Share News

మనసంతా భారతీయ చిత్రమే

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:34 AM

ఇది ఒక ‘చిత్ర’మైన కథ. భారతీయ సినిమా ప్రచారానికి జపాన్‌లో అనధికారిక రాయబారిగా వ్యవహరిస్తున్న ఓ మహిళ కథ. సంజీవ్‌కుమార్‌, ముంతాజ్‌ల ‘ఖిలోనా’తో మొదలైన ఈ అనుబంధం... ఐదు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి యాభైసార్లకు పైగా భారత్‌కు వచ్చి... మన చిత్రానికి తన దేశంలో పట్టం కడుతున్న జపాన్‌ సినీ ప్రేమికురాలు టమకి మత్సువోక కథ ఇది...

మనసంతా భారతీయ చిత్రమే

ఇది ఒక ‘చిత్ర’మైన కథ. భారతీయ సినిమా ప్రచారానికి జపాన్‌లో

అనధికారిక రాయబారిగా వ్యవహరిస్తున్న ఓ మహిళ కథ. సంజీవ్‌కుమార్‌, ముంతాజ్‌ల ‘ఖిలోనా’తో మొదలైన ఈ అనుబంధం... ఐదు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికి యాభైసార్లకు పైగా భారత్‌కు వచ్చి... మన చిత్రానికి తన దేశంలో పట్టం కడుతున్న

జపాన్‌ సినీ ప్రేమికురాలు టమకి మత్సువోక కథ ఇది...

సగటు సినీ ప్రియులకు భిన్నం టమకి మత్సువోక. ఆమె దృష్టిలో సినిమా అంటే థియేటర్‌ బయటకు రాగానే మరిచిపోయే ఒక వినోద సాధనం మాత్రమే కాదు... ఎన్నో భావోద్వేగాలతో ముడిపడిన బంధం. మల్టీప్లెక్స్‌లు విస్తరించిన యుగంలోనూ సంప్రదాయ సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల వైపు చూసే ఆమెకు... భారతీయ చిత్రాలు అంటే ఎనలేని మక్కువ... ప్రేమ. అంతేకాదు... భారతీయ సంస్కృతి, సంప్రదాయాలన్నా టమకీకి గౌరవం. ఆ ఇష్టంతోనే ఇప్పటికి యాభైసార్లకు పైగా భారత్‌కు వచ్చి వెళ్లారు. ఒలింపస్‌ కెమెరా ఒకటి ఎప్పుడూ ఆమె చేతిలో ఉంటుంది. ‘సినీ’ విశేషాలన్నిటినీ ఆ లెన్స్‌లో బంధించడం ఆమెకు అలవాటు. ఇటీవల ముంబయికి వచ్చిన ఆమె... నగరమంతా తిరుగుతూ చాలా బిజీగా కనిపించారు. ప్రతి కార్యక్రమంలోనూ చక్కని చీర కట్టులో ఆకట్టుకున్నారు.

కథ మార్చిన కథలు...

ఇంతకీ మన చలన చిత్రాలంటే అంతటి ఇష్టం ఆమెకు ఎందుకు కలిగింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది తెలియాలంటే... ఒకసారి టమకి యుక్త వయసులోకి వెళ్లాలి. అది 1967. జపాన్‌ ‘ఒసాకా యూనివర్సిటీ ఆఫ్‌ ఫారిన్‌ స్టడీస్‌’ (ఓయూఎ్‌ఫఎ్‌స)లో చదివే రోజులు. ఒక రోజు ప్రొఫెసర్‌ రెండు దిన పత్రికలు తీసుకువచ్చి విద్యార్థుల ముందు పెట్టారు. ‘ఈ రెండిటిలో మీరు ఏ భాష చదవాలనుకొంటున్నారు’ అని ప్రొఫెసర్‌ అడిగారు. వాటిల్లో ఒకటి హిందీ పత్రిక కాగా, రెండోది ఉర్దూ. ‘చూడ్డానికి కాస్త సులువుగా అనిపించి హిందీని ఎంచుకున్నా. తరువాత ప్రేమ్‌చంద్‌ కథలు చదవమని మా ప్రొఫెసర్‌ చెప్పారు. ఆ కథలే నా కథను మార్చేశాయి. భారతీయ సంస్కృతిపై మక్కువ, ఆసక్తి కలిగించాయి’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు టమకి.

మరో మలుపు...

అంతటితో అయిపోలేదు. ఎంఏ హిందీ లిటరేచర్‌ కోసం 1971లో ‘టోక్యో యూనివర్సిటీ ఆఫ్‌ ఫారిన్‌ స్టడీస్‌’ (టీయూఎ్‌ఫఎ్‌స)లో చేరారు టమకి. అక్కడ ఆమెకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ‘‘నువ్వు హిందీ బాగా చదువుతున్నావు. రాస్తున్నావు. కానీ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నావు. విన్నది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. భాషలో మెరుగవ్వాలంటే థియేటర్‌కు వెళ్లి హిందీ చిత్రాలు చూడు’ అని ప్రొఫెసర్‌ సూచించారు. అప్పట్లో భారత ఎంబసీ జపాన్‌లోని భారతీయుల కోసం ఏడాదికి ఒకసారి హిందీ చిత్రాలు ప్రదర్శించేది. అలా ‘ఖిలోనా’ చూశాను. అందులో సంజీవ్‌కుమార్‌ నటన నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తంగా కథ, కథనం బాగా నచ్చాయి. అది మొదలు... భారతీయ చిత్రాలే కాదు, సంస్కృతి, సంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి అధికమైంది’’ అంటూ నాటి సంగతులు చెప్పుకొచ్చారు టమకి.

ఇక్కడి చిత్రం... అక్కడ ఉత్సవం...

ఎప్పుడు భారత్‌ వచ్చినా సింగిల్‌స్ర్కీన్‌ థియేటర్‌లో సినిమా వీక్షించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు టమకి. వాటిల్లో చూసిన అనుభూతి మల్టీప్లెక్స్‌ల్లో రాదంటారు. ఈ యాభై ఏళ్ల భారత ప్రయాణంలో రెండొందలకు పైగా సినీ పాటల పుస్తకాలు, స్ర్కిప్ట్స్‌, పోస్టర్లు, ప్రమోషనల్‌ బుక్‌లెట్స్‌ ఎన్నో సేకరించి భద్రపరుచుకున్నారు. కొన్నిటిని ‘ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌’ (ఎఫ్‌హెచ్‌ఎ్‌ఫ)కు విరాళంగా ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా కొన్నేళ్లుగా జపాన్‌లో భారతీయ చిత్రోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు టమకి. వాటిల్లో ఒక్క హిందీనే కాకుండా ఇతర భారతీయ భాషా చిత్రాలు కూడా ఉన్నాయి.

‘గతంలో సత్యజిత్‌రే చిత్రాలను ఆదరించిన జపాన్‌వాసులు ప్రస్తుతం దక్షిణభారత సినిమాలపై మక్కువ చూపుతున్నారు. వాటిల్లో ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రముఖంగా ఉన్నాయి’ అంటారామె. జపాన్‌ ప్రేక్షకులకు, భారతీయ ప్రేక్షకులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటని అడిగితే... ‘సినిమాను వీక్షించే విధానం’ అంటారు టమకి. ‘భారతీయ ప్రేక్షకులు సినిమాను ఆసాంతం ఆస్వాదిస్తారు. నవ్వుతారు. బాధపడతారు. ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు. కానీ జపాన్‌లో ప్రేక్షకులు నిశ్శబ్దంగా చూసి బయటకు వస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు టమకి. ఆమెకు బాగా ఇష్టమైన డైలాగ్‌ ‘అచ్చా తో హమ్‌ చల్‌తీ హై’. దీన్ని ఆమె ‘గుడ్‌బై గ్రీటింగ్‌’గా ఉపయోగిస్తారు.

‘షోలే’కు అభిమాని...

టమకి ఆసక్తి భారతీయత వైపు మళ్లిన సమయంలోనే... టీయూఎఫ్‌ఎస్‌లో కోర్సును అర్థంతరంగా ఆపేశారు. అదే వర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ లాంగ్వేజస్‌ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ఆసియా అండ్‌ ఆఫ్రికా’ (ఐఎన్‌సీఏఏ)లో చేరి, పరిశోధన మొదలుపెట్టారు. అందులో భాగంగానే 1975లో తొలిసారి ఆమె ముంబయికి వచ్చారు. లిబర్టీ థియేటర్‌లో రాజ్‌కపూర్‌, సులోచనా చటర్జీ నటించిన ‘జాగ్తే రహో’ చూశారు.

అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి ఆరు హిందీ చిత్రాలు వీక్షించారు. వాటిల్లో అమితాబ్‌ ‘జంజీర్‌’, ‘షోలే’ కూడా ఉన్నాయి. నాటి నుంచి టమకి యాభైసార్లకు పైగా భారత్‌కు వచ్చారు. ‘1980లో నా అభిమాన నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించింది. మేమిద్దరం హిందీలోనే మాట్లాడుకున్నాం’ అంటున్న టమకి ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ చిత్రం ‘షోలే’.

Updated Date - Mar 27 , 2024 | 05:34 AM