Share News

మొన్ననే పెళ్లాయె.. సంసారం సర్దుకోవాలిగా!

ABN , Publish Date - May 04 , 2024 | 05:24 AM

‘‘మొన్ననే పెళ్లాయె.. సంసారం సర్దుకోవాలి కదా’’.. అని కాంగ్రెస్‌ పాలనలో హామీల అమలు తీరుపై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సరదాగా వాఖ్యానించారు.

మొన్ననే పెళ్లాయె.. సంసారం సర్దుకోవాలిగా!

కాంగ్రెస్‌ పాలనలో హామీల అమలుపై జగ్గారెడ్డి వ్యాఖ్య

ప్రజలు కోరుకున్నట్టే కాంగ్రెస్‌ పాలన ఉంటుందని వెల్లడి

నర్సాపూర్‌/సంగారెడ్డి, మే 3 (ఆంధ్రజ్యోతి): ‘‘మొన్ననే పెళ్లాయె.. సంసారం సర్దుకోవాలి కదా’’.. అని కాంగ్రెస్‌ పాలనలో హామీల అమలు తీరుపై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సరదాగా వాఖ్యానించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీ, రోడ్డుషోలో జగ్గారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ.. మొన్ననే కదా పెళ్లయింది.. అప్పుడే పిల్లలంటే ఎలా? సంసారం సర్దుకోవాలి కదా.. అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పంచాయి. కాంగ్రె స్‌ మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజ లు కోరుకున్నట్టుగానే కాంగ్రెస్‌ పాలన ఉంటుందని, నిరుత్సాహపడవద్దన్నారు. అనంతరం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేస్తున్నామని చెప్పారు. వంద రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200యూనిట్ల మేర ఉచిత విద్యుత్తుతోపాటు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచామన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రె్‌సను నంబర్‌ వన్‌గా నిలపాలని ప్రజలను కోరారు. ఇక్కడి నుంచి కాంగ్రె్‌సకు 20 వేల ఓట్ల మెజార్టీ ఇస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ జరుగుతాయన్నారు. స్థానిక నేతలు చెబుతున్నట్లుగా 50వేల ఓట్ల మెజార్టీ ఇస్తే నియోజకవర్గానికి ఏం కావాలో తానే దగ్గరుండి చేయిస్తానని హామీ ఇచ్చారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని, కాంగ్రెస్‌ పాలనలో అందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దళిత, గిరిజన కుటుంబాలకు రూ. 6లక్షలతో, ఇతరులకు రూ.5 లక్షలతో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వడ్డీలేని రుణాలను అందించి పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Updated Date - May 04 , 2024 | 05:24 AM