Share News

NRI: ఏపీలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్న ప్రవాసులు

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటూ వేలాది మంది ప్రవాసీయులు ప్రచారరంగంలోకి దిగారు.

NRI: ఏపీలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్న ప్రవాసులు

  • వెయ్యి మంది ఎన్నారైలు.. తోడుగా 500 మంది హైదరాబాదీ టెకీలు

హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మాతృభూమిపై మమకారం వారిని ఎన్నికల ప్రచారంలోకి దింపింది. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్ష్యంతో వారు ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నా, తమ విధి నిర్వహణకు కొద్ది రోజులు సెలవు పెట్టి వస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉడతాభక్తిగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటూ వేలాది మంది ప్రవాసీయులు (NRI) ప్రచారరంగంలోకి దిగారు. భవిష్యత్తు తరాల కోసం ఎలాంటి పరిపాలన అవసరమో వారు రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి విజన్ ఉన్న నాయకుడి ఆవశ్యకత ఎంత ఉందో ఆయా వర్గాలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీరికి తోడయ్యారు.


1.jpgవెయ్యి మంది ఎన్నారైలు, మరో 500 మంది టెకీలు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎవరెవరు ఏయే నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగించాలో ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షులు రవికుమార్ వేమూరితో పాటు కానూరి శేషుబాబు, బుచ్చి రాంప్రసాద్, రావి రాధాకృష్ణలు ఎన్నారైలు, టెకీల ప్రచార ప్రక్రియను సమన్వయం చేస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. యూఎస్, యూకే వంటి దేశాలతో పాటు దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల్లో ఏపీ నుంచి వెళ్లి స్థిరపడ్డ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వారు పెద్ద సంఖ్యలో ఏపీలోని వివిధ నియోజకవర్గాలకు చేరుకోగా, ఈ నెల 18 నుంచి నామినేషన్ దాఖలు దృష్ట్యా మరికొందరు తరలిరానున్నారు. మరోవైపు, నేరుగా నియోజకవర్గాలకు వెళ్లలేని ఉద్యోగులు ఫోన్ ద్వారా తమ సన్నిహితుల ద్వారా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగులు పలువురు తొలి దశలో తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు కొనసాగిన సమయంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడిన తీరును వివరిస్తున్నారు.


‘‘ఐటీ రంగం పురోభివృద్ధికి నాడు చంద్రబాబు వేసిన పునాది వల్లే విదేశాల్లో ఈ స్థాయిలో నిలబడ గలిగాం. వ్యాపారాలు చేస్తూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మా కుటుంబాలకు అండగా నిలిచాం. ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోయింది. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. పెట్టుబడులు లేవు. పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అందుకే మంచి ప్రభుత్వం వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది’’ అంటూ సమాజంలో ప్రభావిత వ్యక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. మరుసటి దశలో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, గడిచిన ఐదేళ్లల్లో జరిగిన నష్టం గురించి వారికి తెలియజేస్తున్నారు. ఇక మూడో దశలో ఓటింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ఎన్నారైలు, టెకీలు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రజలు వేసే ప్రతి ఓటూ విలువైందని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 10:26 PM