Share News

రాజస్థాన్‌.. తగ్గేదేలె!

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:37 AM

నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటుకుంటున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఖాతాలో వరుసగా నాలుగో విజయం. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 నాటౌట్‌)...

రాజస్థాన్‌.. తగ్గేదేలె!

శాంసన్‌, జురెల్‌ అర్ధసెంచరీలు

లఖ్‌నవూపై విజయం

లఖ్‌నవూ: నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటుకుంటున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఖాతాలో వరుసగా నాలుగో విజయం. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీలతో శనివారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే 16 పాయింట్లతో తమ టాప్‌ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న రాయల్స్‌ దాదాపుగా ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. రాహుల్‌ (76), దీపక్‌ హుడా (50) అర్ధసెంచరీలు సాధించారు. ఛేదనలో రాజస్థాన్‌ 19 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. బట్లర్‌ (34), జైస్వాల్‌ (24) ఫర్వాలేదనిపిం చారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా శాంసన్‌ నిలిచాడు.

సెంచరీ భాగస్వామ్యంతో..: ఛేదనలో ఆర్‌ఆర్‌ ఓపెనర్లు జైస్వాల్‌, బట్లర్‌ తొలి వికెట్‌కు 60 పరుగులతో శుభారంభం అందించారు. వెంటవెంటనే ఈ ఇద్దరూ అవుటైనా కెప్టెన్‌ శాంసన్‌ అండగా నిలిచాడు. రియాగ్‌ (14) నిరాశపరిచినా ధ్రువ్‌ జురెల్‌ సహకరించాడు. నిలకడైన ఆటతీరుతో శాంసన్‌, జురెల్‌ బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ బౌండరీలతో చెలరేగారు. 14వ ఓవర్‌లో జురెల్‌ 4,6,4,4తో 20 రన్స్‌ సమకూరాయి. అటు శాంసన్‌ చెలరేగి 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే జురెల్‌ సైతం ఈ ఫీట్‌ సాధించాడు. ఇక 19వ ఓవర్‌లో 4,6 బాదిన శాంసన్‌ మ్యాచ్‌ను ముగించాడు.

రాహుల్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రాహుల్‌, దీపక్‌ హుడా మాత్రమే కీలకంగా నిలిచారు. అలాగే ఆఖరి మూడు ఓవర్లలో రాజస్థాన్‌ బౌలర్లు ప్రభావం చూపి 24 పరుగులే ఇచ్చి కట్టడి చేశారు. పేసర్‌ బౌల్ట్‌ ఎప్పటిలాగే తొలి ఓవర్‌లోనే డికాక్‌ (8) వికెట్‌తో షాకిచ్చాడు. ఇక స్టొయిని్‌సను రెండో ఓవర్‌లోనే సందీప్‌ శర్మ డకౌట్‌ చేయడంతో లఖ్‌నవూ 11/2 స్కోరుతో తడబాటుకు లోనైంది. కానీ కెప్టెన్‌ రాహుల్‌, దీపక్‌ హుడా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ ఓవర్‌కో బౌండరీ ఉండేలా ఆడారు. ఎనిమిదో ఓవర్‌లో రాహుల్‌ 6,6,4తో 21 రన్స్‌ రాబట్టాడు. ఇదే జోరుతో రాహుల్‌ 31 బంతుల్లో.. హుడా 30 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. అయితే మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 115 పరుగులు జత చేరాక 13వ ఓవర్‌లో హుడాను అశ్విన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత లఖ్‌నవూ ఆటతీరు కూడా గాడి తప్పింది. డెత్‌ ఓవర్లలో పరుగులు నెమ్మదించడంతో పాటు నికోలస్‌ పూరన్‌ (11), రాహుల్‌ల వికెట్లను కూడా కోల్పోయింది. దీంతో స్కోరు 200 దాటలేకపోయింది.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: డికాక్‌ (బి) బౌల్ట్‌ 8, రాహుల్‌ (సి) బౌల్ట్‌ (బి) అవేశ్‌ 76, స్టొయినిస్‌ (బి) సందీప్‌ 0, దీపక్‌ హుడా (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 50, పూరన్‌ (సి) బౌల్ట్‌ (బి) సందీప్‌ 11, బదోని (నాటౌట్‌) 18, క్రునాల్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 196/5; వికెట్ల పతనం: 1-8, 2-11, 3-126, 4-150, 5-173; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-41-1, సందీప్‌ 4-0-31-2, అవేశ్‌ 4-0-42-1, అశ్విన్‌ 4-0-39-1, చాహల్‌ 4-0-41-0.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) స్టొయినిస్‌ 24, బట్లర్‌ (బి) యశ్‌ 34, శాంసన్‌ (నాటౌట్‌) 71, పరాగ్‌ (సి) బదోని (బి) అమిత్‌ 14, జురెల్‌ (నాటౌట్‌) 52, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19 ఓవర్లలో 199/3; వికెట్ల పతనం: 1-60, 2-60, 3-78; బౌలింగ్‌: హెన్రీ 3-0-32-0, మొహిసిన్‌ 4-0-52-0, యశ్‌ ఠాకూర్‌ 4-0-50-1, స్టొయినిస్‌ 1-0-3-1, క్రునాల్‌ 4-0-24-0, అమిత్‌ మిశ్రా 2-0-20-1, రవి బిష్ణోయ్‌ 1-0-16-0.

Updated Date - Apr 28 , 2024 | 01:37 AM