Share News

గుకేష్‌ విజయం.. విశ్వ చెస్‌పై మన ఆధిపత్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:50 AM

‘భారత్‌లో చెస్‌ అభివృద్ధి దిశగా సరైన అడుగులు పడుతున్నాయి. అందుకే ప్రపంచ చెస్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే రోజులు ఎంతో దూరంలో లేవు’ వరల్డ్‌ మాజీ చాంపియన్‌ కార్ల్‌సన్‌ గతేడాది చేసిన వ్యాఖ్య ఇది...

గుకేష్‌ విజయం.. విశ్వ చెస్‌పై మన ఆధిపత్యం

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

‘భారత్‌లో చెస్‌ అభివృద్ధి దిశగా సరైన అడుగులు పడుతున్నాయి. అందుకే ప్రపంచ చెస్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే రోజులు ఎంతో దూరంలో లేవు’ వరల్డ్‌ మాజీ చాంపియన్‌ కార్ల్‌సన్‌ గతేడాది చేసిన వ్యాఖ్య ఇది. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి..నార్వే దిగ్గజం అభిప్రాయం దిశగానే భారత్‌ పయనిస్తోంది. తన కంటే ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తలదన్ని ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజేతగా అంతర్జాతీయ చెస్‌లోకి గుకేష్‌ అనే టీనేజర్‌ దూసుకొచ్చాడు. ఇక.. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో ప్రపంచ టైటిల్‌ కోసం గుకేష్‌ తలపడడమే మిగిలుంది. ప్రస్తుత ఫామ్‌నుబట్టి చూస్తే..వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచే అవకాశమూ గుకే్‌షకి లేకపోలేదు. గుకే్‌షతోపాటు, ప్రజ్ఞానంద, అర్జున్‌ ఇరిగేసి, విదిత్‌ గుజరాతీ, ఆర్‌.వైశాలీ, ద్రోణవల్లి హారిక వంటి భారత గ్రాండ్‌మాస్టర్లు విశ్వ వేదికలపై అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్నారు.


ఇవీ కారణాలు..: ఫిడే అంచనా ప్రకారం దేశంలో ప్రతిభావంతులైన చెస్‌ ఆటగాళ్లు 50వేల మంది ఉన్నారు. ఇలా వేలాదిమంది ప్లేయర్లు ఆవిర్భవించడానికి పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి.. తక్కువ ధరలకే ఇంటర్నెట్‌ డాటా ప్యాక్‌లు లభించడం, సెల్‌ఫోన్లలో చెస్‌ యాప్‌లు అందుబాటులోకి రావడం. ఇంటర్నెట్‌ పుణ్యాన.. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో ఆన్‌లైన్‌ చెస్‌ కోచింగ్‌లకు అవకాశం ఏర్పడింది. తద్వారా మెట్రోపాలిటన్‌ నగరాల్లో చెస్‌ అకాడమీల ద్వారా చిన్నారులకు ఉత్తమ శిక్షణ పొందే మార్గం ఏర్పడింది. అలాగే గత తరం ఆటగాళ్లు యువ ప్లేయర్లకు శిక్షణ ఇస్తూ తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా తర్వాత విస్తారంగా ఆన్‌లైన్‌ టోర్నీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీల ద్వారా యువ ఆటగాళ్లకు గ్రాండ్‌మాస్టర్లతో తలపడే అవకాశాలు లభిస్తున్నాయి. అలా వారు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటున్నారు. ఇలా..అందుబాటులో ఉన్న అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్న దేశ నవతరం చెస్‌ ప్లేయర్లు అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నారు. భారత చెస్‌ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 06:07 AM