Share News

అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు నిందితులపై కఠిన చర్యలొద్దు

ABN , Publish Date - May 04 , 2024 | 05:10 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో మార్ఫింగ్‌కు పాల్పడి వైరల్‌ చేశారనే ఆరోపణల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని

అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు నిందితులపై కఠిన చర్యలొద్దు

ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు.. దర్యాప్తు కొనసాగింపునకు అనుమతి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో మార్ఫింగ్‌కు పాల్పడి వైరల్‌ చేశారనే ఆరోపణల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీపీసీసీ సోషల్‌ మీడియా విభాగానికి చెందిన మన్నె సతీశ్‌తో పాటు ఆస్మా తస్లీం, అంబాల శివకుమార్‌, నవీన్‌, కోయ గీత, పెండ్యాల వంశీకృష్ణ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. ‘ఫేక్‌ వీడియోకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఆరోపణలపై షింకు శరణ్‌సింగ్‌ అనే ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి మాకు నోటీసు జారీ చేశారు. సీఆర్పీసీ సెక్షన్‌ 91/160 కింద జారీచేసిన ఈ నోటీసులను కొట్టేయాలి’ అని పేర్కొంటూ లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం వాదనలు నమోదు చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. అమిత్‌ షా ఫేక్‌ వీడియో ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసులు తమ క్లయింట్లపై కేసు నమోదు చేశారని.. ఈ కేసులో బెయిల్‌ సైతం వచ్చిందన్నారు. ఒకే రకమైన ఫిర్యాదు, ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మరో కేసు నమోదు చేయడం చెల్లదని.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు జారీ చేసిన నోటీసులను కొట్టేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని.. అయితే దర్యాప్తు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉద్యోగి షింకు శరణ్‌ సింగ్‌కు వ్యక్తిగత నోటీసు పంపేందుకు పిటిషనర్లకు హైకోర్టు అనుమతించింది. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.


నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌..

మరోవైపు, హైదరాబాద్‌ పోలీసులు తమ అదుపులోని మన్నె సతీశ్‌, ఆస్మా తస్లీం, నవీన్‌, గీత, వంశీకృష్ణను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారు కోర్టును బెయిల్‌ కోరగా.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున రెండేసి ష్యూరిటీలు సమర్పించాలని.. సోమ, శుక్రవారాల్లో ఎన్‌హెచ్‌వో ఎదుట హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది.

Updated Date - May 04 , 2024 | 05:10 AM