Share News

తుపాకీ మిస్‌ఫైర్‌.. సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:18 AM

ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో బుల్లెట్‌ ఛాతిలోకి దూసుకెళ్లి సీఆర్పీఎ్‌ఫలోని ఓ డీఎస్పీ స్థాయి అధికారి మృతి చెందారు. ఈ ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా చర్ల

తుపాకీ మిస్‌ఫైర్‌.. సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి

భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో ఘటన

భద్రాచలం ఏప్రిల్‌ 24: ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో బుల్లెట్‌ ఛాతిలోకి దూసుకెళ్లి సీఆర్పీఎ్‌ఫలోని ఓ డీఎస్పీ స్థాయి అధికారి మృతి చెందారు. ఈ ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో జరిగింది. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన శేషగిరిరావు(47) చర్ల మండలంలోని సీఆర్పీఎఫ్‌ 81 బెటాలియన్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తమ సిబ్బందితో కలిసి విధి నిర్వహణలో భాగంగా పోలీస్‌ క్యాంపునకు కిలోమీటర్‌ దూరంలో ఉన్న పాత పూసుగుప్ప గ్రామంలోని పరిసర ప్రాంతానికి కూంబింగ్‌ వెళ్లారు. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో గల బ్రిడ్జి వద్ద శేషగిరిరావు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి కింద పడింది. ఈ క్రమంలో పైకిలేచి తన ఏకే-47 రైఫిల్‌ను సరి చేసుకుంటుండగా మిస్‌ఫైర్‌ అయ్యి బుల్లెట్‌ ఛాతిలోకి దూసుకెళ్లింది. అపస్మారక స్థితిలో ఉన్న శేషగిరిరావును సీఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌, భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఇతర పోలీసు అధికారులు ఆస్పత్రికి వెళ్లి శేషగిరిరావు మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. చర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 04:18 AM