Share News

సవాళ్ళకు ఎదురొడ్డి పతకాలు పట్టి

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:27 AM

ఉదయం ఒక ఈవెంట్‌లో బంగారు పతకం... సాయంత్రం మరో ఈవెంట్‌లో స్వర్ణంతో పాటు జాతీయ రికార్డ్‌... లఖనవూలో ఇటీవల జరిగిన నేషనల్‌ జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో ఏక్తా ప్రదీప్‌ డే సాధించిన ఘనతలివి. అడుగడుగునా అవరోధాలు ఎదురైనా...

సవాళ్ళకు ఎదురొడ్డి పతకాలు పట్టి

ఉదయం ఒక ఈవెంట్‌లో బంగారు పతకం... సాయంత్రం మరో ఈవెంట్‌లో స్వర్ణంతో పాటు జాతీయ రికార్డ్‌... లఖనవూలో ఇటీవల జరిగిన నేషనల్‌ జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో ఏక్తా ప్రదీప్‌ డే సాధించిన ఘనతలివి. అడుగడుగునా అవరోధాలు ఎదురైనా... దృఢసంకల్పంతో వాటిని ఎదుర్కొన్న ఏక్తా ఇప్పుడు అథ్లెటిక్స్‌లో భారత్‌కు సరికొత్త ఆశాకిరణంగా ప్రశంసలందుకుంటోంది.

భోపాల్‌లోని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ అకాడమీ. కొన్ని నెలల క్రితం జరిగిన ట్రయల్స్‌లో పాల్గొనడానికి రాష్ట్రస్థాయి క్రీడాకారులు సిద్ధమయ్యారు. వారిలో ఒకరైన ఏక్తా ప్రదీప్‌ డే తన కాళ్ళవైపు చూసుకుంది. ఆమె వేసుకున్న షూస్‌ చిరిగిపోయి, అడుగు భాగం ఊడి వచ్చేలా ఉన్నాయి. ‘అలాంటి షూస్‌తో... తోటి అథ్లెట్లను అధిగమించి పరిగెత్తగలనా?’ అనే సందేహం ఆమెకు లేదు. ‘ఎంత వేగంగా లక్ష్యాన్ని చేరుకోగలను?’ అనేదే ఆమె ఆలోచనంతా. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలు, వీధిలో అవహేళనల వరకూ ఎన్నో అనుభవాలను ఎదుర్కొంది. కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం ఎప్పుడూ చెక్కుచెదరలేదు.

ప్రతి వస్తూవూ తాకట్టు పెట్టి...

ఏక్తాది భోపాల్‌లో స్థిరపడిన బెంగాలీ కుటుంబం. రెండు గదుల ఇంట్లో... తల్లి, తండ్రి, తోబుట్టువులతో నివాసం. రెండు పూటలా తిండి కూడా గగనం. ‘‘అలాంటి పరిస్థితుల్లో అథ్లెట్‌ కావాలని నేను కన్న కలను నెరవేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాను’’ అంటుంది ఏక్తా. వారు నివసించే పంచశీల్‌నగర్‌ ప్రాంతం దొంగ సారా, మాదక ద్రవ్యాలకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా పేరుపొందింది. ఆమె ప్రాక్టీ్‌సకు వెళ్తుంటే... పోకిరీలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసేవారు. ‘‘అన్నిటినీ సహనంతో దిగమింగుకొనేదాన్ని. పాఠశాల, జిల్లా స్థాయిలో సాధించిన విజయాలు ఎప్పటికప్పుడు నాకు ఉత్తేజం కలిగించేవి. పరిగెత్తడానికి సరైన షూస్‌ ఉండేవి కావు. సెకెండ్‌ హ్యాండ్‌ షూస్‌ కొనడం కూడా కష్టమయ్యేది. కానీ నా కుటుంబం నా మీద ఎంతో నమ్మకం ఉంచింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యానని తెలిసినప్పుడు... మా నాన్న మా ఇంట్లో కాస్త విలువైన ప్రతి వస్తువూ తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు. అప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు’’ అంటుంది ఏక్తా.

ఇది ఎప్పటికీ ప్రత్యేకం...

కష్టాలు ఆమెను మరింత రాటుదేల్చాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ప్రతికూలతలు ఎదురైనప్పుడు పట్టుదలగా ఎదురు నిలవడం తన తత్వంగా మార్చుకుంది. కోచ్‌ శివకుమార్‌ ప్రసాద్‌ ఆమె నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. పోటీలకు సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రోత్సాహంతో ట్రయల్స్‌లో సెలక్టయిన ఏక్తా... ఈ నెల 10న లక్నోలో జరిగిన నేషనల్‌ జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో పాల్గొంది. ‘‘ఒకే రోజు రెండు పెద్ద ఈవెంట్లలో ఆమె రాణించగలదా? అని అనుకున్నాను. కానీ ఆమె అంకితభావం గొప్పది’’ అంటారు శివకుమార్‌. ఆ రోజు ఉదయం జరిగిన 5000 మీటర్ల ఈవెంట్‌లో ఏక్తా బంగారు పతకం గెలుచుకుంది. సాయంత్రం అండర్‌-20 గర్ల్స్‌ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంట్‌లోనూ గోల్డ్‌మెడల్‌ సాధించడమే కాదు... జాతీయ రికార్డ్‌ నెలకొల్పింది. పతకాలు గెలుస్తాననే ధీమా ఉంది. కానీ రెండు స్వర్ణాల్ని గెలవడం, ఒక జాతీయ రికార్డు సాధించడం... ఇవన్నీ ఒకే రోజు జరగడం నమ్మశక్యంగా అనిపించలేదు’’ అంటోంది ఏక్తా. ‘‘పోటీలు ముగిసి ఇంటికి వెళ్ళినప్పుడు స్థానికులు ఆహ్వానించిన తీరు నా కష్టాలన్నిటినీ మరపించింది. నన్ను ఆటపట్టించినవారు ఇప్పుడు ఎంతో మర్యాదగా చూస్తున్నారు. ఇక మా అమ్మా, నాన్న సంతోషాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు’’ అని ఆమె చెబుతోంది. భారత అథ్లెటిక్స్‌ ఆశాకిరణంగా ప్రశంసలందుకుంటున్న ఏక్తా దుబాయ్‌లో జరగబోయే అండర్‌-20 ఏషియన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌ప, పెరూ రాజధాని లిమాలో జరగనున్న అండర్‌-20 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షి్‌పలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ‘‘దేశం తరఫున ఆడి, పతకాలు సాధించాలనేది నా లక్ష్యం్త’’ అంటుంది ఏక్తా.

Updated Date - Mar 27 , 2024 | 05:28 AM