Share News

మన బాణం.. బంగారం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:34 AM

అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకాలు కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకున్న తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ మరోసారి అదరహో అనిపించింది. వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1లో ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి కాంపౌండ్‌ ఆర్చరీలో తనకు ఎదురు లేదని నిరూపించింది...

మన బాణం.. బంగారం

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

హ్యాట్రిక్‌ స్వర్ణాలతో జ్యోతి సురేఖ రికార్డు

భారత్‌ ఖాతాలో ఐదు పతకాలు

ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1

షాంఘై: అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకాలు కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకున్న తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ మరోసారి అదరహో అనిపించింది. వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1లో ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి కాంపౌండ్‌ ఆర్చరీలో తనకు ఎదురు లేదని నిరూపించింది. ఈ విజయవాడ ఆర్చర్‌ వ్యక్తిగత, టీమ్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో విజేతగా నిలిచి అరుదైన పసిడి పతకాల హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఇక..కాంపౌండ్‌ ఆర్చరీలో భారత జట్లు మొత్తంగా ఐదు పతకాలు అందుకున్నాయి. కాంపౌండ్‌ విభాగంలో భారత్‌ తన ఆధిపత్యాన్ని చాటుతూ మహిళలు, పురుషలు, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో పసిడి పతకాలను క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఇందులో రెండింటిలో జ్యోతి సురేఖ పాత్ర ఉండడం విశేషం. శనివారం తొలుత జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ, అదితీ స్వామి, పర్నీత్‌ కౌర్‌తో కూడిన భారత త్రయం 236-225తో మర్సిల్లా, ఇరినీ, ఎలీసాతో కూడిన ఇటలీ జట్టును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. అనంతరం మిక్స్‌డ్‌ ఫైనల్లో అభిషక్‌ వర్మ జతగా జ్యోతి సురేఖ 158-157తో లిసెల్‌, రోబిన్‌ (ఎస్తోనియా) ద్వయాన్ని ఓడించి రెండో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.

వ్యక్తిగత విభాగంతో హ్యాట్రిక్‌: మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో వరల్డ్‌ నెం.2 జోతి సురేఖ, టాప్‌సీడ్‌ ఆండ్రియా బికెరా (మెక్సికో) నువ్వా నేనా అనేలా తలపడ్డారు. ఫలితంగా 146-146తో స్కోరు సమమై పోరు షూటా్‌ఫకు దారి తీసింది. అందులోనూ ఇద్దరు 9-9 పాయింట్లతో నిలిచారు. కానీ జ్యోతి బాణం ఇన్నర్‌ రింగ్‌కు దగ్గరగా ఉండడంతో స్వర్ణ పతకాన్ని ఆమెకు ప్రకటించారు. దాంతో 27ఏళ్ల సురేఖ వరల్డ్‌ కప్‌లో హ్యాట్రిక్‌ పసిడి పతకాలు నెగ్గిన రెండో భారత ఆర్చర్‌గా రికార్డులకెక్కింది. 2021లో వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-3లో దీపికా కుమారి ఈ ఫీట్‌ సాధించింది. నిరుడు ఆసియా క్రీడల్లోనూ సురేఖ 3 స్వర్ణాలు గెలిచిన సంగతి తెలిసిందే. పురుషుల టీమ్‌ కేటగిరీలో అభిషేక్‌, ప్రియాన్షు, ప్రథమే్‌షతో కూడిన భారత బృందం 238-231తో నెదర్లాండ్స్‌ను ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్షు రజత పతకం నెగ్గాడు.

అయినా.. గుర్తింపేదీ!

  • ప్రోత్సాహకాలు ఎందుకు ఇవ్వలేదో వారికే తెలియాలి

  • ఆ రెండు ఘనతలు అందుకుంటా

ఆర్చరీ ప్రపంచ కప్‌ కాంపౌండ్‌ విభాగంలో వరుస పతకాలతో రికార్డుల దుమ్ము దులుపుతున్న జ్యోతి సురేఖ తాను సాధించాల్సిన ఘనతలు ఇంకా రెండున్నాయి అంటోంది. వాటిని త్వరలోనే అందుకుంటానంటున్న ఈ తెలుగమ్మాయి.. ఇప్పటికీ తన ప్రతిభకు తగినంత గుర్తింపు దక్కలేదని బాధపడుతోంది. ఆ మధ్య అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు తనను ఎంపిక చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటోంది. ఇవే కాదు.. క్రీడా ప్రోత్సాహకాల విషయంలోనూ తనకు వివక్ష ఎదురవుతోందంటున్న జ్యోతి సురేఖతో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ.

ఒకేరోజు మూడు స్వర్ణాలు సాధించడం ఎలా అనిపిస్తోంది?

నా 18 ఏళ్ల ఆర్చరీ కెరీర్‌లో ఒకే వరల్డ్‌క్‌పలో ఒకేరోజు మూడు స్వర్ణాలు అందుకోవడం నాకిదే తొలిసారి. భారత్‌ తరఫున కాంపౌండ్‌ ఆర్చరీలో ఈ ఘనత సాధించిన తొలి ఆర్చర్‌ను నేనే అని తెలిశాక మరింత ఆనందంగా అనిపించింది. గతంలో ఆసియా క్రీడల్లోనూ మూడు స్వర్ణాలు గెలిచా. ఇక.. నేను సాధించాల్సిన ఘనతలు రెండున్నాయి. ఒకటి ప్రపంచంలోని టాప్‌-8 ఆర్చర్లు పోటీపడే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలవడం.. రెండోది వరల్డ్‌ నెంబర్‌ వన్‌ కిరీటం అందుకోవడం. ఈ రెండు త్వరలో సాధిస్తానన్న విశ్వాసముంది.

వరల్డ్‌క్‌పనకు ఎలా సన్నద్ధమయ్యావు?

వరల్డ్‌కప్‌ ట్రయల్స్‌ ముందు, జనవరిలో అమ్మ (దుర్గ)కు మేజర్‌ శస్త్ర చికిత్స అయింది. ఆ సమయంలో నాన్న (సురేంద్ర), నేను చాలా ఆందోళన చెందాం. అమ్మ ప్రస్తుతం కోలుకుంటోంది. ఈ సంఘటన నుంచి తేరుకొని, వరల్డ్‌కప్‌కు సన్నద్ధమవడం కెరీర్‌లోనే నేను ఎదుర్కొన్న క్లిష్టమైన దశ. నేను ఈ వరల్డ్‌క్‌పలో మూడు స్వర్ణాలు సాధించానని తెలియడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు.

క్రీడా పురస్కారం ఖేల్‌రత్న రాకపోవడానికి కారణాలేంటి?

గత ఏడాది సాధించిన పతకాలు చూసి ఈసారి ఖేల్‌రత్న పురస్కారం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ, రాకపోయే సరికి చాలా వేదనకు గురయ్యా. ఎందుకిలా జరిగిందో అర్ధం కాలేదు. తెర వెనుక ప్రయత్నాలు చేయడం మా కుటుంబానికి తెలియదు. అయినా పురస్కారాలనేవి ప్రతిభకు గీటు రాయి కాదు. మన కష్టానికి ఒక గుర్తింపు మాత్రమే అని తెలుసుకొని, ఆ బాధ నుంచి బయటపడ్డా. ఈసారైనా ప్రభుత్వం నా కష్టాన్ని, నా విజయాలను గుర్తించి ఇస్తే సంతోషం.

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎలా ఉంది?

ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారంపై ఆధారపడి నేను ఈ ప్రయాణం ప్రారంభించలేదు. ప్రపంచ ఆర్చరీలో దేశానికి ఒక గుర్తింపు తీసుకురావాలి, ఆర్చరీ చరిత్రలో నా కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నా. నా సీనియర్లు, సమకాలిన క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాల్లో ఇంటి స్థలాలు, నగదు ప్రోత్సాహకాలు జీఓలతో సంబంధం లేకుండా ఇచ్చారు. నా దగ్గరకు వచ్చేసరికి పాలసీ ప్రకారం ఇస్తామంటారు. ఒక్క నా విషయంలోనే ఇలా ఎందుకు వ్యవహరిస్తారో వారికే తెలియాలి.దీనిపై ఇంకా లోతుగా మాట్లాడితే వివాదమవుతుందేమో!

ఆంధ్రజ్యోతితో జ్యోతి సురేఖ

Updated Date - Apr 28 , 2024 | 01:34 AM