Share News

బీఆర్‌ఎస్‌కు 2 సీట్లూ రావు

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:42 AM

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు రెండు ఎంపీ సీట్లు కూడా రావని, ఒక వేళ వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తామని, మహిళలకు రూ.2500 పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌కు 2 సీట్లూ రావు

వస్తే మంత్రి పదవికి రాజీనామా: మంత్రి కోమటిరెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా

కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలున్నాయి: మంత్రి ఉత్తమ్‌

రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా భారీ ర్యాలీ

హైదరాబాద్‌/నల్లగొండ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు రెండు ఎంపీ సీట్లు కూడా రావని, ఒక వేళ వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తామని, మహిళలకు రూ.2500 పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ రెండు పథకాలు అమలు చేస్తే కేసీఆర్‌ రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చుంటారా? అని ప్రశ్నించారు. నల్లగొండలో బుధవారం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేస్తే.., ఇక్కడ కట్టె పట్టుకొని వస్తోన్న కేడీ ఏపీ రాష్ట్ర సీఎం జగన్‌తో దోస్తానా చేసి సాగర్‌, శ్రీశైలంను ఎండబెట్టారని విమర్శించారు. తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడింది తామేనని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా, మంత్రులుగా తామంతా ఒక జట్టులా పని చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఉద్యోగాలివ్వలేదని, రేవంత్‌ సీఎం అయ్యాక మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. ‘ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంగారు భవిష్యత్‌ ఉంది. ఆయనకు సీఎం పదవి నిర్వహించే అన్ని అర్హతలున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తున్నా. కోమటిరెడ్డికి నా శుభాకాంక్షలు. అభినందనలు’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో రఘువీర్‌ను ఎంపీగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్లడిగే అర్హత లేదని, దేశంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర ప్రధాని మోదీది అని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో నల్లగొండ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


కేసీఆర్‌ వల్లే నీటిపారుదల శాఖ నాశనం

కేసీఆర్‌ వల్లే రాష్ట్రంలో నీటిపారుదల శాఖ నాశనమైందని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌లో కోర్టులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ‘‘రూ.2లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్‌ చేస్తానంటే ఇది జోక్‌గా ఉంది. మీ అవగాహనరాహిత్యం, మీ అవినీతి వల్ల, మీ కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ నాశనమయ్యాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను రక్షించలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆరే’’అని ఉత్తమ్‌ మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ఇప్పటికే 7111 కేంద్రాలను ప్రారంభించామని గుర్తు చేశారు. ‘‘కేసీఆర్‌కు నాలెడ్జ్‌ ఉందనుకున్నా. నిన్న ఒక చానెల్‌తో ఏం మాట్లాడిండో, ఎందుకు మాట్లాడిండో అర్థం కాలేదు. ఆయనకు మెంటల్‌ బ్యాలెన్స్‌ లేదనపిస్తోంది. అయినా బిడ్డ జైల్లో ఉంటే... ఏ తండ్రి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది’’ అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎ్‌సకు 8 సీట్లు కాదుగదా... 8 నుంచి 12 సీట్లలో డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 04:42 AM