Share News

రేవంత్‌ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా

ABN , Publish Date - May 04 , 2024 | 05:11 AM

పంద్రాగస్టులోగా ఆరు గ్యారెంటీలతోపాటు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే సిద్దిపేటకు సీఎం రేవంత్‌రెడ్డిని తానే స్వయంగా ఆహ్వానిస్తానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు

రేవంత్‌ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానిస్తా

బీజేపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌

చెరో 8 ఎంపీ సీట్లు పంచుకున్నారు: హరీశ్‌రావు

సిద్దిపేట/అక్కన్నపేట, మే 3 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టులోగా ఆరు గ్యారెంటీలతోపాటు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే సిద్దిపేటకు సీఎం రేవంత్‌రెడ్డిని తానే స్వయంగా ఆహ్వానిస్తానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. ఆయనకు స్వాగతం పలికి శాలువా కప్పుతానన్నారు. అలాగే స్పీకర్‌కు తన రాజీనామా పత్రం సమర్పించి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. ఒకవేళ మాట నిలబెట్టుకోకుంటే తన పదవికి రాజీనామా చేసి కొడంగల్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అంటూ రేవంత్‌కు సవాల్‌ విసిరారు. శుక్రవారం హరీశ్‌రావు సిద్దిపేటలోని తన నివాసంలో విలేకరులతో, హుస్నాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధి అక్కన్నపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లోనూ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. చెరో 8 ఎంపీ సీట్లు గెల్చుకునేలా ఒప్పందం చేసుకున్నాయని, ఒకరి కోసం ఒకరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వీరి అక్రమ బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడానికి బీజేపీ, కాంగ్రె్‌సలు కుట్రపన్నాయని ఆరోపించారు. రేవంత్‌ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, రాష్ట్రంలో భూముల ధరలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పైగా కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదని ఇదే గడ్డపై మాట్లాడడంతో ప్రజలు నవ్వుకున్నారన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి తన గురువు మాజీ సీఎం చంద్రబాబుతో కలిసి శిష్యుడు సీఎం రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Updated Date - May 04 , 2024 | 05:11 AM