Share News

నిప్పుల కొలిమి

ABN , Publish Date - May 04 , 2024 | 05:18 AM

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ వేడిమికి తోడు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యధికంగా 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.

నిప్పుల కొలిమి

రాష్ట్రంలో కొనసాగుతోన్న ఎండల తీవ్రత

కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా 46.7 డిగ్రీలు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అకాల వర్షం

పిడుగుపాటుకు ఇద్దరి మరణం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ వేడిమికి తోడు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యధికంగా 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, ఖమ్మం జిల్లా పమ్మి, సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యధికంగా 46.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా హజీపూర్‌, నల్లగొండ జిల్లా త్రిపురారంలో 46.6, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా 46.1, భద్రాచలంతోపాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కిష్టంపల్లిలో 46.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సూరీడు 40 డిగ్రీల పైబడి నిప్పులు చెరిగాడు. ఇక, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణ్‌పేట్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో శనివారం తీవ్రమైన వడగాడ్పులు వీచే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక, ఎండల తీవ్రత తగ్గేందుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ మిర్యాలగూడలోని క్రైస్తవులు పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. ఇక, పగలంతా ఎండలు మంటపెట్టగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీవర్షాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణా లు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మం డలం పూసుగూడెం పంచాయతీ ఒడ్డు రామవరంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై రైతు బోడ శివారం(40), ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కందిమళ్లవారిబంజర్‌ గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు(32) చనిపోయారు.


‘ఫ్రై’డే.. అట్టుడికిన ఏపీ

అమరావతి, విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికింది. ఈ వేసవిలోనే ఇప్పటి వరకు అత్యధికంగా శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడు, బండి ఆత్మకూరులలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 15 జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, కడప జిల్లా చిన్నచెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1, తిరుపతి జిల్లా పెద్ద కన్నాలిలో 46.9, కర్నూలు జిల్లా పంచలింగాలలో 46.8, చిత్తూరు జిల్లా తవణంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రిజర్వాయర్లలో పడిపోతున్న నీటి మట్టాలు

న్యూఢిల్లీ, మే3: దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొందని.. ముఖ్యంగా దక్షణాదిలోని జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోతున్నాయని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొంది. శుక్రవారం తాజా నివేదికను విడుదల చేసిన సీడబ్లూసీ.. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది ప్రాంతం ఎక్కువ ప్రభావితమైనట్టు గుర్తించింది.


వడదెబ్బకు పది మంది మృత్యువాత

మండుతున్న ఎండలు, వడగాలుల వల్ల వడదెబ్బకు గురై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పది మంది ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతరానికి చెందిన ఎల్లం నర్సిరెడ్డి(65), నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన గుండ్లవల్లి వెంకన్న(55), వరంగల్‌ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన వేల్పుల శ్రీనివాస్‌(55), జనగామ జిల్లా తరిగొప్పలకు చెందిన దామెర సాయిలు(75) వడదెబ్బ వల్ల మరణించారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామానికి చెందిన లింగంపల్లి మొగ్గవ్వ(59), పెద్దపల్లి జిల్లా జీలకుంట గ్రామానికి చెందిన గాండ్ల లింగయ్య(70), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహదేవపురానికి చెందిన పాయం లక్ష్మయ్య(65), అడవిరామవరానికి చెందిన సున్నం సమ్మక్క(50), ఇల్లెందుకు చెందిన కాటేపల్లి శ్రీనివాసరావు(49) కూడా వడదెబ్బ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఖమ్మం నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(45) వడదెబ్బకు ప్రాణాలకు కోల్పోయారు.

Updated Date - May 04 , 2024 | 05:18 AM