Share News

హరీశ్‌రావ్‌.. రాజీనామా సిద్ధంగా ఉంచుకో!

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:22 AM

సోషల్‌ మీడియా వారియర్స్‌తో సీఎం రేవంత్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ హరీశ్‌రావుకు అమరవీరుల స్తూపమే గుర్తుకువస్తుందన్నారు. అమరవీరుల స్తూపాన్ని తన మోసానికి ముసుగులా ...

హరీశ్‌రావ్‌.. రాజీనామా సిద్ధంగా ఉంచుకో!

  • పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం

  • ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు..

  • బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లించేస్తాం

  • ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి

  • వాటిని సోషల్‌ మీడియా వారియర్స్‌ తిప్పికొట్టాలి

  • ఇక్కడ కేసీఆర్‌ను ఓడించి సెమీఫైనల్‌లో గెలిచాం

  • కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడం ఫైనల్స్‌

  • కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌తో రేవంత్‌

  • మోదీ కాలనాగు లాంటోడు.. పగ పడతాడు

  • రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి

  • జహీరాబాద్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వారియర్స్‌తో సీఎం రేవంత్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ హరీశ్‌రావుకు అమరవీరుల స్తూపమే గుర్తుకువస్తుందన్నారు. అమరవీరుల స్తూపాన్ని తన మోసానికి ముసుగులా హరీశ్‌రావు మార్చుకున్నారని విమర్శించారు. ఇన్నాళ్లుగా ఆయన ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘‘హరీశ్‌రావు అతితెలివి ప్రదర్శిస్తున్నడు. చాంతాడంత లేఖను రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నడు. తన మామ చెప్పిన సీస పద్యాన్నంతా లేఖలో రాసుకొచ్చిండు. రాజీనామా లేఖ అలా ఉండదు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ లేకపోతే ఆ రాజీనామా చెల్లదు. ఆయన తెలివి మోకాళ్ల నుంచి అరికాళ్లలోకి జారినట్టుంది’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలో ఎవరున్నా ఫర్వాలేదు.. ఈయన పోతే చాలు అన్నకాడికి బీఆర్‌ఎస్‌ వాళ్లు వచ్చిన్రు. కేసీఆర్‌, కేటీఆర్‌కు మనల్ని చూస్తేనే ఒంటిపైన పాములు, జెర్రులు పారినట్లు, పాయింట్‌ పచ్చిగైనట్లు ఉన్నది. అందుకని వారు ఎవరితోనైనా కలుస్తరు. లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు ఇస్తే.. ఏడాదిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తదని కేటీఆర్‌ అంటున్నడు. ఎట్లొస్తది? ఇక్కడ మేమేమైనా అల్లాటప్పగ ఉన్నమా?’’ అంటూ రేవంత్‌ మండిపడ్డారు. సోషల్‌ మీడియా వారియర్లు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. కేసీఆర్‌ను ఓడించడం సెమీ ఫైనల్‌ అయితే.. ఇప్పుడు మోదీని ఓడించడం ఫైనల్‌ అని వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సను ఎలాగైనా ఓడించాలని చూస్తున్న మోదీ, అమిత్‌షా.. కిరాయి మనుషులను పెట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై, రిజర్వేషన్లపై బీజేపీ దాడులు చేస్తోందని, దీనికి మతాన్ని, ఏజెన్సీలనూ ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు.


తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, బోనాల పండుగ నిర్వహించడం కల్వకుంట్ల కవిత నేర్పిందనట్లుగా వ్యవహరిస్తే.. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి నిర్వహించడం బండి సంజ య్‌, అరవింద్‌ నేర్పినట్లు వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌ అన్నారు. భగవంతుడు గుడిలో ఉండాలి... భక్తి గుండెల్లో ఉండాలని పునరుద్ఘాటించారు. ‘‘బీజేపీ భావజాలం ఆర్‌ఎ్‌సఎస్‌ నుంచి వచ్చిన భావజాలం. రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్‌ఎ్‌సఎస్‌ విధానం. ఆర్‌ఎ్‌సఎస్‌ తరహాలోనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది బీజేపీ విధానం’’ అని రేవంత్‌ అన్నారు. మోదీ.. బ్రిటిష్‌ విధానంతో దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ అని వ్యాఖ్యానించారు.

రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకున్న బీజేపీ..

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు తీసేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుందని, దానికి 2/3 మెజారిటీ ఉండాలని అన్నారు. అంటే దాదాపు 400 సీట్లు కావాలని, అందుకే బీజేపీ ఈసారి 400 సీట్లు అన్న నినాదాన్ని ఎత్తుకుందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి సమూల మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఆ పార్టీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. కార్పొరేట్‌ కంపెనీల కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి.. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అంబానీ, అదానీలకు పల్లీ బఠానీల కింద అమ్మేయాలన్న పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

Updated Date - Apr 27 , 2024 | 05:44 AM