Share News

మలి వయసులో గర్భం

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:24 PM

మలి వయసులో గర్భందివంగత పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా తల్లితండ్రులు, లేటు వయసులో బిడ్డను కనడంతో అందరి దృష్టి ఐవిఎఫ్‌ వైపు మళ్లింది. అయితే ఈ దంపతుల్లాగే పెద్ద వయసులో తల్లితండ్రులయ్యే ప్రయత్నం చేసే పెద్దలు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

మలి వయసులో గర్భం

దివంగత పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా తల్లితండ్రులు, లేటు వయసులో బిడ్డను కనడంతో అందరి దృష్టి ఐవిఎఫ్‌ వైపు మళ్లింది. అయితే ఈ దంపతుల్లాగే పెద్ద వయసులో తల్లితండ్రులయ్యే ప్రయత్నం చేసే పెద్దలు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

2021 కృత్రిమ పునరుత్పత్తి ప్రక్రియ నియంత్రణ చట్టం (ఆర్టిఫిషియల్‌ రిప్రొడక్టివ్‌ టెక్నిక్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) ఈ చికిత్సను ఆశ్రయించే దంపతుల్లో మహిళల వయో పరిమితిని 50 ఏళ్లకూ, పురుషుల వయో పరిమితిని 55 ఏళ్లకూ పరిమితం చేసింది. తల్లీబిడ్డల ఆరోగ్యభద్రత కోసం, బిడ్డ భవిష్యత్తు కోసం ప్రభుత్వం సూచించిన నియమాలను లెక్క చేయకుండా, మలి వయసులో ఐవిఎఫ్‌ ద్వారా బిడ్డలను కనే వాళ్లున్నారు. కెరీర్‌ పరంగా ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు, అదే పనిగా పెళ్లి వాయిదా వేస్తూ వయసు మీరిపోయిన మహిళలు, సంతాన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, సహజసిద్ధంగా గర్భం దాల్చలేని లేటు వయసు మహిళలు పెద్ద వయసులో గర్భం దాల్చడంలో ఉండే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తల్లీబిడ్డలకు పొంచి ఉండే సవాళ్ల గురించి తెలుసుకోవడం అవసరం.

దుష్ప్రభావాలు లేకపోలేదు

ఐవిఎ్‌ఫకు నిర్దిష్ట వయో పరిమితి లేకపోయినప్పటికీ, 40 ఏళ్లు దాటిని మహిళల్లో అండాల నాణ్యత, మోతాదులు తగ్గిపోతాయి. అలాగే ఐవిఎఫ్‌ విజయమయ్యే అవకాశాలు కూడా పెరిగే వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటాయి. మన దేశంలో మహిళలు మెనోపాజ్‌కు చేరుకునే సగటు వయసు 46 ఏళ్లు. ఈ దశకు 13 ఏళ్ల ముందు నుంచే అండాల నాణ్యత దిగజారడం మొదలవుతుంది. అలాగే పెద్ద వయసు మహిళల్లోని అండాల్లో క్రోమోజోమ్‌ల లోపాలు, జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. గర్భస్రావాలు కూడా ఎక్కువే! కాబట్టి పిల్లలు డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లేటు వయసులో ఐవిఎ్‌ఫను ఆశ్రయించేవాళ్లు దానంగా పొందిన అండాలతో గర్భం దాల్చడం ఉత్తమం.

బిడ్డను పెంచే శక్తి ఉంటుందా?

దానంగా పొందిన అండాలతో గర్భం దాల్చినప్పటికీ, పెద్ద వయసు మహిళల్లో అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ సమస్యలుంటాయి. వీటి మూలంగా గర్భం దాల్చిన తర్వాత, జెస్టేషనల్‌ డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఐవిఎఫ్‌ ద్వారా బిడ్డ పుట్టడంతోనే దంపతుల కథ ముగిసిపోదు. నిజానికి బిడ్డ శ్రేయస్సు కోసం దంపతుల జీవితకాలపు నిబద్ధత బిడ్డ పుట్టుకతోనే మొదలవుతుంది. పిల్లల శ్రేయస్సుకు ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షు కలిగి ఉన్న తల్లితండ్రులు అవసరం. కాబట్టి పెద్ద వయసులో పిల్లలను కనాలనుకునే దంపతులు బిడ్డను పెంచే ఓపిక, వయసుతో పాటు క్షీణిస్తుందనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.

Updated Date - Mar 25 , 2024 | 11:24 PM