Share News

CM Revanth : కేసీఆర్‌.. రైతు ఖాతాలు చూడు

ABN , Publish Date - May 09 , 2024 | 05:54 AM

‘‘కేసీఆర్‌.. రైతుభరోసా వచ్చిందో రాలేదో.. ఏ రైతు ఖాతాలోనైనా చూడు. ఈ నెల 9లోపు రైతుభరోసా వేస్తానని.. వేయలేకపోతే అమరవీరుల స్తూపం వద్ద

CM Revanth : కేసీఆర్‌.. రైతు ఖాతాలు చూడు

కేసీఆర్‌.. రైతు ఖాతాలు చూడు

మే 9లోపు రైతుభరోసా నిధులు వేస్తానన్నా.. 69 లక్షల మందికి ఆరో తేదీలోపే వేశా

సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును వదిలిస్తా.. నిజామాబాద్‌ రైతుల్ని పట్టించుకోని మోదీ

ఆర్మూర్‌, నిజామాబాద్‌ సభల్లో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

నిజామాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌.. రైతుభరోసా వచ్చిందో రాలేదో.. ఏ రైతు ఖాతాలోనైనా చూడు. ఈ నెల 9లోపు రైతుభరోసా వేస్తానని.. వేయలేకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశా. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈనెల 6వ తేదీలోపే రైతుబంధు నిధులు వేశా. కేసీఆర్‌కు సిగ్గుంటే అమరవీరుల స్తూపం వద్ద.. లేదా ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోపు 2లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అన్నారని గుర్తుచేసిన రేవంత్‌.. ‘‘ఆర్మూర్‌ సిద్దులగుట్ట సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15కల్లా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తా. సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును శాశ్వతంగా వదిలిస్తా’’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌తోపాటు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్‌ సమావేశాల్లో రేవంత్‌ మాట్లాడారు. 2014లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో తనను గెలిపిస్తే వంద రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారని.. కానీ, ఆమె ఆ హామీని నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. దీంతో 2019 ఎన్నికల్లో వంద మంది రైతులు నామినేషన్లు వేసి.. మోసం చేసిన కవితను ఓడించారని, ఆ ఎన్నికల్లో బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన ధర్మపురి అర్వింద్‌ను గెలిపించారని గుర్తుచేశారు.

ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకువస్తానన్న అర్వింద్‌ కూడా ఐదేళ్లు గడిచినా.. ఆ హామీ నెరవేర్చలేదన్నారు. ఆర్మూర్‌ రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని రేవంత్‌ ఆవేదన వెలిబుచ్చారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు రావాలన్నా.. చక్కెర కర్మాగారాలు తెరుచుకోవాలన్నా.. వ్యవసాయం తెలిసిన ఆదర్శ రైతు జీవన్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తాము చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని.. ఫ్యాక్టరీలను తెరిపించడానికి ప్రయత్నాలను చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 43 కోట్ల రూపాయలను బకాయిల చెల్లింపుల కోసం విడుదల చేశామన్నారు.


మోదీపై మండిపాటు..

కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నిజామాబాద్‌ రైతులను మోసం చేశారని.. నిజామాబాద్‌కు స్మార్ట్‌ సిటీ తేలేదని, చెరకు ఫ్యాక్టరీలను తెరిపించలేదని.. చెరకు రైతులకు మద్దతు ధర ఇవ్వలేదని రేవంత్‌ మండిపడ్డారు. ‘‘మళ్లీ గెలిపిస్తే ఇక్కడి ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామన్న వారిని గద్దె దించాలి’’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తీసేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పదేళ్లకొకసారి చేపట్టే జనాభా లెక్కలను 2021లో ఎందుకు చేపట్టలేదని.. దేశవ్యాప్తంగా బీసీ కులగణనకు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఇచ్చింది ఏమీ లేదన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన ఏ హామీలనూ నెరవేర్చనందుకు బీజేపీని గెలిపించాలా అని సీఎం ప్రశ్నించారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని.. రాష్ట్రంలో ఆ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టి రిజర్వేషన్‌ పెంచే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు.

పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్రంలో తమ ప్రభుత్వం పదేళ్లపాటు ఉంటుందని రేవంత్‌ పేర్కొన్నారు. ‘‘కానీ.. తెలంగాణ కేడీ కేసీఆర్‌ మాత్రం మేం దిగిపోవాలంటున్నారు’’ అని దుయ్యబట్టారు. ‘బిడ్డ బెయిల్‌ కోసం నిజామాబాద్‌ కార్యకర్తల గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెడతావా!?’ అని కేసీఆర్‌ను నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచినా.. బీఆర్‌ఎస్‌ గెలిచినా.. ఒక్కటేనని, కేడీ, మోదీ ఒక్కటేనని ఆరోపించారు. ప్రజల రక్షణకు అండగా ఉండే కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ అభివృద్ధికి తాను అండగా ఉంటానని.. జీవన్‌రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్‌కు రింగ్‌రోడ్‌ వేయించే బాధ్యత తనదేనని.. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులను కూడా చేపడుతామని రేవంత్‌ హామీ ఇచ్చారు.

Updated Date - May 09 , 2024 | 05:54 AM