Share News

Story : ఒకరిని మించి మరొకరు..

ABN , Publish Date - Feb 18 , 2024 | 05:00 AM

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని కర్కల్‌ అనే రాజు పాలించేవాడు. అతనికి శిల్పాలంటే మహా ఇష్టం. ఆ రాజ్యంలోనే అమరుడు అనే ఓ గొప్ప శిల్పి ఉండేవాడు. అతని గొప్ప ప్రతిభ విని

Story : ఒకరిని మించి మరొకరు..

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని కర్కల్‌ అనే రాజు పాలించేవాడు. అతనికి శిల్పాలంటే మహా ఇష్టం. ఆ రాజ్యంలోనే అమరుడు అనే ఓ గొప్ప శిల్పి ఉండేవాడు. అతని గొప్ప ప్రతిభ విని రాజ్యానికి పిలిపించి రాచమర్యాదలు చేశాడు. అమరుడికి అర్థం కాలేదు. ఆ తర్వాత రాజు ఇలా అన్నారు.. ‘అమరుడా.. నీ శిల్ప చాతుర్యం తెలుసు. ఈశ్వరుడి విగ్రహం 25 అడుగులు కావాలి’ అని అడిగాడు. ‘ఓస్‌ అదెంతపని’ అన్నాడు. ధనం ఇస్తూనే శిల్పి ఇంటికి వెళ్లిపోయి ఆ పనిలో పడ్డాడు. రాత్రిం పగలు కష్టపడ్డాడు. పరమేశ్వరుడి విగ్రహాన్ని అందంగా చెక్కాడు. కొన్ని నెలల కష్టం అతనిది. ఆ విగ్రహాన్ని చూసి రాజుగారు మురిసిపోయారు. ‘ఇంతటి గొప్ప వ్యక్తి నా దేశంలో ఉండటం గర్వకారణమే’ అంటూ పొగిడాడు. ఆ శిల్పాన్ని చూసి ఇంత ఎత్తు అయిన శిల్పం చెక్కడం కష్టం.. పరమశివుడు ఎంత బావున్నాడో.. అంటూ జనాలు పొంగిపోయారు. రాజుగారికి పేరు రావటంతో.. మరింత సొమ్ము బంగారు నాణేలను ఇచ్చాడు ఆ శిల్పికి. ఇక సెలవని శిల్పి బయలుదేరాడు.

శిల్పి బయలుదేరగానే రాజుగారికి దుర్బుద్ధి పుట్టింది. ఇతడు ఈ విగ్రహం కంటే పెద్దది చేస్తే ఎలా? అనుకున్నాడు. వెంటనే భటలను పంపించి అతని కుడిచేయి తీయించాడు. ఖచ్చితంగా కుడిచేయి లేకుంటే పని చేయలేడని రాజుగారి ఆలోచన. రాజుగారి ద్రోహాన్ని చూసి శిల్పికి ఒళ్లు మండింది. కోపంతో రగిలిపోయాడు. మంచికి కాలం లేదనుకున్నాడు. వెంటనే కర్కల్‌కు శతృవు అయిన కుమారుడు అనే రాజు దగ్గరకు వెళ్లాడు. తన బాధను వెళ్లగక్కాడు. ‘చేయి లేదా?’ అన్నాడు రాజు. ‘నా సత్తువు పోదు. ఎడమ చేయి ఉంది కదా?’ అన్నాడు శిల్పి. రాజుమీద కోపం కక్కాడు. ‘అయితే నాకు ముప్ఫయి అడుగుల కాళికాదేవి విగ్రహం కావాలి’ అన్నాడు. శిల్పి ‘సరే’ అన్నాడు. అందుకు తగిన డబ్బును ఇచ్చాడు రాజుగారు. ఇంటికి పోయి మరింత రెట్టించిన ఉత్సాహంతో.. ఎప్పటిలానే తన తోటి శిల్పుల సహాయంతో అందంగా చెక్కాడు విగ్రహాన్ని. ఆ విగ్రహం చెక్కుతూనే అందరూ అక్కడికి వచ్చి వేనోళ్ల పొగిడారు. గొప్ప విజయంగా భావించాడు రాజు. శిల్పి ఆనందానికి అవధుల్లేవు.

ఈ కాళికా విగ్రహం చూడటానికి విదేశాల నుంచి వస్తామని కబురొచ్చింది. రాజుగారు గర్వపడ్డారు. వారం దాటిన తర్వాత రాజుగారికి కర్కల్‌ రాజులానే ఆలోచన వచ్చింది. ఇంతకంటే పెద్ద విగ్రహాన్ని కడితే ఎలా? అనుకున్నాడు. భటులను పంపించి.. శిల్పిగారి ఎడమ చేతిని కూడా తీయించాడు. దీంతో శిల్పికి మరింత కోపం వచ్చింది. రాజులనేమీ చేయలేడు కదా. ఏడుస్తూ కూర్చున్నాడు. నిద్రపట్టలేదు. రాజుల ద్రోహం ఇలా ఉంటుందా? ప్రతిభకు పట్టం కట్టరా? అంటూ రాత్రంతా మేల్కొన్నాడు. ఉదయాన్నే వింధ్య ప్రాంతం వైపు వెళ్లాడు. అక్కడ శేషుడు అనే రాజు ఉన్నాడు. అతని దగ్గరకు పోయి తన బాధను వెళ్లగక్కాడు. ‘ఇంకేమి చేయగలవు’ అన్నాడు. ‘నా చేతులు పోయాయి కానీ బుర్ర ఉంది కదా..’ అన్నాడు. వెంటనే శేషుడు ఇలా అన్నాడు.. ‘శివపార్వతుల శిల్పాలు కావాలి. అది కూడా యాభై అడుగులు కావాలి’ అన్నాడు. ఆ ఇద్దరు రాజులు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. రాజుగారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని వెళ్లి నెలల పాటు శ్రమించి అద్భుతమైన శివపార్వతుల విగ్రహాలు చెక్కాడు. ఆ యాభై అడుగుల విగ్రహం చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో శేషుడు కూడా మునుపటి రాజుల్లానే ఆలోచించాడు. యాభై అడుగుల విగ్రహం నా రాజ్యంలోనే ఉండాలనుకున్నాడు. వెంటనే భటులను ఆజ్ఞాపించి ఆ శిల్పి శిరస్సును ఖండించమన్నాడు. అలా శిల్పి కథ ముగిసింది.

Updated Date - Feb 18 , 2024 | 05:00 AM