Share News

అందాల పోటీల్లో సౌదీ బ్యూటీ

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:49 AM

సౌదీ అరేబియా, మొట్టమొదటిసారిగా ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లో పాల్గొనబోతోంది. సెప్టెంబరు 18న మెక్సికోలో జరగబోతున్న ఈ అంతర్జాతీయ పోటీలో, ఆ దేశం

అందాల పోటీల్లో సౌదీ బ్యూటీ

సౌదీ అరేబియా, మొట్టమొదటిసారిగా ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌

అందాల పోటీల్లో పాల్గొనబోతోంది. సెప్టెంబరు 18న మెక్సికోలో జరగబోతున్న ఈ అంతర్జాతీయ పోటీలో, ఆ దేశం

తరఫున 27 ఏళ్ల రూమీ అల్‌కతానీ పాల్గొనబోతోంది. ఈ అందాల

రాశి గురించిన విశేషాలు.

‘‘మిస్‌ యూనివర్స్‌ 2014 పోటీల్లో పాల్గొనబోతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. సౌదీ అరేబియా మిస్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి’’ అంటూ రూమీ అందాల పోటీల గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. రియాద్‌లో పుట్టిన రూమీ... మోడల్‌, కంటెంట్‌ క్రియేటర్‌గా పేరు తెచ్చుకుంది. గత ఏడాది బహ్రెయిన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, లుహానే యాకూబ్‌ అనే ముద్దుగుమ్మ మిస్‌ యూనివర్స్‌లో పాల్గొంది. ఆవిడ అడుగుజాడలనే అనుసరిస్తూ ఈ ఏడాది సౌదీ అరేబియా నుంచి రూమీ అల్‌కతానీ ఈ అందాల పోటీల్లో పాల్గొనబోతూ ఉండడం విశేషం!

ఆదరణకు కొదవ లేదు

రూమీ అల్‌కతానీ సౌదీ మహిళల స్వయం స్వావలంబన కోసం ఎంతో కాలంగా కృషి చేస్తోంది. గతంలో, మిస్‌ ఏసియా ఇన్‌ మలేసియా, మిస్‌ అరబ్‌ పీస్‌, మిస్‌ యూరప్‌ మొదలైన ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో రూమీ సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహించింది. మిస్‌ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న రూమీ, మిస్‌ మిడిల్‌ ఈస్ట్‌ (సౌదీ అరేబియా), మిస్‌ అరబ్‌ వరల్డ్‌ పీస్‌ (2021), మిస్‌ ఉమన్‌ (సౌదీ అరేబియా)గా కూడా గెలుపొందింది. ఇన్‌స్టాలో పది లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న రూమీకి ఇతర సామాజిక మాధ్యమాల్లో కోట్లకొద్దీ అభిమానులున్నారు. డెంటిస్ట్రీలో బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉన్న ఈ అమ్మడు, ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, అరబిక్‌ భాషలను ధారళంగా మాట్లాడగలుగుతుంది.

అతని చలవే!

యువరాజు, 32 ఏళ్ల మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌, విజన్‌ 2020లో భాగంగా, సౌదీలోని మహిళలకు ఎన్నో సౌలభ్యాలను కల్పించాడు. 2017లో క్రౌన్‌ ప్రిన్స్‌గా ఎంపికైనా మొహమ్మద్‌, అప్పటి నుంచి ఆ దేశంలో ఎన్నో ఆర్థిక, సామాజిక మార్పులకు పూనుకున్నాడు. ఇప్పుడు సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలను నడపగలుగుతున్నారు. పురుషులతో సమానంగా బహిరంగ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారు. పురుష గార్డియన్‌ అనుమతితో పని లేకుండా పాస్‌పోర్టులను పొందగలుగుతున్నారు. ఇలా సినిమాలు, మిక్స్‌డ్‌ జెండర్‌ వేడుకల మీద కూడా నిషేధాన్ని ఎత్తివేసిన సౌదీ అరేబియా, పాతకాలపు సంప్రదాయ నిబంధనల నుంచి బయటపడి, గణనీయమైన స్వేచ్ఛ వైపు అడుగులు వేయడం హర్షణీయం.

Updated Date - Mar 28 , 2024 | 04:49 AM