Share News

ఇంటర్‌లో 64.2% ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:37 AM

ఇంటర్మీడియట్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది ఏ గ్రేడ్‌లో పాసయ్యారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్‌

ఇంటర్‌లో 64.2% ఉత్తీర్ణత

ములుగు జిల్లా ఫస్ట్‌.. కామారెడ్డి లాస్ట్‌

ఎక్కువ మంది విద్యార్థులకు ఏ-గ్రేడ్‌.. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి

గురుకులాల్లో 85ు ఉత్తీర్ణత.. ఒకే రోజు ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు

మే 24 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ.. నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది ఏ గ్రేడ్‌లో పాసయ్యారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ ఫలితాలను బుధవారం విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తదితరులు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. ఫస్టియర్‌లో 60.01 శాతం, సెకండియర్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,78,723 మంది విద్యార్థులు హాజరు కాగా 2,87,261 మంది పాసయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు 5,02,280 మంది విద్యార్థులు హాజరు కాగా 3,22,432 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఫస్టియర్‌లో 51.5 శాతం, సెకండియర్‌లో 56.1 శాతం మంది పాసయ్యారు. బాలికలు వరుసగా 68.35 శాతం, 72.53 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌లో (75 శాతానికి పైగా మార్కులతో) ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 1.86 లక్షల మంది, సెకండియర్‌లో 1.94 లక్షల మంది ఏ గ్రేడ్‌ సాధించారు. సెకండియర్‌లో ఉత్తీర్ణత నిరుటితో పోలిస్తే పెరిగింది. ఫస్టియర్‌లో కొంత తగ్గింది. ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం మూడేండ్లుగా తగ్గుతోంది. ఇంటర్‌ ఫలితాల్లో రంగారెడ్డి, ములుగు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఫస్టియర్‌లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం సాధించింది. మేడ్చల్‌ 71.58 శాతం, ములుగు 70.01 శాతంతో రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. సెకండియర్‌లో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానం సాధించింది. మేడ్చల్‌ 79.31 శాతం, రంగారెడ్డి 77.63 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఫస్టియర్‌తో పాటు సెకండియర్‌లో కూడా కామారెడ్డి వరుసగా 34.81 శాతం, 44.29 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది.

inte.jpg


ఎవరూ అధైర్యపడొద్దు: బుర్రా వెంకటేశం

పరీక్షల్లో ఫెయిలైన, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు అధైర్యపడొద్దని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. ఫలితాలపై మానసిక ఆందోళనకు గురయ్యేవారి కోసం టెలీమానస్‌ ఏర్పాటు చేశామని, 14416 నంబర్‌కు కాల్‌చేసి కౌన్సెలింగ్‌ తీసుకోవచ్చని సూచించారు. ఇంటర్‌ కాలేజీల గుర్తింపు ప్రకియను మే నెలలో పూర్తి చేస్తామని చెప్పారు.


మే 24 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

వచ్చే నెల 24 నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2లోపు ఫీజు చెల్లించాలి. మే 24న ఫస్టియర్‌ సెకండ్‌ లాంగ్వేజీ పరీక్షతో మొదలయ్యే ఈ పరీక్షలు జూన్‌ 1 వరకు కొనసాగుతాయి. ఫస్టియర్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ను జూన్‌ 3 నుంచి 7 వరకు నిర్వహిస్తారు. ఇవి ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రీ కౌంటింగ్‌కు రూ.100, రీ వెరిఫికేషన్‌కు రూ.600 ఫీజు చెల్లించాలి. ఫలితాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 040-24655027 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఫలితాలను http-s://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


సత్తాచాటిన గురుకులాలు.. 85 శాతం ఉత్తీర్ణత

ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాలు సత్తా చాటాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు 85శాతం ఉత్తీర్ణత సాధించాయి. అన్నిచోట్లా బాలికలే పైచేయిగా నిలిచారు. సెకండియర్‌ (ఎంపీసీ)లో ఏ దీక్షిత 1000 మార్కులకు 991 మార్కులు సాధించింది. ఇదే గ్రూపులో ఫస్టియర్‌లో ఎం.అంకిత 470 మార్కులకు 469 మార్కులు సాధించింది.

Updated Date - Apr 25 , 2024 | 04:38 AM