Share News

అసాధారణం... ఆమె జీవితం

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:47 AM

అనూహ్యమైన స్టార్‌డమ్‌... క్షణం తీరికలేని షెడ్యూల్స్‌... స్వయంకృషితో నిర్మించుకున్న సౌధం ఒక్కసారిగా కుప్పకూలింది. కారు ప్రమాదం... కోమాలోకి నెట్టేసి... పాత జ్ఞాపకాలన్నీ చెరిపేస్తే... ఆత్మవిశ్వాసంతో నిలబడి...

అసాధారణం... ఆమె జీవితం

అనూహ్యమైన స్టార్‌డమ్‌...

క్షణం తీరికలేని షెడ్యూల్స్‌...

స్వయంకృషితో నిర్మించుకున్న సౌధం

ఒక్కసారిగా కుప్పకూలింది. కారు ప్రమాదం... కోమాలోకి నెట్టేసి... పాత జ్ఞాపకాలన్నీ

చెరిపేస్తే... ఆత్మవిశ్వాసంతో నిలబడి...

సానుకూల దృక్పథంతో తిరిగి మామూలు మనిషి అయింది. బాలీవుడ్‌ మ్యూజికల్‌ హిట్‌ ‘ఆషికీ’ కథానాయిక అనూ అగర్వాల్‌

ప్రయాణంలో ఊహకందని మలుపులే కాదు... కుదుపులూ ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ అధిగమించి... నేడు ఎందరికో ప్రేరణగా మారిన అనూ జీవిత ‘చిత్రం’ ఇది.

స్వీయ నిర్మితం నుంచి స్వీయ స్వస్థత వరకు... అనూ అగర్వాల్‌ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అనుభవ పాఠాలు ఎన్నో. శరీరానికి అయిన గాయాలకు తల్లడిల్లిపోకుండా... మానసిక ఒత్తిడికి కుంగిపోకుండా... తనను తాను ఒక మనిషిగా మలుచుకున్న తీరు స్ఫూర్తి రగిలిస్తుంది. 1990లో ‘ఆషికీ’తో తొలిసారి వెండితెరపై మెరిసిన అనూ... ‘బాలీవుడ్‌ కథానాయిక అంటే ఇలానే ఉండాలి’ అనే కొలమానాలకు భిన్నం. ఆమె అప్పీయరెన్స్‌ వెండితెరకు కొత్తదనాన్ని తెచ్చింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె... బడి రోజుల్లోనే నటన ప్రారంభించింది. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి థియేటర్‌ గ్రూప్‌ ఒకటి నెలకొల్పి, ఒక నాటకానికి తనే దర్శకత్వం వహించి నటించింది. క్రమంగా స్ర్కిప్ట్‌ కూడా రాసింది. బోర్డ్‌ పరీక్షల కోసం కొన్నాళ్లు నటనకు బ్రేక్‌ ఇచ్చిన అనూ... ‘ఢిల్లీ యూనివర్సిటీ’లో సోషియాలజీ చదివింది. అందులో గోల్డ్‌ మెడల్‌ కూడా అందుకుంది. సినీ నటి కావాలని ఏ రోజూ ఆమె అనుకోలేదు. మొదట మోడలింగ్‌, వీజేయింగ్‌ చేసింది. అవకాశం వస్తే... 1988లో దూరదర్శన్‌ సీరియల్‌ ‘ఇసీ బహానే’తో మొదటిసారి తెరపై కనిపించింది. అది చూసి ఆమెకు బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. అలా ‘ఆషికీ’ చిత్రంతో అరంగేట్రంలోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న అనూ... రాత్రికి రాత్రి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

జీవితం తలకిందులు...

చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న అనూ... తన గమ్యాన్ని మార్చుకుని యోగా వైపు అడుగులు వేసింది. వెలుగుజిలుగులకు దూరంగా జీవించడం ప్రారంభించింది. అదే సమయంలో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 1999లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె... ఇరవై తొమ్మిది రోజులు కోమాలోనే ఉంది. అప్పుడామెకు ముప్ఫై ఏళ్లు. కోలుకున్నాక తన గతమేదీ ఆమెకు గుర్తుకురాలేదు. సగం శరీరం చచ్చుబడిపోయింది. ఎన్నో సర్జరీలు, భరించలేని నొప్పులు... నిద్రలేని రాత్రులు... ఆ గాయాలు మానడానికి కొన్నేళ్లు పట్టింది.

పునర్జన్మ...

2001లో సన్యాసినిగా మారిన అనూ... ఆరేళ్లపాటు అదే జీవితాన్ని గడిపింది. ఆ క్రమంలోనే యోగా, స్వీయ ప్రేమ, స్వీయ అవగాహన వల్ల జరిగే అద్భుతాలను తెలుసుకుంది. సానుకూల దృక్పథంతో ముందడుగు వేసింది. అవే తనకు పునర్జన్మ ప్రసాదించాయి అంటుంది అనూ. మృత్యువుతో, మానసిక సమస్యలతో పాతికేళ్లు పోరాడిన ఆమె ఇవాళ మనముందు ఒక స్ఫూర్తి శిఖరంలా నిలబడిందంటే... నిజంగా ఇది ఒక అద్భుతం. ఇన్నేళ్ల తరువాత, 55 ఏళ్ల వయసులో మళ్లీ నటించి మురిపించేందుకు సిద్ధమైన అనూ... ఆలోచన, ఆచరణ ఎప్పుడూ భిన్నంగా, కొత్తగా ఉంటుంది.

జీవన గమనం... అక్షర రూపం...

‘‘నాకు మూడేళ్లప్పుడు... ఇంట్లో ఉన్న అమ్మ బ్యాగ్‌ తగిలించుకుని బయటకు వెళ్లాను. ఒక్కదాన్నే రోడ్డు మీద నడుస్తున్నా. ఆ బ్యాగ్‌ నాకంటే పెద్దగా ఉండేది. రోడ్డు దాటడానికి నేను పడుతున్న ఇబ్బంది గమనించిన ఒకాయన వచ్చి... ‘ఎక్కడికి వెళుతున్నావు’ అని అడిగారు. ‘షాపింగ్‌కు వెళుతున్నా’ అన్నాను తడుముకోకుండా. మానవత్వం ఉన్న ఆయన నన్ను జాగ్రత్తగా తీసుకువచ్చి ఇంట్లో దిగబెట్టారు. అప్పటికే మా అమ్మ గుండె ఆగినంత పని అయింది’’ అంటూ చిన్ననాటి సంఘటన గుర్తు చేసుకున్న అనూ అడుగులు ఎప్పుడూ అనూహ్యంగా, నిర్భయంగా ముందుకు పడతాయి. సగటు అమ్మాయి ఆలోచనలకు భిన్నంగా... కొత్తదనాన్ని వెతుక్కొంటూ వెళతాయి. అనుకోకుండా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. దేశవిదేశాల్లో మోడలింగ్‌ అనుభవం సినీ అవకాశాన్ని తెచ్చింది. విజయం రుచి చూసినా... ఏ రోజూ తనను తాను పరిశ్రమ వ్యక్తిగా భావించలేదు. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగానే జీవించింది. నటిగా ఎదురైన ఇబ్బందులు, సమస్యలను తనే పరిష్కరించుకునే ప్రయత్నం చేసింది.

‘సంతోషంగా లేని సమయం’...

అనూ అగర్వాల్‌ తన ‘అన్‌యూజువల్‌: మెమైర్‌ ఆఫ్‌ ఎ గర్ల్‌ హూ కేమ్‌ బ్యాక్‌ ఫ్రమ్‌ డెడ్‌’ పుస్తకంలో తన సినీ జీవితాన్ని ‘సంతోషంగా లేని సమయం’గా పేర్కొంది. ‘ఒక్కసారిగా వచ్చి మీదపడిన స్టార్‌డమ్‌, ప్రాజెక్ట్‌లు, అనాదిగా కొనసాగుతున్న మూస పద్ధతులు, బాలీవుడ్‌లోని చీకటి కోణం, లోపించిన సృజనాత్మకత... ఆర్ట్‌ ఆఫ్‌ ఫిలిమ్‌ మేకింగ్‌ నుంచి వచ్చిన నేను వీటన్నిటిలో ఇమడలేకపోయాను. నన్ను నేను తెలుసుకోవాలనే ఆలోచనతో పరిశ్రమ నుంచి బయటకు వచ్చాను. నటిగానే కాకుండా జీవితంలో నా పాత్ర ఏంటి? దాన్ని వెతుక్కొంటూ యోగా వైపు అడుగులు వేశాను. అదే నాకు జీవన విధానాన్ని నేర్పింది. ఎంతో ఉపశమనం ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది అనూ. ఆడంబరాలు, పెద్ద పెద్ద కోరికలు లేకుండా విలువలతో జీవించడమే అసలైన జీవనమార్గం అంటున్న అనూ అగర్వాల్‌... నేడు దేశవిదేశాల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎన్నో ప్రసంగాలు ఇస్తూ, ప్రేరణ కలిగిస్తోంది.

చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న అనూ... తన గమ్యాన్ని మార్చుకుని యోగా వైపు అడుగులు వేసింది. వెలుగుజిలుగులకు దూరంగా జీవించడం ప్రారంభించింది. అదే సమయంలో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.

Updated Date - Mar 28 , 2024 | 04:47 AM