Share News

MI vs RR: తిలక్ వర్మ విజృంభణ.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:40 PM

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాపార్డర్ ఘోరంగా విపలమైనా.. మిడిలార్డర్ బ్యాటర్ల పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముఖ్యంగా..

MI vs RR: తిలక్ వర్మ విజృంభణ.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే?

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాపార్డర్ ఘోరంగా విపలమైనా.. మిడిలార్డర్ బ్యాటర్ల పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముఖ్యంగా.. మన తెలుగోడైన తిలక్ వర్మ ఈ ఇన్నింగ్స్‌లో హీరోగా నిలిచాడు. టాపార్డర్ కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుని ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగాడు. 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సుల సహకారంతో 65 పరుగులు చేసి.. జట్టుకి మంచి స్కోరు జోడించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతనితో పాటు నేహాల్ వాధేరా కూడా మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 49 పరుగులు చేశాడు. పాపం.. ఒక్క రన్ తేడాతో అర్థశతకం కోల్పోయాడు. మిడిలార్డర్‌లో వీళ్లిద్దరు అద్భుతంగా రాణించడం వల్లే.. ముంబై జట్టు 179 పరుగులు చేయగలిగింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ముంబై జట్టుకి ఆదిలోనే వరుస షాక్‌లోనే తగిలాయి. ఈ సీజన్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ సున్నా పరుగులకే ఔట్ అవ్వగా.. పరుగుల వర్షం కురిపిస్తాడనుకున్న సూర్యకుమార్ (10) సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. చూస్తుండగానే.. మహమ్మద్ నబీ (23) కూడా చేతులెత్తేశాడు. అతడు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించాడు కానీ, ఇంతలోనే ఔట్ అయ్యాడు. 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. ముంబై ఖేల్ ఖతమని అంతా భావించారు. అలాంటి సమయంలో.. తిలక్ వర్మ, నేహాల్ కలిసి జట్టుకి వెన్నెముకలా నిలిచారు. వీళ్లిద్దరూ క్రీజులో నిలదొక్కుకొని.. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎడాపెడా షాట్లతో చెలరేగి ఆడారు. ముఖ్యంగా.. వాధేరా క్రీజులో ఉన్నంతవరకూ ఊచకోత కోశాడు. వీళ్లిద్దరు కలిసి ఐదో వికెట్‌కి 99 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారంటే, ఎలా అదరగొట్టారో అర్థం చేసుకోవచ్చు.

వాళ్లిద్దరు ఆడిన ఆట చూసి.. ముంబై సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని అందుకుంటుందని అంతా భావించారు. కానీ.. ఇంతలోనే రాజస్థాన్ బౌలర్లు పెద్ద షాకిచ్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి.. వరుస వికెట్లు తీయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాధేరా, తిలక్ ఔట్ అయ్యారో.. అప్పటి నుంచి ముంబై మళ్లీ ఢీలాపడింది. పరుగుల సునామీ సృష్టించాల్సిన సమయంలో.. వికెట్లు కోల్పోయింది. ఈ దెబ్బకు ముంబై జట్టు 179 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఫైఫర్ (5 వికెట్లు)తో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో అతడు 18 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

Updated Date - Apr 22 , 2024 | 09:41 PM