Share News

Shikhar Dhawan : గబ్బర్‌ గుడ్‌బై

ABN , Publish Date - Aug 25 , 2024 | 06:00 AM

భారత జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, దేశవాళీతో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. అభిమానులతో గబ్బర్‌ అని ముద్దుగా పిలిపించుకునే 38 ఏళ్ల ధవన్‌.

Shikhar Dhawan : గబ్బర్‌  గుడ్‌బై

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

క్రికెట్‌ నుంచి వైదొలిగిన శిఖర్‌ ధవన్‌

న్యూఢిల్లీ: భారత జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ, దేశవాళీతో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. అభిమానులతో గబ్బర్‌ అని ముద్దుగా పిలిపించుకునే 38 ఏళ్ల ధవన్‌.. రిటైరవుతున్నట్టు శనివారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 2010లో ఆస్ట్రేలియాతో వైజాగ్‌ వన్డే ద్వారా అరంగేట్రం చేసిన ఎడమచేతి బ్యాటర్‌ ధవన్‌ అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగాడు. అయితే ఫామ్‌లేమి కారణంగా రెండేళ్లుగా అతడిని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2022లో బంగ్లాదేశ్‌తో చివరి వన్డే ఆడాడు. ‘నా క్రికెట్‌ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నా. జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నా. చాలాకాలం జట్టు తరఫున క్రికెట్‌ ఆడగలిగాననే ఆనందంతో నా మనసు ప్రశాంతంగా ఉంది. జాతీయ జట్టుకు ఆడాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకున్నా. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కోచ్‌లు, ఢిల్లీ క్రికెట్‌ సంఘం, బీసీసీఐ, నా సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ధవన్‌ అన్నాడు. కాగా.. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యంపై ధవన్‌ స్పష్టత ఇవ్వలేదు. అయితే 2008 ఆరంభ సీజన్‌ నుంచి శిఖర్‌ లీగ్‌లో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.


‘మిస్టర్‌’ ఐసీసీ

2010లో భారత జట్టు తరఫున తొలిసారిగా బరిలోకి దిగిన ధవన్‌కు ఆ మ్యాచ్‌ చేదు జ్ఞాపకంగానే నిలిచింది. ఆస్ట్రేలియాపై రెండు బంతులే ఆడి డకౌటయ్యాడు. ఇక రెండేళ్లుగా జట్టుకు దూరమై ఇప్పుడు ఆట నుంచి తప్పుకొన్నాడు. కానీ ఈ మధ్యలో 14 ఏళ్లు అతడు జట్టుకు అందించిన సేవలను తక్కువగా చూడలేం. జీరోతో సాగిన ధవన్‌ కెరీర్‌ ప్రస్థానం, ఆ తర్వాత పరిమిత ఓవర్లలో విజయవంతమైన ఓపెనర్లలో ఒకడిగా నిలబెట్టింది. రోహిత్‌, విరాట్‌లతో పాటు ధవన్‌ కొంతకాలం భారత బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. అయితే ఆ ఇద్దరి మేనియా ముందు గబ్బర్‌ ఆట పెద్దగా వెలుగులోకి రాలేదనే చెప్పొచ్చు. 2013 నుంచి 2022 వరకు వన్డేల్లో 85కు పైగా స్ట్రయిక్‌ రేట్‌తో దూకుడు కొనసాగించాడు. 2016, 17, 18 సంవత్సరాల్లో అయితే ఇది 100+తో సాగింది. రోహిత్‌తో కలిసి శిఖర్‌ ఓపెనర్‌గా 5,148 పరుగులు అందించగా, ఇందులో 18 సెంచరీ భాగస్వామ్యాలుండడం విశేషం. సచిన్‌-గంగూలీ (21) తర్వాత వన్డే క్రికెట్‌లో ఇదే సెకండ్‌ బెస్ట్‌. ఇక మైదానంలో తొడ గొట్టి చేతిని పైకి లేపి ధవన్‌ చేసుకునే సంబరాలు ఆరోజు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచేవి. ఐసీసీ టోర్నీ (వన్డే వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ)ల్లో ధవన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగేవాడు. ఏకంగా 65.15 అత్యధిక సగటుతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక చాంపియన్స్‌ ట్రోఫీలో ఈ ఢిల్లీ స్టార్‌ పరుగుల వరదే పారించాడు. 2013లో ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడంలో ధవన్‌దే కీలక పాత్ర.


రెండు వరుస సెంచరీలతో మొత్తం 363 పరుగులతో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచాడు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ధవన్‌ (338)వే అత్యధిక పరుగులు. అందుకే అతడిని క్రికెట్‌ వర్గాల్లో మిస్టర్‌ ఐసీసీగా పిలుచుకుంటారు. మరోవైపు తన వందో వన్డేలో శతకం సాధించిన కొద్దిమంది (10) క్రికెటర్లలో శిఖర్‌ ఒకడిగా నిలిచాడు. ఇక ఆసీ్‌సతో వన్డే అరంగేట్రం విఫలమైనా అదే జట్టుతో తన టెస్టు ప్రస్థానాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. సెహ్వాగ్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా ఆడిన అతను 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో నమోదైన ఫాస్టెస్ట్‌ శతకంగా ఇప్పటికీ ఇదే రికార్డు కావడం విశేషం. బుల్లెట్‌ వేగంతో సాగిన ధవన్‌ కవర్‌ డ్రైవ్స్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లకు బౌలర్లు చేష్టలుడిగి పోయేవారు.

కెరీర్‌ సాగిందిలా..

ఫార్మాట్‌ మ్యా ప శ అ. స్కో

టెస్టులు 34 2315 7 190

వన్డేలు 167 6793 17 143

టీ20లు 68 1759 0 92

గమనిక- ఫా: ఫార్మాట్‌; మ్యా: మ్యాచ్‌లు; ప: పరుగులు;

శ: శతకాలు; అ.స్కో: అత్యధిక స్కోరు

బ్యాట్‌తో అద్భుతాలు సృష్టించి, ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడావ్‌. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నీ మోముపై చిరునవ్వు చెదరలేదు. -

బీసీసీఐ

నీ దూకుడైన ఆటను క్రికెట్‌ మైదానం మిస్‌ అవుతుంది. నీ చిరునవ్వు, నీ శైలి, క్రికెట్‌ పట్ల నీకున్న ప్రేమ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది.

సచిన్‌

మొహాలీలో నా స్థానంలో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నీవు వెనుదిరిగి చూడలేదు. అద్భుత ప్రదర్శన చేశావు.

- సెహ్వాగ్‌

అద్భుత కెరీర్‌కు జేజేలు. భవిష్యత్‌లో నువ్వు ఎంచుకోబోయే ఏపనిలోనైనా ఇదే తరహా సంతోషాన్ని నింపుతావని ఆశిస్తున్నా.

- గంభీర్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Aug 25 , 2024 | 06:00 AM