Share News

ఆ ఆలోచన వందల జీవితాలు మార్చేసింది!

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:50 AM

ఒక్క ఆలోచన చాలాసార్లు జీవితాలను మార్చేస్తుంది. రష్మి సావంత్‌కు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే కాదు... కడలిని నమ్ముకొని, దాని సమీపంలో నివసిస్తున్న అనేక మంది జీవితాలను మార్చేసింది. ఆమె

ఆ ఆలోచన వందల  జీవితాలు మార్చేసింది!

ఒక్క ఆలోచన చాలాసార్లు జీవితాలను మార్చేస్తుంది.

రష్మి సావంత్‌కు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే కాదు...

కడలిని నమ్ముకొని, దాని సమీపంలో నివసిస్తున్న అనేక మంది జీవితాలను మార్చేసింది. ఆమె ప్రారంభించిన ‘కల్చర్‌ ఆంగన్‌’- మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాల పర్యాటక రంగాలలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది.

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ ప్రాంతంలో మడ అడవులు ఎక్కువ. వాటి వల్ల ఆ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. కానీ వారందరికీ ఆతిఽథ్యం ఇచ్చే సంస్థలు తక్కువ. ఒక వైపు పర్యాటకులకు ఆతిథ్యం అందిస్తూనే- ఆర్థిక సాధికారతను సాధించటానికి ఉద్దేశించిన కార్యక్రమమే రిష్మి సావంత్‌ ప్రారంభించిన ‘కల్చర్‌ ఆంగన్‌’. ‘‘2013లో నాకు ఈ ఆలోచన వచ్చింది. మాండవి దగ్గర అందమైన మడ అడవులు ఉంటాయి. కానీ ఆ ప్రాంతంలో నివసించే బేస్తా వారు- చేపలు పట్టుకోవటానికి మాత్రమే అవి పరిమితమై ఉండేవి. ఆ ప్రాంతానికి పర్యాటకులను తీసుకువచ్చి... ప్రకృతి అందాలను చూపిస్తే- రెండు ప్రయోజనాలు ఉంటాయనుకున్నాం. వీటిలో మొదటిది- మడ అడవులు నాశనం కాకుండా ఉంటాయి. రెండోది- స్థానికంగా నివసించే వారికి ఆర్థిక స్వావలంబన కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని- ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌’ (యూఎన్‌డీపీ)కు ఒక ప్రతిపాదన పంపాను’’ అంటారు రష్మి. 2016లో యూఎన్‌డీపీ ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ స్థానిక మహిళలతో మాట్లాడారు. తొమ్మిది మంది మహిళలతో ‘స్వామిని’ అనే స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి వచ్చే టూరిస్టులకు మడ అడవుల అందాలను చూపించటం వీరి పని. ఈ బృందం ప్రస్తుతం ఏడాదికి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ‘‘సముద్ర తీరాల్లో, మడ అడవుల సమీపంలో ఉన్న మహిళలకు కొద్ది సేపు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన సమయాన్ని వారు సమర్థంగా వాడుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈ ఆలోచనకు రూపమే నేను ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు’’ అంటారు రష్మి.

మొదలయింది ఇలా..

రష్మి పుట్టింది, పెరిగింది ముంబాయిలో. ఆమె భర్త ఒక ట్రావెల్‌ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. పెళ్లైన కొత్తల్లో ఆమె తన భర్తతో కలిసి అనేక గ్రామాలకు వెళ్లేవారు.. అక్కడ అనేక మంది మహిళలను కలిసేవవారు. ‘‘చాలామంది రోజువారి సంపాదనపైనే బతుకుతూ ఉండేవారు. కొందరికైతే నెలకు పది రూపాయలు దాచటం కూడా కష్టమయ్యేది. ఆ సమయంలో నాకు హోం స్టేలను ప్రొత్సహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది’’ అంటారు రష్మి. ఆమెకు ఆ ఆలోచన రావటానికి కూడా ఒక కారణం ఉంది. 2000 సంవత్సరంలో రష్మి- ‘ఎడిన్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌’కు వెళ్లి- అక్కడ ఒక హోం స్టేలో ఉన్నారు. తమ ఇంట్లో ఒక రూమ్‌ను అద్దెకు ఇచ్చి, వంట వండి పెట్టడం ద్వారా ఆ హోం స్టే యజమానురాలు చాలా సంపాదిస్తున్న విషయాన్ని రష్మి గమనించారు. మన వాళ్లు కూడా అదే పని చేస్తే- వారికి కూడా సంపాదన పెరుగుతుందనే ఆలోచన రష్మికి వచ్చింది. ఎంత మంది తన ఆలోచనకు స్పందిస్తారో చూడటానికి ఆమె - ఒక స్థానిక పత్రికలో ప్రకటన ఇచ్చారు. దానికి సుమారు 50 మంది సానుకూలంగా స్పందించారు. దేవగఢ్‌ అనే ప్రాంతానికి చెందిన- వైశాలి, విజయ్‌ లోకే అనే దంపతులు- ముందుకు వచ్చి ‘పితృఛాయ’ అనే హోంస్టేని ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే దానికి విపరీతమైన ఆదరణ లభించింది.

అదే చాలదు...

అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఉండటానికి ఇల్లు. చూడటానికి కొన్ని ప్రదేశాలు ఉంటే చాలదు. స్థానికంగా వారికి అదనపు ఆకర్షణలు కావాలి. అవి వారి మనసులను దోచుకోవాలి. ‘‘ఇలా ఆలోచిస్తున్న సమయంలో- నేను ఒక రోజు పింగుళి అనే ఒక గ్రామానికి వెళ్లా. ఆ గ్రామం తోలుబొమ్మలాటలకు ప్రసిద్ధి. అక్కడ నివసించే అనేక కుటుంబాలు ఆ వృత్తిపైనే బతుకుతూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ కాలం నుంచి వారు ఈ వృత్తిలోనే ఉన్నారని చెబుతారు. కానీ సరైన ఆదరణ లేక ఆ వృత్తిలోకి ఎవరు రావటం లేదని విన్నా. దాంతో టూరిస్టులను ఈ ప్రాంతానికి తీసుకువస్తే- ఒక వైపు అంతరించిపోతున్న తోలుబొమ్మలాట కళ తిరిగి బతుకుతుందనీ, మరో వైపు టూరిస్టులకు అదనపు ఆకర్షణ దొరుకుతుందనీ ఆలోచించా’’ అంటారు రష్మి. స్థానికుల సహకారంతో రష్మి- ‘ఠక్కర్‌ ఆదివాసీ లోక్‌ కళా మ్యూజియం’ను స్థాపించారు. స్థానిక కళాకారులకు శిక్షణ ఇప్పించటం.. టూరిస్టులను అదనపు సౌకర్యాలు కల్పించటం మొదలుపెట్టారు. ‘‘మహిళలకు వంట వండటం సహజంగానే వస్తుంది. ఆ నైపుణ్యాన్ని సక్రమంగా వాడితే వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని- ‘హిర్‌కాని’ అనే కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించాం. దీనిలో సుమారు 300 మంది సభ్యులుగా చేరారు. వీరు ఆహారంతో పాటు- జ్యూస్‌లు, పచ్చళ్లు లాంటివి టూరిస్టులకు విక్రయించటం మొదలుపెట్టారు. దీనితో వారికి అదనపు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం సింధుదుర్గ ప్రాంతానికి వెళ్లిన వారందరూ ‘హిర్‌కాని’కి తప్పనిసరిగా వెళ్తారు’’ అంటారు రష్మి.

అక్కడితో ఆగకుండా..

సింధుదుర్గ్‌ ప్రయోగం విజయవంతం కావటంతో రాజస్థాన్‌లోని పాలీలో కూడా హోం స్టేలను రష్మి ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వంతో కలిపి మహిళా సాధికారత కోసం పనిచేయటం మొదలుపెట్టారు. ‘‘ప్రతి ప్రాంతంలోను మహిళలకు ఏదో ఒకటి చేయగలుగుతున్నానే తృప్తి మిగులుతోంది. నేను చేస్తున్న ప్రయోగం చిన్నదే కావచ్చు... కానీ కొన్ని వందల కుటుంబాలను ఆదాయాన్ని సమకూరుస్తోంది. తద్వారా వారు నివసించే ప్రాంతం మెరుగుపడుతోంది’’ అంటారు రష్మి. ఆమెలా సామాజిక మార్పును కోరుకొనేవారు మరింతమంది ముందుకు రావాలని కోరుకుందాం.

Updated Date - Mar 28 , 2024 | 04:50 AM