత్మగౌరవం నిలిచింది, గెలిచింది. కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి, అధికారం చేపట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‍కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖపాత్ర వహించింది. కేంద్రంలో కనీసం అయిదు ప్రభుత్వాలు ఏర్పడటానికి, మనగలగడానికి కారణమైంది.

తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సమాజమే దేవాలయం–ప్రజలే దేవుళ్లని నినదించిన గొప్ప మానవతావాది ఎన్టీఆర్. ఆకలిగా ఉన్న అన్నార్తులకు కిలో రూ.2కే బియ్యం అందించారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువచేయడానికి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9శాతం రిజర్వేషన్, బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వతంత్రాలు పంచారు. 1984లో ఎన్టీఆర్‍ను అప్రజాస్వామికంగా గద్దె దించినప్పుడు యావత్ తెలుగుజాతి ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నడిపి చరిత్రలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ తెలుగునాట విలక్షణ రాజకీయ వ్యవస్థగా ఏర్పడి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన అనేక చారిత్రక ఉద్యమాలు నిర్మించింది. 22 ఏళ్ళు తెలుగుప్రజలను పాలించింది.

సిద్ధాంతాలు, జాతీయ దృక్పథం, ఉన్నత విలువలతో 42 వసంతాలు పూర్తిచేసుకుని 43వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎన్నెన్నో ఆటుపోట్లను, మరెన్నో సంక్షోభాలను, కుట్రలు, కుతంత్రాలను తట్టుకుని సమున్నతంగా నిలబడింది. సంక్షోభం ఎదురైనప్పుడల్లా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు చేరువైంది. సంక్షోభాల నుంచి అవకాశాలను వెతుక్కుంటూ ముందుకుసాగింది.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‍ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషిచేశారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే సమాజంలోని అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. బడుగుల బతుకుల్లో పచ్చదనం నింపి, నిరుపేదల ఆకలి తీర్చి గూడులేని దీన జనులకు నీడనిచ్చింది.

సైద్ధాంతిక నిబద్ధత, బలమైన వర్తమానం, ఆశావహ దృక్పథం తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే కార్ఖానా మారి అనేకమంది నాయకులకు జన్మనిచ్చింది. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ తయారైనవారే. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకొంటూ చరిత్ర గతిలో తన ఉనికిని బలంగా చాటుకొంటూనే ఉంది. ఎన్నడూ ఓటమితో నిరాశగా వెనకడుగు వేసిఎరుగదు. సంక్షోభం ఎదురైనప్పుడల్లా మహోత్సవంతో ముందడుగు వేస్తూనే వుంది. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవీధులలో వెలుగెత్తి చాటుతూ రాజకీయ కుట్రలు, మానసిక దాడులను తట్టుకుని నిలబడి కలబడుతూనే ఉంది. 60 లక్షల మంది సభ్యులు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీకైతే, చంద్రబాబునాయుడు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచారు. ఆర్థికనేరస్థుడి ఏలుబడిలో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక, విధ్వంస పాలనకు గోరీ కట్టి తెలుగుదేశం పార్టీకి తిరిగి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సమాయత్తం కావాలి.

మన్నవ సుబ్బారావు

(మార్చి 29: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం)

Updated Date - Mar 28 , 2024 | 01:28 AM