Share News

ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసే కుట్ర

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:29 AM

కాంగ్రెస్‌, బీజేపీ ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి, వాటి ప్రాబల్యం పెంచుకునే కుట్రలు చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు.

ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసే కుట్ర

పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ, కాంగ్రెస్‌.. చోటే భాయ్‌, బడే భాయ్‌.. ఎవరికి ఓటేసినా మీటర్లే

పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేదు

హామీలను అమలు చేయని కాంగ్రెస్‌

రైతు బంధు ఉంచుతరో ఊడగొడతరో

మహబూబ్‌నగర్‌ రోడ్‌ షోలో కేసీఆర్‌

తెలంగాణ కోసం అందరూ పోరాడితే

తాను నాయకత్వం వహించానని వ్యాఖ్య

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌, బీజేపీ ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి, వాటి ప్రాబల్యం పెంచుకునే కుట్రలు చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌ బీ టీం అని బీజేపీ అంటుందని, బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్‌ ఆరోపిస్తుందని, నిజానికి బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ ప్రభుత్వాన్ని నడిపిందని, ప్రాణం పోయినా సెక్యులర్‌గానే ఉంటామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివా్‌సరెడ్డి గెలుపు కోసం శుక్రవారం ఆయన రోడ్డు షో నిర్వహించారు.

క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ‘రాష్ట్రంలో చోటే భా య్‌, కేంద్రంలో బడే భాయ్‌ల్లో ఎవరికి ఓటు వేసినా వ్యవసాయ బావులవద్ద మీటర్లు పెట్టడం ఖాయం. నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రాణం పోయినా, తలకాయ తెగిపడినా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టనని స్పష్టం చేశా’ అని గుర్తు చేశారు. ప్రధాని మోదీ 2014లో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమ లు కాలేదన్నారు. బేటీ పడావో- బేటీ బచావో, మేక్‌ ఇన్‌ ఇండియా, సబ్‌కా సాత్‌- సబ్‌ కా వికాస్‌, డిజిటల్‌ ఇండియా, అచ్చేదిన్‌, అమృత్‌కాల్‌, ఆత్మనిర్భర భారత్‌, ఫసల్‌ బీమా యోజన ఏవీ అమలు కాలేదన్నారు.

అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని వంద ఉత్తరాలు రాశానని, అయినా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, మెడికల్‌ కాలేజీలు ఏమీ ఇవ్వలేదని తప్పుబట్టారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు మండలాలు, సీలేర్‌ పవర్‌ ప్రాజెక్టును ఏపీకి కట్టబెట్టిందని మండిపడ్డారు. ఆంధ్రోళ్లు నీళ్లెత్తుకుపోతుంటే పాదయత్ర చేసిన రఘువీరారెడ్డికి డీకే అరుణ హారతులు పట్టిందని, అలాంటి వ్యక్తికి ఓటేయాలా? అని ప్రశ్నించారు.


ఐదు నెలల్లో ఏమీ చేయలే...

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలవుతోందని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేదని కేసీఆర్‌ విమర్శించారు. రైతుబంధు కింద రూ.15 వేలు రాలేదని, రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వలేదని తప్పుబట్టారు. ఆడపిల్లలకు స్కూటర్లు ఇవ్వలేదని, కానీ రాష్ట్రంలో లూటీ నడుస్తోందని విమర్శించారు. మహిళలకు రూ.2500 పింఛన్‌ రాలేదని, ఆసరా పింఛన్‌ రూ.4 వేలకు పెరగలేదని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద ఇచ్చే రూ.20 లక్షలను ఆపేశారని ఆరోపించారు. ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీంలో దగా చేస్తుంటే.. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణ నాశనమవుతుంటే కేసీఆర్‌ చూస్తూ ఊరుకోరని, అందరితో కలిసి యుద్ధం చేస్తారని తెలిపారు. ఐదు నెలల్లో ఏం చేశావని సీఎంను అడిగితే గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా, పేగులు పీకి మెడల వేసుకుంటా, ముడ్డి మీద చెడ్డి గుంజుకుంటా, చర్లపల్లి జైల్లో వేస్తా అని అనడం మర్యాదనా అని ప్రశ్నించారు.

తెలంగాణ కోసం అందరూ కలిసి పోరాడితే. నేను నాయకత్వం వహించాను. పదేండ్లలో ఏనాడూ కరెంటు పోలేదు. ఇప్పుడు అసలు ఎప్పుడు ఉంటుందో తెలియడం లేదు. మహబూబ్‌నగర్‌ రైతు లు 30 ఎకరాల భూమి ఉండి కూడా హైదరాబాద్‌లో ఆటోలు నడుపుకునేవారు.

అలాంటి వారిని ఆదుకోవాలని రైతుబంధు పెట్టాం. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నవారికే ఇస్తామని అంటే.. వారి అయ్య జాగీరా!? ఆరే డు ఎకరాలున్న రైతులు కోటీశ్వరులా!? 25 ఎకరాలపైన ఉన్నవారికి బంద్‌ చేస్తే ఒక లెక్క ఉంటది. ఐదెకరాలకే బంద్‌ పెడతారట. రైతుబంధు, రైతుబీమా ఉంచుతారో, ఊడగొడుతారో తెలియడం లేదు్‌్‌ అని వ్యాఖ్యానించారు.

వారి మెడలు వంచాలంటే కులాలు, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రె్‌సకు ఓటు వేస్తే.. బీజేపీ గెలుస్తుందని, బీజేపీ గెలవడం దేశానికి మంచిది కాదని ముస్లిములకు పిలుపునిచ్చారు.

Updated Date - Apr 27 , 2024 | 06:29 AM