Share News

మెదడులో రక్తస్రావం... ప్రమాదం

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:28 PM

తలలో రక్తం గడ్డకట్టడంతో సద్గురు జగ్గీ వాసుదేవ్‌, ఆస్పత్రి పాలైన సంగతి అందరికీ తెలిసిందే! ఈ సమస్య ఎవరికి, ఎందుకొస్తుందో, ఆలస్యం చేయడం ఎంత ప్రమాదకరమో వైద్యులు వివరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు అదుపు తప్పితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావచ్చు. ఈ సమస్యకు కూడా రక్తస్రావమే కారణమైనా, ఈ రక్తస్రావం మెదడు లోపల జరుగుతుంది.

మెదడులో రక్తస్రావం... ప్రమాదం

తలలో రక్తం గడ్డకట్టడంతో సద్గురు జగ్గీ వాసుదేవ్‌, ఆస్పత్రి పాలైన సంగతి అందరికీ తెలిసిందే! ఈ సమస్య ఎవరికి, ఎందుకొస్తుందో, ఆలస్యం చేయడం ఎంత ప్రమాదకరమో వైద్యులు వివరిస్తున్నారు.

మధుమేహం, రక్తపోటు అదుపు తప్పితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావచ్చు. ఈ సమస్యకు కూడా రక్తస్రావమే కారణమైనా, ఈ రక్తస్రావం మెదడు లోపల జరుగుతుంది.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వేరు, బ్రెయిన్‌ హెమరేజ్‌ వేరు. రక్తనాళాలు చిట్లి మెదడు లోపల రక్తస్రావం జరగడం బ్రెయిన్‌ స్ట్రోక్‌. మెదడులోని రక్తనాళాలు చిట్లి క్రమక్రమంగా రక్తాన్ని స్రవిస్తూ ఉండడం మూలంగా రక్తం గడ్డలు ఏర్పడే సమస్య బ్రెయిన్‌ హెమరేజ్‌. కొందర్లో అకస్మాత్తుగా రక్తస్రావం జరిగి అక్యూట్‌ బ్రెయిన్‌ హెమరేజ్‌ జరగవచ్చు. ఇంకొందర్లో క్రమేపీ రక్తస్రావం పెరిగి, క్రానిక్‌ బ్రెయిన్‌ హెమటోమా పరిస్థితి ఉండవచ్చు. సద్గురుకు జరిగింది ఇదే! అయితే రెండు రకాల హెమరేజ్‌ల్లో మెదడుకూ, పుర్రెకూ మధ్య ఉండే ఖాళీ జాగాలో రక్తం పేరుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పెద్దల్లో మెదడు పరిమాణం తగ్గడం వల్ల ఈ జాగాలో రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. చర్మానికి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, ఆ ప్రదేశాన్ని వేళ్లతో కొద్దిసేపు నొక్కి ఉంచితే రక్తస్రావం ఆగిపోతుంది. మెదడులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలి రక్తస్రావం మొదలైతే, మెదడు వ్యాకోచించి, ఆ ప్రదేశంలో ఒత్తిడిని పెంచడం ద్వారా రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. దాంతో బ్లీడింగ్‌ ఆగిపోయి, సమస్య సర్దుకుంటుంది. కానీ కొందర్లో ఇలా జరగదు.

తలకు దెబ్బలు తగలకుండా...

విపరీతంగా మద్యపానం చేసేవారిలో, పెద్దల్లో మెదడు పరిమాణం తగ్గుతుంది. కాబట్టి మెదడు వ్యాకోచించి, రక్తస్రావాన్ని ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్లలో బ్రెయిన్‌ హెమరేజ్‌ తలెత్తే ముప్పు ఎక్కువ. మూత్రపిండాల వ్యాధులు, లివర్‌ ఫెయిల్యూర్‌, ఎముక మజ్జ సమస్య, రక్త కేన్సర్‌ ఉన్నవాళ్లలో కూడా రక్తస్రావ సమస్యలు ఎక్కువ. గుండె జబ్బులు, గుండె కవాట మార్పిడి చేయించుకున్న వాళ్లు రక్తం పలుచనయ్యే మందులతో పాటు రక్తం గడ్డకట్టకుండా నియంత్రించే యాంటీ కాగ్యులెంట్స్‌ కూడా వాడుతూ ఉంటారు. ఈ కోవలకు చెందిన వాళ్లకు కూడా ముప్పు ఎక్కువే! తల గోడకు కొట్టుకోవడం లేదా కింద పడిపోయి తలకు చిన్నపాటి దెబ్బలు తగలడం జరిగినప్పుడు సాధారణంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఆ దెబ్బ తగిలిన సమయంలో మెదడులోని రక్తనాళం చిట్లి కొద్దికొద్దిగా రక్తం స్రవిస్తూ, గడ్డకట్టడం మొదలుపెడుతుంది. అలా కొంత కాలానికి మెడదుకూ, పుర్రెకూ మధ్య ఉండే జాగాలో రక్తం గడ్డ నిర్దిష్ట పరిమాణానికి పెరిగిపోయినప్పుడు లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి ఈ కోవలకు చెందిన వాళ్లు తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి.

హెచ్చరించే లక్షణాలు ఇవే!

తల నొప్పి: తలనొప్పికి ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి సాధారణ తలనొప్పికీ, బ్రెయిన్‌ హెమరేజ్‌ తలనొప్పికీ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. హెమరేజ్‌ వల్ల తెల్లవారుఝామున విపరీతమైన తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పితో నిద్ర మెలవువ అయిపోతూ ఉంటుంది.

వాంతులు: వాంతి అయిపోవడం లేదా అలా అనిపించడం

కళ్లు: కళ్ల ముందు చీకటి ఆవరించడం

కాళ్లు: నడుస్తున్నప్పుడు కాళ్లు ఈడ్చవలసి రావడం అనిపించడం, నడవడంలో ఇబ్బంది

ఫిట్స్‌: మూర్ఛలు మొదలు కావచ్చు

అయోమయం: అయోమయానికి గురవుతూ, పరాకుగా మాట్లాడడం. పెద్దల్లో ఈ లక్షణాన్ని గమనించాలి.

మాటలు: ముద్దగా మాట్లాడడం, మాటలు తడబడడం

ప్రమాదకరమే!

మెదడులో ఏ సమస్య తలెత్తినా ప్రమాదకరంగానే భావించాలి. తల నిర్దిష్ట పరిమాణానికి పరిమితమై ఉంటుంది కాబట్టి గడ్డ, రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్‌... ఇలా పుర్రె లోపల అదనంగా ఏ చిన్న సమస్య తలెత్తినా మెదడు మీద ఒత్తిడి పెరిగి, పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఆలస్యం చేస్తే, రోగి మత్తులోకి జారుకుని, కోమాలోకి వెళ్లిపోవచ్చు. ఒక వైపు శరీరం పక్షవాతానికి గురి కావచ్చు. కాబట్టి లక్షణాలను గుర్తించిన వెంటనే ఆస్రత్రికి తరలించాలి.

సత్వర చికిత్స కీలకం

మెదడులో ఎటు వైపు రక్తస్రావం జరిగినా, కుడి, లేదా ఎడమ సగభాగం మెదడు పైన రక్తం గడ్డ కట్టుకుంటుంది. దీన్ని వీలైంత త్వరగా సర్జరీతో తొలగించి, మెదడు మీద ఒత్తిడిని తగ్గించాలి. ఆలస్యం జరిగేకొద్దీ మెదడుకు శాశ్వత నష్టం జరిగిపోతూ ఉంటుంది. రక్తపు గడ్డల వల్ల మెదడుకు రక్తస్రావం లోపించి, మెదడు కణాలకు ఆక్సిజన్‌ అందక కణ నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు పక్షవాతం శాశ్వతంగా ఉండిపోవచ్చు. శాశ్వతంగా మాటలు పడిపోవచ్చు. శరీరంలో బలహీనత శాశ్వతంగా మిగిలిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కాబట్టి మెదడు కణాలు చనిపోయేలోగా వీలైనంత త్వరగా సర్జరీ చేసి రక్తపు గడ్డలను తొలగించాలి. ఇలా సత్వరంగా స్పందించగలిగితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

సర్జరీ ఇలా...

సిటి స్కాన్‌తో మెదడులోని రక్తపు గడ్డను, దాని వయసును తేలికగా, త్వరగా కనిపెట్టవచ్చు. రక్తపు గడ్డ వయసు మూడు వారాలుంటే, ఆ రక్తం ద్రవరూపంలో ఉంటుంది. ఇలాంటప్పుడు పుర్రెకు రంథ్రం చేసి, రక్తాన్ని తలగించవచ్చు. కొందర్లో రక్తం ద్రవ, ఘన రూపాల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు తలను తెరిచి రక్తాన్ని డ్రెయిన్‌ చేయవలసి ఉంటుంది. కొందరో ఘనరూప రక్తం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా పుర్రెను తెరిచి, రక్తపు గడ్డను తొలగించవలసి ఉంటుంది.

అయితే అన్నిటికంటే ముందు, రక్తపు గడ్డ ఏర్పడడానికి కారణాలను కూడా తెలుసుకోవాలి. బ్లడ్‌ థిన్నర్లు, యాంటీ కాగ్యులెంట్లు వాడుకుంటున్న వాళ్లు, కిడ్నీ, లివర్‌ పనితీరు క్రమం తప్పిన వాళ్లు, మద్యపానం చేసేవాళ్లు, రక్తస్రావ సమస్యలున్నవాళ్లలో సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైద్యులు సూచించిన జాగ్రత్తలు

పాటిస్తూ వారి పర్యవేక్షణలో ఉండాలి. సర్జరీ తర్వాత మూర్ఛలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటికి అవసరమైన మందులు కూడా వాడుకోవాలి. కొందరికి రెండు నుంచి మూడు వారాల పాటు రీహ్యాబిలిటేషన్‌ అవసరం అవుతుంది.

నియంత్రణ మార్గాలు

  • దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ ఉండాలి.

  • తీవ్ర మద్యపానం మానేయాలి.

  • తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి

  • పార్కిన్‌సన్‌ ఉన్న పెద్దలు కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • మధుమేహం, రక్తపోటు అదుపు తప్పితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావచ్చు.

  • ఈ సమస్యకు కూడా రక్తస్రావమే కారణమైనా, ఈ రక్తస్రావం మెదడు లోపల జరుగుతుంది.

డాక్టర్‌ కౌశల్‌ ఇప్పిలి

న్యూరో సర్జన్‌,

అపోలో హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.

Updated Date - Mar 25 , 2024 | 11:28 PM